Dasapalla land scam: కట్టబెట్టాలన్న కంగారే తప్ప.. కాపాడాలనే తపనేదీ?

author img

By

Published : Nov 22, 2022, 9:23 AM IST

Vijayasai Reddy land scam

Dasapalla land scam: 2వేల కోట్ల విలువైన దసపల్లా భూముల్ని కాపాడటం కంటే.. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపైనే ప్రభుత్వానికి శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది. అర్జెంటుగా అప్పగించేద్దామన్న ఆత్రుత తప్ప.. రక్షించాలనే తపన ఇసుమంతైనా లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఆ భూములు ఎక్కడికీ పోవని న్యాయనిపుణులు, విశ్రాంత అధికారులు అంటున్నారు. టీటీడీకి సంబంధించిన ఓ పాత కేసును ఉదహరిస్తున్నారు. కొండపైనున్న 28.93 ఎకరాలపై సుప్రీంకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చినా వెరవకుండా... మొక్కవోని దీక్షతో చేసిన పోరాటన్ని గుర్తుచేస్తున్నారు. అప్పట్లో టీటీడీ చేసినట్లే దసపల్లా భూములపై ప్రభుత్వం ఎందుకు చేయదని ప్రశ్నిస్తున్నారు. దీనంతటికీ కారణం.. ఎంపీ సాయిరెడ్డికి కావాల్సిన వాళ్లకు భూములు కట్టబెట్టే కుట్ర దాగి ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

భూముల్ని ప్రైవేటు పరం చేసేందుకు యంత్రాంగం అమితోత్సాహం

dasapalla land issue: 'దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందినవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అది ప్రభుత్వ భూమి కాదు. ప్రైవేటు భూమి అయినప్పుడు.. నిషేధిత భూముల జాబితా 22A నుంచి తీసేయడంలో తప్పేముంది.. సుప్రీం తీర్పు అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యం. దాన్ని అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. దసపల్లా భూముల్ని ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నవారు 400 మంది.. ప్లాట్ల యజమానులు 64 మంది ఉన్నారు. ఆ 400 ఇళ్లను ఇప్పుడు కూలగొట్టగలమా.. అన్ని దారులూ మూసుకుపోయాక మా ప్రభుత్వం వచ్చింది. 400 కుటుంబాలు బాగుపడతాయని.. 64 మంది స్థలాల యజమానులకు మేలు జరుగుతుందని మేం క్లియర్‌ చేశాం'.. ఇవీ.. తీవ్ర చర్చనీయాంశమైన విశాఖ దసపల్లా భూముల కుంభకోణంపై ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేస్తూ.. స్థల యజమానులుగా చెబుతున్నవారికి మద్దతుగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు.

ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు కలెక్టర్‌ సహా అధికార యంత్రాంగమంతా ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తోంది. మరో పనేమీ లేదన్నట్లు.. దసపల్లా భూముల్ని విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీతో సంబంధాలు ఉన్నాయని , అత్యంత సన్నిహితులని ఆరోపణలు ఉన్న వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు జిల్లా అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. సాయిరెడ్డి చెప్పినట్టు దసపల్లా భూములకు ప్రభుత్వం నీళ్లొదులుకోవాల్సిందేనా..? న్యాయపోరాటానికి అవకాశమే లేదా..?

కొన్నేళ్ల క్రితం తిరుమల కొండపై టీటీడీకి చెందిన 28.93 ఎకరాల భూమిపై తమకే రైత్వారీ పట్టా ఉందంటూ తాళ్లపాక కుటుంబం సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసు గెలిచింది. అయితే ఆ భూములు శ్రీవారికే చెందుతాయని సుదీర్ఘ న్యాయపోరాటం చేసి మరీ..టీటీడీ గెలిచింది. అదే తరహాలో దసపల్లా భూములపైనా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసేందుకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని.. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్​ కృష్ణారావు వంటి విశ్రాంత ఐఏఎస్​ అధికారులు చెబుతున్నా.. ప్రభుత్వానికి ఎందుకు చెవికి ఎక్కడం లేదో తెలియడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక కూడా దసపల్లా భూములు ప్రభుత్వానివేనంటూ... అప్పటి జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌ వాటిని 22Aలో పెట్టారు. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్లూ అదే జాబితాలోనే కొనసాగించారు. వారెవరికీ లేని తొందర ప్రస్తుత కలెక్టర్‌కే ఎందుకో అర్థం కావడం లేదు. ఎంపీ సాయిరెడ్డి సన్నిహితులకు ఆ భూములు కట్టబెట్టేందుకేనా ఆత్రుత అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

దసపల్లా భూముల వ్యవహారానికి.. టీటీడీ కేసుకు సారూప్యం ఉందని తెలీడంతో అప్పటి కేసుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తిరుమల కొండపై ఉన్న భూములకు సంబంధించి బ్రిటిష్‌ ప్రభుత్వమే టీటీడీకి టైటిల్‌ డీడ్‌ ఇచ్చింది. 1960 జనవరి 24న ఈనాం డిప్యూటీ తహసీల్దారు టీటీడీకి రైత్వారీ పట్టా ఇవ్వగా.. 10.33 చదరపు మైళ్ల ప్రాంతం టీటీడీకి చెందుతుందంటూ 1965 నవంబరు 4న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో 2920, 2921 నెంబర్ల టైటిల్‌ డీడ్‌లకు చెందిన 28.93 ఎకరాలపై ఈనాంల రద్దు చట్టం ప్రకారం తమకే రైత్వారీ పట్టా ఉందంటూ... 1982 ఆగస్టులో సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌కు తాళ్లపాక కుటుంబం రివ్యూ పిటిషన్‌ సమర్పించింది.

