TTD Kalyanamastu Program: నిర్వహిస్తామని ఊసే మరిచారు.. వారి ఆశలపై నీళ్లు
Published: May 14, 2023, 7:52 AM


TTD Kalyanamastu Program: నిర్వహిస్తామని ఊసే మరిచారు.. వారి ఆశలపై నీళ్లు
Published: May 14, 2023, 7:52 AM
TTD Kalyanamastu Program: నిరుపేద కుటుంబాల్లో పెళ్లి భారం కాకూడదని ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన కల్యాణమస్తు కార్యక్రమం కొండెక్కింది. దీంతో యథావిధిగా కార్యక్రమాన్ని కొనసాగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
TTD Kalyanamastu Program: నిరుపేద కుటుంబాలకు.. తన పిల్లల పెళ్లి.. ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో తిరుమల తిరుమతి దేవస్థానం చేపట్టిన ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమం కల్యాణమస్తు అటకెక్కింది. తితిదే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో విరమించుకుంది. ఆ తర్వాత దాని ఊసే మరచింది. నిరుపేదలకు, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న తితిదే కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కల్యాణమస్తులో పెళ్లి చేసుకుంటే తమ దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని.. కలలుకన్న అనేకమంది జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తీరు నిరాశ కలిగిస్తోంది. నిరుపేద వధూవరులకు బంగారు తాళిబొట్టు ఇచ్చి వివాహం జరిపించేందుకు కల్యాణమస్తు కార్యక్రమాన్ని 2007 సంవత్సరంలో తితిదే ప్రారంభించింది. ఆ తర్వాత ఈ వివాహ ఉత్సవ కార్యక్రమాన్ని ఆరుసార్లు నిర్వహించి తర్వాత దాన్ని పక్కన పెట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తితిదే ధర్మకర్తల మండలిలో చర్చించి కల్యాణమస్తును పునరుద్ధరించాలని నిర్ణయించారు.
దీనికి అనుగుణంగా ఒక గ్రాము బంగారు మంగళ సూత్రంతో పాటు వెండి మెట్టెలు, వధూవరులతోపాటు వచ్చే 20 మందికి భోజనాలు, ఇతర ఖర్చులన్నీ కలిపి జంటకు 32వేల 232 రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని 2020 నవంబరులో ధర్మకర్తల మండలిలో తీర్మానించారు. దీనిపై 2021 ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో చర్చించి ఒక్కో జంటకు రెండు గ్రాముల బంగారు మంగళసూత్రాలు అందించేందుకు తితిదే వద్దనున్న 20వేల మంగళసూత్రాలను వినియోగించుకునేందుకు ఆమోదించారు. గత ఏడాది ఆగస్టు ఏడో తేదీన కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు జరపాలని.. ముహూర్త పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు.
తితిదే పిలుపుతో అర్హులైన వధూవరులు తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో సామూహిక ఉచిత వివాహ దరఖాస్తు పత్రాలను పెద్ద ఎత్తున సమర్పించారు. ఆ తర్వాత తితిదే అధికారులు కల్యాణమస్తు ఊసే మరిచారు. కల్యాణమస్తుకు అర్హులైన యువ జంటల ఆశలు.. తితిదే తీరుతో అడియాశలయ్యాయి. వస్తున్న వినతుల దృష్ట్యా అయినా తిరిగి కార్యక్రమాన్ని ప్రారంభించాలని దరఖాస్తు చేసుకున్నవారు కోరుతున్నారు.
"స్వయాన తితిదే ధర్మకర్తల మండలివారే కల్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు జరిపి.. వధూవరులకు రెండు గ్రాముల బంగారు మంగళసూత్రాలతో పాటు వెండి మెట్టెలను ఇస్తామని 2020-21 సంవత్సరంలో తీర్మానం చేశారు. ఈ మేరకు అర్హులైనవారిని తహసీల్దారు కార్యాలయంలో అర్జీలు పెట్టుకోమని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో కల్యాణమస్తు ఉత్సవ కార్యక్రమాలకు సంసిద్ధంగా ఉన్నామని తితిదే ఛైర్మన్ అధికారంగా ప్రకటించారు. కాగా ఇప్పుడు వారంతా చేతులెత్తేశారు." - నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రీవారి భక్తుడు
ఇవీ చదవండి:
