కాసేపట్లో పెళ్లి.. అంతా హడావుడి.. కానీ అంతలోనే..!
Published: Mar 17, 2023, 3:35 PM


కాసేపట్లో పెళ్లి.. అంతా హడావుడి.. కానీ అంతలోనే..!
Published: Mar 17, 2023, 3:35 PM
Jewellery Theft : అందరూ పెళ్లి వేడుకలో నిమగ్నమయ్యారు. బంధుమిత్రులతో పెళ్లిపందిరి కళకళలాడుతోంది. కాసేపట్లో వివాహం జరగనుంది. కానీ ఒక్కసారిగా అందరిలో టెన్షన్ మొదలైంది. ఏం జరుగుతుందోనని పెళ్లికి వచ్చినవారు ముచ్చటించుకుంటున్నారు. అంతలోనే పెళ్లికి తెచ్చిన బంగారు ఆభరణాలు మాయమైపోయాయని తెలిసింది. అందరూ గాబరాగా అన్నిచోట్ల వెతికారు. ఎంత వెతికినా నగలు మాత్రం కనిపించలేదు. దీంతో బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఓ వ్యక్తి నగలు తస్కరించినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Jewellery Thefted in Marriage : బంధువుల కోలాహలం.. ఆత్మీయ పలకరింపులు.. పెద్దల అశీర్వాదాల నడుమ వివాహ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అంతలోనే వివాహానికి హాజరైన వారు ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. పెళ్లి కోసం తీసుకువచ్చిన బంగారం కనిపించక పోవటంతో పెళ్లివారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సుమారు రూ. 20 లక్షల విలువ చేసే బంగారం కనిపించకపోవటంతో వధూవరుల కుటుంబంలో ఆందోళన మొదలైంది. బంగారు ఆభరణాలు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో చోరీకి గురైనట్లు విచారణలో తేలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నగలను స్వాధీనం చేసుకుని.. ఘటనకు పాల్పడిన వ్యక్తిని విచారిస్తున్నారు.
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో వివాహ వేడుకలలో చోరీ జరిగింది. కేవీబీపురం మండలంలోని కలతూరుకు చెందిన వికాస్, మహేశ్వరుల పెళ్లి వేడుకలను శ్రీకాళహస్తిలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. వివాహానికి హాజరైన బంధుమిత్రులు వివాహ సంబరాల్లో మునిగిపోయారు. కళ్యాణ మండపంలోని ప్రాంగణమంతా పెళ్లి ఏర్పాట్లతో నిండిపోయి.. సందడిగా మారిపోయింది. అందరూ వివాహ కార్యక్రమంలో నిమగ్నమై పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో గదిలో భద్రపరచిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
ఎంత వెతికినా లభించని ఆభరణాలు: చోరీకి గురైన ఆభరణాలు సుమారు 50 సవర్ల వరకు ఉంటాయని వధూవరుల కుటుంబసభ్యులు తెలిపారు. ఆభరణాలు కనిపించకపోవటాన్ని గమనించి కల్యాణ మండపం అంతటా గాలించారు. ఎంత వెతికినా వాటి ఆచూకీ లభించకపోవటంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కేసును ఛేదించిన పోలీసులు : కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక విభాగాలుగా విడిపోయి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. కళ్యాణ మండపంలో పని చేసే వారిని, చుట్టుపక్కల ఉన్న దుకాణదారుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు వివరించారు. నగలు చోరీకి గురైనట్లు గుర్తించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొన్నారు. ఓ వ్యక్తి వద్ద నగలు ఉన్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆభరణాలను స్వాధీనం చేసుకుని.. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నగలు పోయిన గందరగోళ పరిస్థితులలోనే పెళ్లి తంతు ముగించారు. పోయిన నగలు వెంటనే దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి :
