సీఐడీ నుంచి మాట్లాడుతున్నాం.. ‘మార్గదర్శి’పై ఫిర్యాదులుంటే చెప్పండి

author img

By

Published : Mar 16, 2023, 10:21 AM IST

CID RAIDS AT MARGADARSI

CID RAIDS AT MARGADARSI : మార్గదర్శి సంస్థల్లో ఐదో రోజూ రాష్ట్ర సీఐడీ తనిఖీలు కొనసాగాయి. సోదాల సమయంలో కొన్నిచోట్ల తామిచ్చిన ప్రొఫార్మా ప్రకారం వివరాలు ఇవ్వాలని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. మరికొన్ని చోట్ల దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరు ఖాతాదారులకు ఫోన్‌ చేసిన సీఐడీ అధికారులు.. వివరాలు చెప్పాలని అడిగారు. మార్గదర్శిపై ఇతర రాష్ట్రాల పోలీసులకు, కేంద్ర విభాగాలకు లేఖలు రాసినట్లు... సీఐడీ విభాగాధిపతి సంజయ్‌ ప్రకటించారు.

సీఐడీ నుంచి మాట్లాడుతున్నాం.. ‘మార్గదర్శి’పై ఫిర్యాదులుంటే చెప్పండి

CID RAIDS AT MARGADARSI : రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, ఏలూరు, రాజమహేంద్రవరం మార్గదర్శి కార్యాలయాల్లో ఐదో రోజూ సీఐడీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. కొన్ని చోట్ల తాము ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం వివరాలు ఇవ్వాలని సిబ్బందిపై ఒత్తిడి చేశారు. ఫోన్‌ చేసి కొందరు ఖాతాదారులతో మాట్లాడారు. గుంటూరులో సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్‌.. మార్గదర్శి సిబ్బందికి ఫోన్‌ చేసి తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే కార్యాలయాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. విశాఖ సీతంపేట మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ అధికారులు సుమారు 50 నిమిషాల పాటు దస్త్రాలను పరిశీలించారు.

రిమాండ్‌లో ఉన్న బ్రాంచి మేనేజర్‌ రామకృష్ణను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు... బుధవారం సీతంపేట కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయనకు కొన్ని పత్రాలను చూపించి పలు అంశాలపై ప్రశ్నించారు. అనంతరం జైలుకు తరలించారు. విశాఖపట్నం సీఐడీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ పలువురు ఖాతాదారులకు ఫోన్లు చేసి వివరాలు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఫోన్‌ ఎందుకు చేశారని అడిగితే.. మార్గదర్శిపై కొందరు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. చిట్‌ కట్టిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని చెప్పడంతో.. మీరేమైనా ఇబ్బందులకు గురైతే తెలుసుకుందామని ఫోన్‌ చేశామని సమాధానమిస్తున్నారు. దాదాపు 21 అంశాలపై ఖాతాదారుల నుంచి వివరాలు ఆరా తీశారు.

మార్గదర్శి మేనేజర్‌కు ముందస్తు మధ్యంతర బెయిల్‌: గుంటూరు అరండల్‌పేట మార్గదర్శి కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.శివరామకృష్ణకు.. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్​బీజీ పార్థసారథి ముందస్తు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. శివరామకృష్ణపై పలు అభియోగాలు మోపుతూ అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. ఈ నెల 12న న్యాయమూర్తి ఎదుట హాజరుపరచారు. పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు ఆయనకు వర్తించవంటూ జడ్జి రిమాండ్‌ను తిరస్కరించారు.

41A నోటీసు ఇవ్వాలని ఆ రోజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా సీఐడీ పోలీసులు మరోసారి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అభియోగాలతో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని.. హైకోర్టు న్యాయవాది లక్ష్మీ నారాయణ ద్వారా గుంటూరు జిల్లా న్యాయస్థానంలో శివరామకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో శివరామకృష్ణను ఈనెల 23 వరకు అరెస్టు చేయవద్దని, ఒకవేళ అరెస్టు చేస్తే జామీనుపై విడుదల చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు గుర్తించామని, కేవలం పోలీసు శాఖ ఒక్కటే వీటిని డీల్‌ చేయలేదని.. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం పేర్కొంది. అందుకు ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ వంటి ప్రత్యేక విభాగాలు అవసరమని తెలిపింది. దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించిన సమాచారాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల డీజీపీలు, సీఐడీ విభాగాల అదనపు డీజీపీలకు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్లకు, C.B.DT ఛైర్మన్, .ED డైరెక్టర్, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టేగేషన్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌కు పంపించామని వివరించింది. వారి పరిధిలోకి వచ్చే అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పింది. ఈ మేరకు సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.