శ్రీకాకుళం జిల్లాలో ప్రశ్నార్థకంగా ఆక్వా రంగం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు

author img

By

Published : Mar 18, 2023, 7:29 AM IST

Updated : Mar 18, 2023, 12:54 PM IST

తీవ్ర సంక్షోభంలో ఆక్వా రంగం

Aqua Sector In Deep Crisis: శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన ఆక్వారంగం ఇప్పుడు కుదేలవుతోంది. రొయ్యలకు తెల్ల మచ్చల వ్యాధి సోకి చనిపోతుండడంతో వందలాది ఎకరాల్లో రొయ్యల సాగు నిలిపి వేస్తున్నారు. ఈ జిల్లాలో ఆక్వా సాగు చేసే వేలాది ఎకరాలు చెరువులు ఖాళీగా కనిపించడంతో ఆక్వా సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆక్వా రైతులు అంటున్నారు.

Aqua Sector In Deep Crisis : పెరిగిన ఫీడ్ ధరలు, విద్యుత్, డీజిల్‌ ఛార్జీలతో పాటు తాజాగా రొయ్యలకు వచ్చిన తెల్ల మచ్చల వ్యాధి ఇలా అడుగడుగునా ఆక్వా రంగం కుదేలవుతోంది. ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన ఈ రంగమే ప్రస్తుతం తీవ్ర నష్టాలతో ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. దీనికి తోడు ప్రభుత్వ విధానాలూ రైతులకు గుదిబండలా మారాయి. మేం సాగుచేయలేము బాబోయ్‌ అంటూ అన్నదాతలు చేతులెత్తేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రొయ్యలు సాగుచేసే వేలాది ఎకరాలు చెరువులు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ఆక్వా సాగు ప్రశ్నార్థకంగా మారింది..

మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు... ప్రభుత్వ విధానాలు : శ్రీకాకుళం జిల్లాలో గతంలో ఎటుచూసినా చుట్టూ రొయ్యల చెరువులే కనిపించేవి. బాగా లాభాలు రావడంతో పెట్టుబడి ఎక్కువైనా రైతులు వెనకాడేవారు కాదు. ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. పెరిగిన మేతలు, మందులు, లీజులతో రైతులు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు రొయ్యలకు తెల్ల మచ్చల వ్యాధి సోకడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వైరస్ వల్ల దిగుబడులు బాగా తగ్గిపోయాయి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ప్రభుత్వ విధానాలతో సాగుదారులు మరింత చితికిపోయారు. గతంలో ఆక్వా రంగంపై ఉండే మక్కువ ఇప్పుడు కనిపించట్లేదు. ఒడిదొడుకులు తట్టుకోలేక వదిలేయడంతో వందల ఎకరాలు బోసిపోయాయి.

లేని రాయితీ.. రైతులకు భారం : సంతబొమ్మాలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, గార, వజ్రపు కొత్తూరు, పోలాకి, శ్రీకాకుళంలో దాదాపు 6 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. సుమారు మూడు వేల మంది సాగుదారులు, ఇరవై వేల మంది కార్మికులు, పరోక్షంగా మరో పదిహేను వేల మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాయితీ లేని విద్యుత్‌ కారణంగా రైతులకు భారం అధికమైంది. మరో వైపు నాసిరకం సీడ్ కారణంగా చెరువుల్లో రొయ్య పిల్లలు వదిలిన నెల రోజులకే సమస్యలు మొదలవుతున్నాయి. అప్పుల్లో కూరుకుపోయి. నష్టాల సాగు చేయలేక తప్పుకుంటున్నారు.

వలస పోయే పరిస్థితి : ఒకప్పుడు నిత్యం కూలీలతో కళకళలాడే చెరువులు వెలవెలబోతున్నాయి. రొయ్యల సాగు చేయకపోవడంతో ఈ రంగంపైనే ఆధారపడిన వేలాది మంది కూలీలకు పని లేకుండా పోయింది. ఉపాధి లేకపోవడంతో చాలా మంది వలస పోయే పరిస్థితి తలెత్తింది.

రైతులను ఆదుకోవాలని డిమాండ్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలే ఆక్వా రైతుల పాలిట శాపంగా మారాయని టీడీపీ నేత కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి సిదిరి అప్పలరాజు ఫీడ్ వ్యాపారులతో కుమ్మక్కై ధరలు అమాంతం పెంచేశారని ఆరోపించారు. విద్యుత్, డీజిల్ పై సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రశ్నార్థకంగా ఆక్వా రంగం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు

ఇవీ చదవండి

Last Updated :Mar 18, 2023, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.