నారతో..లక్షలు కురిపిస్తున్న బెజ్జిపురం మహిళలు..

నారతో..లక్షలు కురిపిస్తున్న బెజ్జిపురం మహిళలు..
Bezzipuram Youth Club members: ప్రపంచం మొత్తం జపిస్తున్న ఆధునిక పర్యావరణ మంత్రం ‘ప్లాస్టిక్ రహిత సమాజం’. ఈ సూత్రాన్ని మూడు దశాబ్దాల క్రితమే ఆకళింపు చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం యూత్‌క్లబ్ సభ్యులు. గోగునార ఉత్పత్తులతో అద్భుతాలు చేస్తూ.. ఏడాదికి రూ.80 లక్షల వ్యాపారం చేస్తున్నారు. వేలమంది మహిళలకు శిక్షణ ఇచ్చిన ఈ సంస్థ ఎందరినో వ్యాపార వేత్తలుగా మలుస్తోంది.
Bezzipuram Youth Club members: బెజ్జిపురం యూత్‌క్లబ్ సభ్యులు.. ఒకప్పుడు వంటిల్లే ప్రపంచంగా బతికిన సాధారణ మహిళలు వీరంతా. కానీ ఇప్పుడో.. గోగునారతో అద్భుతాలు చేస్తున్న నిపుణులు. ఆ నైపుణ్యమే వారిని జాతీయస్థాయిలో నిలబెట్టింది. అదెలా అంటే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో.. వ్యవసాయ కుటుంబాలే ఎక్కువ. అతివృష్టి, అనావృష్టితో పంట చేతికి వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. భవిష్యత్ తరాలకూ ఇలాంటి జీవితాలనే ఇవ్వాలా? అని మదనపడ్డారు అక్కడి మహిళలు. ‘ఏం చేయాలి?’ అని ఆలోచించినప్పుడు స్థానికంగా దొరికే గోగునార ఓ వరంలా కనిపించింది. వాటితో రకరకాల ఉత్పత్తులు చేసి అమ్మాలనుకున్నారు.
15 మంది మహిళలతో ఏర్పడ్డ ఈ బృందం అతి త్వరలోనే మరో వందమందిని చేర్చుకొని ‘గాయత్రి జ్యూట్ క్రాఫ్ట్’ పేరుతో సంఘంగా ఏర్పడింది. అలా 1993లో మొదలైన వీరి ప్రయాణం మరింత మంది మహిళలని తోడు చేసుకొంటూ విస్తరించింది. గోగునార ఉత్పత్తుల తయారీలో మాస్టర్ ట్రైనీలుగా మారిన బృంద సభ్యులు వారు స్వయం ఉపాధి సాధించడమే కాక ఆసక్తి ఉన్నవారికీ నేర్పి ఉపాధి బాటపట్టించారు. మొదట్లో సంప్రదాయ శైలి ఉయ్యాలలు, చేతిసంచులే చేసిన వీళ్లు ప్రస్తుతం ఆధునిక అవసరాలకు తగ్గట్టు ల్యాప్‌టాప్ బ్యాగులు, గృహోపకరణాలు, మ్యాట్లు లాంటి 80 రకాల వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఆరువేలమందికి శిక్షణ..
కేవలం బెజ్జిపురం మహిళలే కాదు ఎవరైనా ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు. అలా రాష్ట్రవ్యాప్తంగా 6500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. వారిలో 150 మంది వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరిల్లో 769 మందికి హస్తకళలు, జ్యూట్ క్రాఫ్ట్, తోలు బొమ్మల తయారీని నేర్పించారు. 2 వేల మందికి గోగునార ఉత్పత్తుల్లో మాస్టర్ నైపుణ్యాలని అందించారు. బృంద సభ్యులంతా జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో పాల్గొంటూ మన్ననలు పొందుతున్నారు. దిల్లీ, ముంబాయి, కోల్‌కతా, హైదరాబాద్, తమిళనాడు, విజయవాడ, విశాఖపట్నాలలో గోగునార ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వీళ్లలో చాలామంది సొంతంగా మార్టులు పెట్టి రాణిస్తున్నారు. కొత్తవారు కాస్త తీరిక దొరికితే చాలు యూత్‌క్లబ్‌కు వెళ్లి అక్కడ జ్యూట్‌బ్యాగుల తయారీలో శిక్షణ పొంది నెలకు రూ.8 నుంచి 10 వేల వరకు సంపాదిస్తున్నారు. నాబార్డు, డీఆర్డీఏ, కేంద్ర అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆర్థిక సాయంతో దేశవ్యాప్తంగా స్టాళ్లు ఏర్పాటు చేసి ఏడాదికి రూ.80లక్షల టర్నోవర్‌ని సాధిస్తున్నారు. సభ్యుల లాభాలు పోను.. కొంత క్లబ్ వసతులు మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడే పని నేర్చుకున్న ఆర్.శర్వాణి ప్రస్తుత ఛైర్పర్సన్. ‘పిన్నింటి లక్ష్మి భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరాడపిల్లలని ఈ నారపని చేసే పోషించింది. అందులో ఒక అమ్మాయి.. ఇప్పుడు సచివాలయ ఉద్యోగి. అప్పల నరసమ్మకి ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ ఇంజినీరింగ్ చదివారు. ఒకబ్బాయి స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. పార్వతి భర్త చనిపోయాక ఈ వృత్తినే నమ్ముకుని ముగ్గురు పిల్లల్ని పోషించింది. ఇద్దరి పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. ఇలా ఎంతోమంది తమ జీవితాలు మార్చుకున్నారు. ప్లాస్టిక్‌పై నిషేధం అమలవుతున్నప్పట్నుంచీ మా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. జనపనార సంచులు, బొమ్మలకు గిరాకీ పెరుగుతుంద’ని అంటున్నారు శార్వాణి..
ఇవీ చదవండి:
