విశాఖ, తిరుపతిలో రెచ్చిపోయిన ఆకతాయిలు.. గంజాయి, మద్యం సేవించి
Published: Mar 14, 2023, 4:54 PM


విశాఖ, తిరుపతిలో రెచ్చిపోయిన ఆకతాయిలు.. గంజాయి, మద్యం సేవించి
Published: Mar 14, 2023, 4:54 PM
Ganja Batch attacked RTC driver and conductor: రెండు వేరు వేరు ఘటనల్లో దుండగులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. విశాఖలో ఆరుగురు వ్యక్తులు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. తిరుపతి నగరంలో అర్దరాత్రి ఇంటి వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టి పరారయ్యారు.
Ganja Batch attacked RTC driver and conductor: విశాఖ మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై ఆరుగురు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఘటనలో కండక్టర్ పి. శశిభూషణరావు, డ్రైవర్ బి.లక్ష్మణరావులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని తోటి సిబ్బంది కేజీహెచ్ కు తరలించారు. ఆసుపత్రిలో డ్రైవర్, కండక్టర్ ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కండక్టర్ తలకు తీవ్ర గాయమైంది. మద్దిలపాలెం డిపోకు సమీపంలో ఎస్. ఎం రోడ్డులో ఆర్టీసీ అద్దె బస్సును అక్కడ నుంచి బయలుదేరేందుకు ఉంచారు. బస్సులో కండక్టర్ శశిభూషణరావు ఉన్నారు. డ్రైవర్ లక్ష్మణరావు బస్సును తీసేందుకు వస్తున్నారు.
అదే సమయంలో రెండు మోటార్ బైకులపై వచ్చిన ఆరుగురు అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. దాడి చేస్తున్న విషయాన్ని గుర్తించిన కండక్టర్ బస్సు దిగి, అద్దాలను ధ్వంసం చేయడాన్ని ప్రశ్నించారు. కండక్టర్‌కు సమాధానం చెప్పకుండా, కండక్టర్‌పై దౌర్జన్యం చేసి తీవ్రంగా గాయపరిచారు. అదే సమయంలో బస్సు డ్రైవర్ లక్ష్మణరావు గుర్తించారు. ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నిస్తుండగానే ఆయనపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాడికి గురైన డ్రైవర్ కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఆర్టీసీ సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకుని, నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. దీనిని గమనించి వారు మోటార్ బైకులుపై పరారయ్యారు.అయితే వారిలో ఒక మహిళను మాత్రం పట్టుకున్నారు. తీ టౌన్ స్టేషన్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు అంతా, గంజాయి సేవించి ఉన్నారని ఆర్టీసీ సిబ్బంది భావిస్తున్నారు.
ఆకతాయిల వీరంగం: తిరుపతి నగరంలో అర్దరాత్రి మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. నగరంలోని సంజయ్ గాంధీ కాలనీలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఓ ఇంటి వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు దుండగులు నిప్పు పెట్టి పరారయ్యారు. మంటలు చెలరేగడం గమనించిన స్ధానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటన ప్రదేశానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమీపంలోని బార్లో మద్యం సేవించి ఇలాంటి దారుణానికి ఒడి గట్టారని ఇంటి యజమాని ఆరోపించారు. ఈ ప్రమాదంలో 5 బైకులు, ఒక సైకిల్ అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాడు. తరచూ ఈ ప్రాంతంలో ఆకతాయిలు వీరంగం సృష్టిస్తున్నారని ఆరోపించాడు. రాత్రి సమయంలో కాలనీ వాసులు బయటకు రావాలంటే భయపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
