రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి: గద్దె తిరుపతిరావు

రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి: గద్దె తిరుపతిరావు
Arasavalli Amaravati Padayatra Updated: రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణమే తమ ధ్యేయమని అమరావతి ఐకాస కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు అన్నారు. ఈనెల 11న చేపట్టిన అమరావతి పాదయాత్ర నేడు అరసవల్లికి చేరుకుంది.
Arasavalli Amaravati Padayatra Updated: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు అమరావతి నుంచి అరసవల్లికి ప్రారంభించిన పాదయాత్ర గత ఏడాది నిలిచిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత ఏడాది ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచి ఈనెల 11న అమరావతి ఐకాస కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు ఒంటరిగా పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్రలో భాగంగా ఆయన నేడు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని, కాలినడకన అరసవల్లిలో పాదయాత్ర చేపట్టారు.
ఈ క్రమంలో ఏడు రోడ్ల కూడలి నుంచి అరసవల్లి వరకు టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే, ఏడు రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జై అమరావతి అంటూ పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ నేత కూన రవికుమార్‌తో పాటు కొంతమంది టీడీపీ శ్రేణులను మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ద్విచక్ర వాహనంలో వెళ్లేందుకు కూన రవి ప్రయత్నించగా.. కాసేపు అడ్డుకొని చివరకు విడిచి పెట్టారు. దీంతో అరసవల్లి చేరుకుని అమరావతి రైతుల పాదయాత్రను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ.. ‘రాష్ట్ర అభివృద్ధి కోరుతూ భూములిచ్చాం. అమరావతిని రాజధానిగా చేసి, దానిపై వచ్చిన ఆదాయంతో 13 జిల్లాల్లో అభివృద్ధి చేయాలి. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ ఇలా రాజధానులను మారుస్తారా? 2019 ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని జగన్ ప్రకటించలేదా’ అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రానికి మంచి భవిష్యత్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష, పౌర సంఘాల నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తిరుపతిరావు ఆరోపించారు.
అమరావతి నుంచి అరసవల్లి వరకు ఒక మహాపాదయాత్రకు సంకల్పించాం. మహాపాదయాత్ర బయలుదేరినా తర్వాత మార్గమాధ్యం తూర్పుగోదావరి జిల్లాలో అనివార్య కారణాల వల్ల ఆపివేయడం జరిగింది. ఏదైతే పాదయాత్ర ఆపిన తర్వాత గడిచిన కొన్ని నెలలుగా వ్యక్తిగతంగా మొక్కు తీర్చుకోవటం నిమిత్తం ఎక్కడైతే పాదయాత్రను నిలిచిపోయిందో అక్కడి నుంచే మొదలుపెట్టాను- గద్దె తిరుపతిరావు, అమరావతి ఐకాస కో కన్వీనర్
ఇవీ చదవండి