ఈనాం డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్డీవోతోపాటు సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ కూడా..ఆ భూములు తాళ్లపాక కుటుంబానికే చెందుతాయని ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు ఫుల్‌బెంచ్‌, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పాయి. అయితే..ఆ 29.93 ఎకరాల భూమికి టైటిల్‌ టీటీడీ పేరిట ఉందంటూ అప్పటి జేఈవో బాలసుబ్రహ్మణ్య సబ్‌కోర్టులో.. సివిల్‌ కేసు వేసి సంబంధిత సాక్ష్యాలు చూపించారు. ఈ కేసుపై విచారణ జరపకుండా.. తాళ్లపాక కుటుంబం హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. ‘ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌’ కింద ఆ భూములు టీటీడీకి చెందుతాయని, సంబంధిత పత్రాలన్నీ ఉన్నాయని బాలసుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో టీటీడీ సిబ్బంది కొందరు తాళ్లపాక కుటుంబంతో కుమ్మక్కై ఆ పత్రాల్ని కోర్టు దృష్టికి తీసుకురాలేదని, మోసం జరిగిందని వివరించారు.

మోసం జరిగిందనుకుంటే కింది కోర్టులో నిరూపించుకోవాలన్న సుప్రీం సూచనతో.. టీటీడీ మళ్లీ సబ్‌కోర్టుకు వెళ్లింది. 2004 మార్చిలో బాలసుబ్రహ్మణ్యాన్ని విచారించిన కోర్టు ఆయన సాక్ష్యాన్ని 50 పేజీల్లో రికార్డు చేసింది. అదే ఏడాది జూన్‌ 10న ఆయన పదవీ విరమణ చేశారు. బాలసుబ్రహ్మణ్యం తొమ్మిదేళ్లపాటు జేఈవోగా ఉన్నారని ‘ఫ్రాడ్‌’ జరిగితే ఇన్నాళ్ల తర్వాత ఎందుకు వచ్చారంటూ 2004 ఆగస్టు 11న టీటీడీ పిటిషన్‌ను సబ్‌కోర్టు కొట్టేసింది. దాన్ని టీటీడీ హైకోర్టులో సవాల్‌ చేసింది. అప్పటికే తమిళనాడు వెళ్లిపోయిన బాలసుబ్రహ్మణ్యం.. కేసు ముగిసే వరకు సొంత ఖర్చులతో హైదరాబాద్‌కు తిరిగి న్యాయవాదులకు సహకరించారు. మోసం జరిగిందని నిర్ధారించిన హైకోర్టు..టీటీడీకి అనుకూలంగా తీర్పిచ్చింది. దానిపై తాళ్లపాక కుటుంబం సుప్రీంకోర్టుకెళ్లినా, రివ్యూ పిటిషన్‌ వేసినా చివరికి టీటీడీనే గెలిచింది.

టీటీడీకిచెందిన 28.93 ఎకరాల భూముల విషయంలో.. సాయిరెడ్డి బోర్డు సభ్యుడిగా ఉన్న 2007లోనే అనుకూలంగా తీర్పు వచ్చింది. అంత పెద్ద విషయాన్ని ఆయన అంత తేలిగ్గా ఎలా మర్చిపోయారో తెలియడం లేదు. ఏదైనా కేసులో తప్పుడు విధానాల్లో, తప్పుడు ఆధారాలతో తీర్పు తెచ్చుకున్నారని నిరూపించగలిగితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పయినా చెల్లదంటున్నారు. సుప్రీంకోర్టు కూడా పలు కేసుల్లో అదే చెప్పింది.

12 ఏళ్లపాటు అప్పటి ఈవోల సహకారంతో పోరాడిన బాలసుబ్రహ్మణ్యం.. టీటీడీ భూముల్ని కాపాడారు. మరి దసపల్లా భూముల్ని కాపాడేందుకు ఇంత పెద్ద ప్రభుత్వం ఏమీ చేయలేదా అంటే జవాబు చెప్పే నాథుడే లేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించేందుకు ప్రైవేటు న్యాయవాదులకు కోట్లలో ప్రజా ధనాన్ని ఫీజులుగా చెల్లిస్తున్న ప్రభుత్వం.. 2 వేల కోట్ల విలువైన దసపల్లా భూముల్ని కాపాడేందుకు న్యాయపోరాటం చేయలేదో అంతుచిక్కడం లేదు.

దసపల్లా కుంభకోణంలో సాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ ప్రమేయంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఆ భూముల యజమానులుగా చెబుతున్న 64 మందితో సాయిరెడ్డికి సన్నిహితులైన విశ్రాంత ఐఆర్​ఎస్​ అధికారి ఉమేష్‌, గోపీనాథ్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న అష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ సంస్థ డెవలప్‌మెంట్‌ ఒప్పందం చేసుకుంది. అక్కడ నిర్మించే నివాస భవనాల్లో భూ యజమానులకు 30 శాతం ఇస్తూ, అష్యూర్‌ సంస్థ 70 శాతం తీసుకుంటామనడం తీవ్ర చర్చనీయాంశమైంది. అదో భారీ కుంభకోణమని డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం అష్యూర్‌ సంస్థకు అవ్యాన్‌ నుంచే డబ్బు వెళ్లిందని ప్రతిపక్షాలు ఆధారాలతో ప్రకటించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.