Kodi Katthi Case Latest Updates: 'కోడికత్తి కేసు' విచారణ మళ్లీ వాయిదా.. శ్రీనుకు బెయిల్ ఇవ్వాలని ఎస్సీ సంఘాల డిమాండ్

Kodi Katthi Case Latest Updates: 'కోడికత్తి కేసు' విచారణ మళ్లీ వాయిదా.. శ్రీనుకు బెయిల్ ఇవ్వాలని ఎస్సీ సంఘాల డిమాండ్
Kodi Katthi Case Latest Updates: విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో కోడికత్తి కేసు ఘటనపై విచారణ జరిగింది. న్యాయవాదుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. దీంతో పాటు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలన్న ఎన్‌ఐఏ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
Kodi Katthi Case Latest Updates: విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టులో బుధవారం నాడు కోడి కత్తి కేసు విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలన్న ఎన్‌ఐఏ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
Advocate Salim Comments: విచారణ అనంతరం నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్.. కోడి కత్తి కేసు విచారణకు హాజరుకాకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల నుంచి సీఎం జగన్.. శ్రీనివాసరావుని తన తల్లికి దూరం చేశారని ఆగ్రహించారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఎన్‌వోసీ (NOC) అయినా ఇవ్వాలని న్యాయవాదులు కోరారు.
''జగన్‌పై కోడి కత్తితో చేసినట్లు ఏ సాక్షి చెప్పలేదు. సాక్షులుగా ఉన్నవాళ్లు కూడా కత్తితో దాడిచేసినట్లు చూడలేదన్నారు. ఈ కేసులో మజ్జి శ్రీనే అన్ని అయి ఉన్నాడు. మజ్జి శ్రీను తన ఫోన్ విచారణ అధికారులకు ఎందుకు డిపాజిట్ చేయలేదు..?. మావద్ద అన్ని ఆధారాలున్నాయి. సమయం వచ్చినప్పుడు అందిస్తాం. హరీశ్‌సాల్వే పెళ్లికి జగన్ లండన్ వెళ్లారు. కుమార్తెపై ప్రేమతో సీఎం జగన్ వేల కిలోమీటర్లు వెళ్లారు. కానీ, రాష్ట్రంలో ఉన్న విశాఖకు రాలేరా..?. ఒక ఎస్సీ బిడ్డను నాలుగున్నరేళ్లుగా మగ్గిపోయేలా చేస్తున్నారు. పెళ్లికి వీడియోలో శుభాకాంక్షలు చెప్పి, కోర్టుకు హాజరు కావొచ్చు కదా..?. జనుపల్లి శ్రీనివాస్ ఫుడ్ కోర్టులో అనుమతితోనే పనిచేస్తున్నారు. ఐదుగురు వైసీపీ నేతలు పాస్ లేకుండానే ప్రవేశించిన విషయం కోర్టు ముందుంచుతున్నా. ఆరోజు పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ జీపుపై వైసీపీ నేతలు దాడి చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..?'' -సలీం, నిందితుడి తరఫు న్యాయవాది
SC Sanghas Fire on Kodi katthi Incident: కోడి కత్తి కేసు ఘటనపై ఎస్సీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇన్నేళ్ల నుంచి శ్రీనివాసరావుకు బెయిల్ లేకుండా వేధిస్తున్నారని ఆరోపించాయి. ఎస్సీ సంఘాల నాయకుడు బూసి వెంకట్రావు మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌ను శ్రీనివాసరావు పొడిచినట్లు ఎవరూ చూడలేదంటున్నారని వెల్లడించారు. కత్తి ఉంటే జగన్ భుజంపై ఉండాలి..? లేదా శ్రీనివాస్ వద్ద ఉండాలి..?..కానీ, మజ్జి శ్రీను వద్ద ఎందుకు కత్తి ఉంది..? అని ఆయన ప్రశ్నించారు. వాయిదాలు వేసి కేసును ఇన్నాళ్లు లాక్కొచ్చారన్న బూసి వెంకట్రావు.. ఈ కేసులో జనుపల్లి శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వాలని ఎస్సీ సంఘాల తరఫున డిమాండ్ చేశారు.
Accused Srinivasa Rao Shifted to Visakha Central Jail: జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో జరిగిన ఘటనపై నమోదైన కేసు విచారణ.. గత నెల వరకు విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ సాగింది. అక్కడి నుంచి తాజాగా విశాఖకు బదిలీ చేశారు. ఈ క్రమంలో కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ఇన్నాళ్లూ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను ప్రతీ వాయిదాకు రాజమండ్రి నుంచి విశాఖకు తీసుకు రావాల్సి వస్తుండడంతో.. ఇటీవలే నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలని ఎన్‌ఐఏ అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను నేడు కోర్టు అంగీకరించడంతో కోడి కత్తి కేసు నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు.
