Tension in Palasa పలాసలో అర్ధరాత్రి ఉద్రిక్తత, ఎందుకంటే

author img

By

Published : Aug 19, 2022, 12:37 PM IST

Tension at Palasa

Tension in Palasa శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీనివాస నగర్​లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 27 వ వార్డులో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేసేందుకు సిద్దమైన రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఇచ్ఛాపురం తెదేపా ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాధితుల పక్షాన అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆయన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tension in Palasa శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీనివాసనగర్‌లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని... విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కూలగొడతామంటే తామంతా ఎక్కడికి వెళ్లాలంటూ అడ్డు తగిలారు.

అనంతరం అధికారులు పొక్లెయిన్‌తో 27వ వార్డు తెదేపా కౌన్సిలర్‌ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధమవటంతో జనం అక్కడా బైఠాయించారు. మంత్రికి విన్నవించాక కూడా తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంతలో వైకాపా నాయకులు అక్కడకి చేరుకోవటంతో తెదేపా, వైకాపా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్‌ అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.

పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారని ఎమ్మెల్యే అశోక్‌ విమర్శించారు. అనంతరం పోలీసులు పొక్లెయిన్‌ను వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా రాజకీయాలు ఈ జిల్లాలో ఎప్పుడూ లేవన్నారు. ప్రజల్ని బాధపెట్టి ఏం సాధిస్తారని నిలదీశారు. వైకాపా నేతలే సవాలు విసిరారని.. అధికారంలో ఉన్నది వారే కాబట్టి దమ్ముంటే విచారణ జరిపించి తప్పును నిరూపించాలన్నారు. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే అశోక్‌ను మందస పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బలవంతంగా పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు.

ఓ మహిళ పలాస తహసీల్దార్‌ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. చెరువు విస్తీర్ణం పరిశీలించాలని తహసీల్దార్‌కు విన్నవించటంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతలో వైకాపా నాయకులు విషయాన్ని మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన కొంతమందిపై ఫిర్యాదు వచ్చిందని పేర్కొనటంతో, వారిపై చర్యలు తీసుకుని మిగిలిన పేదలందరి ఇళ్లు విడిచిపెట్టాలని దుర్గ అనే మహిళ ఫోన్‌లో మంత్రికి విన్నవించారు. తాను కార్యాలయంలో ఉంటానని మీరంతా వస్తే పట్టాలు ఇస్తామని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.

పలాసలో ఉద్రిక్త పరిస్థితులు

హైకోర్టు ఆదేశాల మేరకే: చెరువు గర్భంలో నిర్మాణాలపై హైకోర్టు నుంచి వివరాలు కోరిన మీదట పరిశీలించామని పలాస తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదన్‌రావు తెలిపారు. శ్రీనివాసనగర్‌ ప్రాంతంలో 52 ఇళ్లు అక్రమంగా నిర్మించారన్నారు. వాటిని తొలగించేందుకు రావటంతో స్థానికులంతా తమ ఆవేదన తెలపటంతో లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తే హైకోర్టుకు సమర్పిస్తామని వారికి వివరించాం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.