ELEPHANTS: శ్రీకాకుళంలో గజరాజుల ఘీంకారం...

author img

By

Published : Jun 21, 2022, 11:28 AM IST

ELEPHANTS:

ELEPHANTS: ఓ వైపు గజరాజుల ఘీంకారం.. మరోవైపు భల్లూకాల రక్తదాహం.. వెరసి సిక్కోలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.. దాడులకు తెగబడుతూ మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి.. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏళ్ల తరబడి ఇదే దుస్థితి.. ఇదే భయం.. ఏనుగులతో ఏజెన్సీ, ఎలుగుబంట్లతో ఉద్దానం ప్రాంత వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటే ఎటు నుంచి ఏదొచ్చి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం మళ్లీ మొదలైంది. సరిహద్దు ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తాయోనని వణుకుతున్నారు. 14 ఏళ్లుగా గజరాజులు అటూఇటూ తిరుగుతూ నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. భామిని, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల పరిధిలోని గ్రామాల్లోనే తిష్ఠవేసి సంచరిస్తూనే ఉన్నాయి.

నష్టం ఇలా..

ఇటీవల కరిరాజుల వల్ల కొత్తూరు, మెళియాపుట్టి, భామిని, వీరఘట్టం, పాతపట్నం, ఎల్‌.ఎన్‌.పేట తదితర మండలాల్లో ఇప్పటివరకు 500 ఎకరాల్లోని అరటి, మామిడి, పనస, వరి, జొన్న పంటలకు నష్టం జరిగింది. గిరిజన గ్రామాల్లో గుడిసెలు, విద్యుత్తు మోటార్లు, బోర్లు, ఇతర సామగ్రి ధ్వంసం చేశాయి. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ధ్వంసం.. దాడులు..

గత మూడు రోజులుగా కొత్తూరు మండలంలో ఏనుగులు తిరుగుతూ పంటలు, మోటార్లను ధ్వంసం చేస్తున్నాయి. గత ఆదివారం సాయంత్రం వసప గ్రామానికి చెందిన వ్యక్తి వీటి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. వంశధార నదికి ఇరువైపులా తిరుగుతున్నాయి. కడుము మీదుగా ఒడిశాలోకి వెళ్లిన గజరాజులు తిరిగి ఇటువైపు వచ్చేశాయి. వసప, కుంటిభద్ర గ్రామాల మధ్యలోని తోటల్లో ప్రస్తుతం తిష్ఠ వేశాయి.

ప్రతిపాదనలన్నీ గాలిలోనే..

* ఆపరేషన్‌ గజ పేరిట తిరిగి ఒడిశాకు తరలించేందుకు అధికారులు గతంలో తీసుకున్న చర్యలు మధ్యలోనే ఆగిపోయాయి.

* సంచరించే ప్రాంతంలో కందకాలు నిర్మిస్తామని చెప్పినా అదీ కదల్లేదు.

* జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకూ అడుగులేసినా ఫలితం లేకపోయింది.

* ప్రస్తుతం మన్యం, సిక్కోలు ప్రాంతాల్లో ఏదోఒకచోట ఏనుగుల కారిడార్‌ ప్రతిపాదన తీసుకొచ్చినా అదీ కార్యరూపం దాల్చలేదు.

ఇవిగో సాక్షాలు..

ట్రాకర్‌ రాజుబాబు మృతదేహం

2007లో ఒడిశా నుంచి వచ్చిన వాటిలో మిగిలిన నాలుగు ఏనుగుల గుంపు ప్రస్తుతం కొత్తూరు, హిరమండలం ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. తర్వాత వచ్చిన ఆరు మన్యం జిల్లా కొమరాడ ప్రాంతంలో తిష్ఠవేశాయి. అప్పటి నుంచి జిల్లాకు చెందిన 13 మందిని, మన్యం జిల్లాకు చెందిన అయిదుగురిని పొట్టన పెట్టుకున్నాయి. అప్పటి ఉమ్మడి జిల్లా ప్రకారం వివరాలివి..

* 2007లో అక్టోబరు 14న కె.వీరఘట్టానికి చెందిన ఇద్దరు, 19న హుస్సేనుపురం, 21న సంతనర్సిపురంలో ఒకరు చొప్పున పొట్టనపెట్టుకున్నాయి.

* 2008లో జనవరి 1న చలివేంద్రి, 2014లో జులైలో హిరమండలం పాడలి, 2016 నవంబరు 26న పాతపట్నం మండలం సోదలో ఒక్కొక్కరినీ చంపేశాయి.

* 2018 మార్చి 10న కొత్తూరు మండలం పొన్నుటూరు, ఏప్రిల్‌ 14న మెళియాపుట్టి మండలం హీరాపురం, ఏప్రిల్‌ 15న పరశురాంపురంలో ఒక్కొక్కరి ప్రాణం తీశాయి.

* 2019 జూన్‌ 17న సీతంపేట మండలం పెద్దమండ, ఈతమానుగూడలో ఇద్దరు మహిళలను హతమార్చాయి.

* 2022 జనవరి 9న సీతంపేట మండలం కె.గుమ్మడకు చెందిన ట్రాకర్‌ రాజుబాబును కొమరాడ మండలంలో దాడి చేసి చంపేశాయి.

కవ్వింపు చర్యలు చేపట్టొద్దు

ఏనుగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు ఎలాంటి కవ్వింపు చర్యలు చేపట్టవద్దు. నష్టపోయిన రైతుల పంటలు పరిశీలించి, ఆదుకొనేందుకు నివేదికలను జిల్లా అధికారులకు పంపిస్తున్నాం. ఒడిశా వైపు వెళ్లేలా అక్కడి అధికారులతో కలసి చర్యలు తీసుకుంటాం.

- రాజశేఖర్‌, అటవీ రేంజ్‌ అధికారి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.