ఆ విషయంలో చేతులెత్తేసిన ఉద్యోగులు... ప్రభుత్వ అంచనాలు తలకిందులు..

author img

By

Published : May 9, 2022, 5:02 AM IST

చెత్త సేకరణ

చెత్తపన్నువసూలు చేసే విషయంలో తమ వల్ల కాదని ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. ఎలాగైనా పన్ను వసూలు చేసి ఆదాయాన్ని సమీకరించుకోవాలన్న ప్రభుత్వ అంచనాలు తలకిందులవుతున్నాయి. అనేకచోట్ల అధికారులు, సిబ్బంది బెదిరిస్తున్నా, చెత్త తెచ్చి దుకాణాల ముందు పారబోసినా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా గత ఆరు నెలల్లో లక్ష్యాలను చేరుకోవడంలో పుర, నగరపాలక సంస్థలు బోర్లా పడ్డాయి.

పట్టణాల్లో చెత్త సేకరణపైనా పన్ను వసూలు చేసి ఆదాయాన్ని సమీకరించుకోవాలన్న ప్రభుత్వ అంచనాలు తలకిందులవుతున్నాయి. అనేకచోట్ల ప్రజలు ససేమిరా అంటున్నారు. వార్డు వాలంటీర్లు, సచివాలయాల్లో ఉద్యోగులు సైతం ఈ పన్ను వసూలు తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరించినందుకు రుసుము వసూలు చేసే విధానాన్ని గత ఏడాది నవంబరులో ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం 32 పుర, నగరపాలక సంస్థల్లో ఈ కార్యక్రమం అమలులో ఉంది. దశలవారీగా అన్ని పట్టణాల్లోనూ అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేకచోట్ల అధికారులు, సిబ్బంది బెదిరిస్తున్నా, చెత్త తెచ్చి దుకాణాల ముందు పారబోసినా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా గత ఆరు నెలల్లో లక్ష్యాలను చేరుకోవడంలో పుర, నగరపాలక సంస్థలు బోర్లా పడ్డాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు వంటి నగరాల్లో గత నెలలో వసూళ్లు 20% కూడా చేరుకోకపోవడమే నిదర్శనం.

పట్టణ ప్రజలపై వరస బాదుడు
ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం పట్టణాల్లో అమలులోకి వచ్చాక రెండేళ్ల వ్యవధిలో రెండుసార్లు ఆస్తిపన్ను పెరగడంతో ప్రజలపై భారీగా భారం పడింది. ఇళ్ల నుంచి నెలకు కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.120 చొప్పున, భారీ వాణిజ్య, వ్యాపార సంస్థల నుంచైతే వేలాది రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రజలు వ్యతిరేకించడంతో వసూళ్లపై సచివాలయాల ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. ముఖం మీదే తలుపులు వేసేసి, మళ్లీ వస్తే బాగుండదని ప్రజలు హెచ్చరిస్తున్నారని విజయవాడలోని వార్డు సచివాలయ ఉద్యోగులు కొందరు 3నెలల క్రితం అధికారుల సమీక్షలో ప్రస్తావించారు. చెత్త పన్ను వసూలు తమతో కాదని తాజాగా గురువారం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వీరు ఆందోళనకు దిగారు.

వసూళ్లకు కొత్త ఎత్తుగడ
చెత్తపై రుసుములు వసూలుకు పుర, నగరపాలక సంస్థలు కొత్త ఆలోచన చేస్తున్నాయి. రుసుములు చెల్లించకపోతే అపార్ట్‌మెంట్లలో చెత్త సేకరణను నిలిపివేస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లను సంప్రదించి నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు పాత బకాయిలు చెల్లిస్తేనే చెత్త తీసుకెళతామని చెబుతున్నారు. ఇళ్ల నుంచి కార్మికులు చెత్త సేకరించక ముందు నగరాల్లోని డివిజన్లలో చెత్తను ఒకేచోట తాత్కాలికంగా నిల్వ చేసే కేంద్రాలు ఉండేవి. ప్రజల్లో ఎక్కువమంది ఇళ్లలో చెత్తను కవర్లతో తెచ్చి అక్కడి ఖాళీ స్థలాల్లో వేసేవారు. వీధుల్లో సేకరించే చెత్తను కార్మికులు కూడా అక్కడికే తెచ్చేవారు. వీటిని వాహనాల్లో డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. కొద్దిరోజులుగా కొన్నిచోట్ల నగరపాలక సంస్థలు ఈ తాత్కాలిక కేంద్రాలను మూసి వేస్తున్నాయి. వీధుల్లో ప్లాస్టిక్‌ బిన్లు కూడా తొలగించారు. దీనివల్ల ప్రజలు తప్పనిసరిగా ఇళ్లలో చెత్తను కార్మికులకే అప్పగించి రుసుములు చెల్లిస్తారన్నది ప్రణాళిక.

...

ఇదీ చదవండి: 'చెత్త పన్ను చెల్లించకపోతే చెత్తవేసి... ఆస్తిపన్నుపై చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.