ఉద్దానంలో తీరని కిడ్నీ బాధితుల వెతలు.. పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

author img

By

Published : Sep 23, 2022, 8:41 AM IST

UDDANAM KIDNEY VICTIMS

UDDANAM : ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నా .. నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే.. కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్‌ సెంటర్‌ అందుబాటులోకి తెస్తామన్న మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. శంకుస్థాపన రాయి వేసి మూడేళ్లువుతున్నా.. నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. మాకీ కష్టాలు తొలగేదెన్నడని కిడ్నీ బాధితులు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు.

UDDANAM KIDNEY VICTIMS : వైకాపా అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే సీఎం జగన్.. పలాసలో 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 50 కోట్ల అంచనా వ్యయంతో.. రెండేళ్లలో పూర్తి స్థాయిలో రోగులకోసం అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసి మూడేళ్లయినా.. ఇంకా నిర్మాణం సాగుతూనే ఉంది. ఈ ఆస్పత్రి వస్తుందని.. బాధలు తీరతాయని భావించిన కిడ్నీ రోగులకు నిరాశే ఎదురవుతోంది.

ఉద్దానంలో తీరని కిడ్నీ బాధితుల వెతలు.. పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

ఉద్దానం ప్రాంతంలో 10 వేల మందికి పైగా ప్రజలు కిడ్నీ బారిన పడ్డారు. బాధితులంతా గ్రామాల్లో నివసించే పేదవారు కావడం వల్ల వైద్య ఖర్చులు భరించలేక.. కుటుంబాలన్నీ చిన్నాభిన్నమవుతున్నాయి. విశాఖ , శ్రీకాకుళం వైద్యం కోసం వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతోంది. దీంతో బాధితులు అప్పుల పాలవుతున్నారు.

"200 పడకల ఆసుపత్రులు అన్నారు. ఇంతవరకు నిర్మాణం కాలేదు. వైద్యం​ చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆసుపత్రిని కడితే కనీసం ఖర్చు అయినా తగ్గుతుంది. ఆసుపత్రిలో వైద్యం కోసం ఇల్లు, పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలు ఎందుకు సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రి నిర్మాణం చేపడితే చాలా మందికి మేలు చేసిన వారు అవుతారు"-కిడ్నీ బాధితులు

మూత్రపిండాల వ్యాధి గల వ్యక్తి వారానికి 3సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ప్రత్యేక వాహనం పెట్టుకొని డయాలసిస్ సెంటర్‌కి వెళ్లి రావాలి. వాహనం ఖర్చు, మందుల ఖర్చు మొత్తం నెలకి 40 వేలకు పైగా అవుతుంది. ఇంటి పెద్ద రోగాల పాలైతే ఇల్లు, స్థలాలు అమ్ముకోవాల్సిందే. ప్రభుత్వం బాధితులకు 10 వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నా.. అది ఏ మూలకు సరిపోవడం లేదంటూ కిడ్నీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్దానం ప్రాంతాల్లో ప్రజలు కిడ్నీ వ్యాధితో పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం వేగంగా పూర్తి చేసి కిడ్నీ రోగులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.