వినూత్న పంటల సాగుతో పలువురు రైతుల స్ఫూర్తి

author img

By

Published : Oct 3, 2021, 5:00 AM IST

వినూత్న పంటల సాగుతో పలువురు రైతుల స్ఫూర్తి

సదుపాయం లేకపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తుండటంతో చాలామందికి అప్పులే మిగులుతున్నాయి. రుణమే పాశమై కొందరు బలవన్మరణాలకూ పాల్పడుతుండటం విషాదకరం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వినూత్నంగా ఆలోచిస్తే.. సేద్యంలోనూ లాభాల బాట పట్టవచ్చంటున్నారు పలువురు కర్షకులు. డ్రాగన్‌ ఫ్రూట్‌, యాపిల్‌, ఉద్యాన పంటల సాగు, నాటుకోళ్లు, చేపల పెంపకం.. ఇలా విభిన్న మార్గాల్లో పయనిస్తూ ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నిరూపిస్తున్నారు.

సీమ నేలలో యాపిల్‌

చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లెకు చెందిన రైతు శంకర్‌రెడ్డి గతంలో వేరుసెనగ, చెరకు, పూలు సాగు చేశారు. ప్రస్తుతం యాపిల్‌ పండిస్తున్నారు. శీతల వాతావరణంలో పండే యాపిల్‌ను వేడి ప్రాంతమైన రాయలసీమలో ప్రయోగాత్మకంగా వేశారు. పంజాబ్‌లోని ఓ ప్రైవేట్‌ నర్సరీ నుంచి అన్నా, రెడ్‌ డెలీషియస్‌, హెచ్‌ఆర్‌ఎంఎన్‌-99 (హరిమాన్‌) అనే మూడు రకాలను మూడేసి మొక్కల చొప్పున తెచ్చారు. వాటిని 2020 నవంబరులో నాటారు. హరిమాన్‌ రకం 2021 మార్చికల్లా పూత దశకు వచ్చింది. ఆగస్టుకల్లా చేతికొచ్చింది. ఎకరాకు 300 నుంచి 450 మొక్కల వరకు నాటుకోవచ్చని శంకర్‌రెడ్డి తెలిపారు. యాపిల్‌ సాగుకు నీటి అవసరం తక్కువ. పిందె నుంచి కాయ దశ వరకు వాతావరణాన్ని బట్టి నీటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.

విశాఖ ఏజెన్సీలో..

విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, అనంతగిరి మండలాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. కిలో రూ.150 నుంచి రూ.200వరకు ధర పలుకుతోంది. మొదట్లో తైవాన్‌, కేరళ, కోల్‌కతా నుంచి మొక్కలను తెప్పించుకునేవారు. ఒక్కోటి రూ.80 నుంచి రూ.100 వరకు ఉంటుంది. ఎకరానికి 4వేల మొక్కలు నాటవచ్చు. 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో మొక్కల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కొందరు రైతులు స్థానికంగానే అంట్లు కడుతున్నారు. మిగతా రైతులకు ఒక్కో మొక్కను రూ.50 నుంచి రూ.80లకు అమ్ముతున్నారు. అనంతపురం, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల రైతులు స్థానికంగా కొంత అమ్ముతూ మిగిలిన పండ్లను ఎగుమతి చేస్తున్నారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో లాభాల పంట పండించవచ్చని నిరూపిస్తున్నారు ఈ రైతులు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే.. సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చంటున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన వనిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన అశోక్‌రాజు, విశాఖపట్నం జిల్లాకు చెందిన జస్టిన్‌ ఇదే కోవకు చెందుతారు. శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ శాఖలో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి పొలం బాట పట్టారు. 2005లో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆరుట్ల గ్రామంలో 13 ఎకరాల్లో తోట పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

శ్రీనివాస్‌రెడ్డి

పెట్టుబడి.. రాబడి

ఎకరా విస్తీర్ణంలో తోట వేసేందుకు తొలి ఏడాది రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఏటా ఎరువులు, చీడపీడల నివారణ, కూలీలు, విద్యుత్తు బిల్లులు కలిపి గరిష్ఠంగా రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. రెండో ఏడాది నుంచి ఫలసాయం చేతికందుతుంది. రెండో ఏడాది కనీసం 5 టన్నులు, మూడు నుంచి నాలుగేళ్లలో 6-10 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటున్నారు. తోట వద్దే రిటైలర్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి కొంటున్నారు. కిలో రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఎకరాకు కనిష్ఠంగా 6 టన్నులు పండినా.. కిలో రూ.100కే అమ్మినా.. ఎకరాకు ఏటా రూ.6 లక్షలు సంపాదించవచ్చని ఆయన తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి..

కడప జిల్లా రామాపురం మండలం నాగరాజుపల్లెకు చెందిన అశోక్‌రాజు దిల్లీ, హైదరాబాద్‌లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని తన పొలంలోనే డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు మొదలుపెట్టారు. ఫోన్లపై ఆర్డర్లు పొందుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు పెట్టెల్లో ప్యాకింగ్‌ చేసి పంపుతున్నారు.

ఉప ఉత్పత్తుల తయారీ

విశాఖకు చెందిన యువరైతు జస్టిన్‌ అనంతగిరి మండలంలో మూడెకరాల్లో, విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో మరో రెండెకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. ఇవి కాసిన వెంటనే అమ్ముడవుతున్నాయి. ఇంట్లో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ పండ్లతో కేక్‌, జామ్‌, బిస్కెట్లు, బన్‌, జ్యూస్‌ వంటివి తయారుచేస్తున్నారు. ఈ ఉప ఉత్పత్తులను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాల్సి ఉందని జస్టిన్‌ చెబుతున్నారు.

ఎకరంలోనే నాటుకోళ్లు.. ఉద్యాన పంటలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడుకు చెందిన రైతు దంపతులు చిన్నదివెల జమలయ్య- జ్యోతి ఎకరం పొలంలో ఉద్యానవన పంటలు, నాటుకోళ్ల పెంపకం చేపడుతున్నారు. వీరికి మొత్తం ఆరెకరాల భూమి ఉంది. ఒక చోట ఎకరం, మరోచోట అయిదెకరాల పొలం ఉంది. అయిదెకరాల్లో వరి పండిస్తున్నారు. మిగతా ఎకరంలో సుమారు 250 నాటుకోళ్లు పెంచుతున్నారు. నాటు కోళ్లు, పిల్లల కోసం రేకులతో నిర్మించిన షెడ్డులో ప్రత్యేకంగా గదులు, బోన్లు ఏర్పాటు చేశారు. ధాన్యం, బియ్యం, నూకలను వాటికి మేతగా వేస్తున్నారు.

కడియం నుంచి మొక్కలు తెచ్చి..

ఎకరం పొలంలోనే కోళ్ల షెడ్డు పోను మిగతా స్థలంలో వివిధ రకాల ఉద్యాన పంటలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. కడియం నర్సరీ నుంచి ఏడాది క్రితం మొక్కలు తీసుకొచ్చారు. జామ, మామిడి, కొబ్బరి, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, ద్రాక్ష, పనస, గంగరేగిపండ్లు, అరటితో పాటు టేకు మొక్కలను నాటారు. బెండకాయ, గోంగూర, ఆకుకూరలనూ సాగు చేస్తున్నారు. ఈ పంటలకు డ్రిప్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కోళ్లకు, పంటలకు కలిపి మొత్తం రూ.5 లక్షల పెట్టుబడి పెట్టామన్నారు.

‘సేంద్రియ’ మత్స్య సాగు.. ఆదాయం బాగు

తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి

ఆధునిక పద్ధతుల్లో చేపలను పెంచుతూ అధిక ఆదాయం పొందుతున్నారు కొందరు రైతులు. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టమ్‌ (ఆర్‌ఏఎస్‌) విధానంలో 7 సెంట్ల స్థలంలో ఆరు ట్యాంకులు నిర్మించి 15 వేల చేపపిల్లలు వేసి 14 టన్నుల దిగుబడి సాధించారు గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామానికి చెందిన సత్యదేవ్‌రాజు. ఇప్పటికే 5.6 టన్నులు విక్రయించగా మరో 8.5 టన్నుల చేపలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఎకరం విస్తీర్ణంలో పెంచాల్సిన చేపలను 7 సెంట్లలోనే పెంచుతున్నారు. చెరువుల్లో సంప్రదాయంగా 15 వేల చేపలను పెంచడానికి 5 కోట్ల లీటర్ల నీరు అవసరం కాగా.. కేవలం 1.06 లక్షల లీటర్లతోనే సాగు చేపట్టారు.

ప్రతి 90 నిమిషాలకు నీరు శుభ్రం

ఆర్‌ఏఎస్‌ విధానంలో 7సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆక్వా ఫామ్‌లో ఆరు తొట్టెలు, నీటిని శుభ్రపరిచే వ్యవస్థను అమర్చారు. ఇందులో నీరు చాలావరకు గ్రావిటీ ద్వారా ప్రవహించేలా ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్తు ఖర్చు తగ్గుతుంది. 90 నిమిషాల్లో 1.06 లక్షల లీటర్లు శుభ్రమవుతాయి. దీనివల్ల చేపలు ఆరోగ్యంగా ఉండడంతోపాటు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్టుకు రూ.32 లక్షల ఖర్చయింది. ఇందులో పావు కిలో చేపపిల్ల తెచ్చి 5-6 నెలల పాటు పెంచితే కిలో నుంచి 1250 గ్రాముల బరువు వరకు పెరుగుతాయి. సగటున 14 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మేత మాత్రమే వేసి ఎలాంటి రసాయనాలు ఉపయోగించడం లేదు. సేంద్రియ పద్ధతిలో పెంచినందున కిలో రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. ‘మన ప్రాంతంలో ఏ చేపలు పెరుగుతాయి? మార్కెటింగ్‌ సౌకర్యం వంటి అంశాలను చూసుకున్న తర్వాత సాగు చేపడితే మంచి లాభాలు పొందవచ్చు’ అంటున్నారు సత్యదేవ్‌రాజు.

ఇదీ చదవండి:

PAWAN KALYAN : 'వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.