రైతులను భయపెట్టి భూములు కొనుగోలు.. వందల ఎకరాలలో మంత్రి రిసార్టు

author img

By

Published : Jan 15, 2023, 8:48 AM IST

Updated : Jan 15, 2023, 9:17 AM IST

ap minister ushasri charan resort

Ushasri Charan Resort: మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉష శ్రీచరణ్‌ కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామ పరిధిలో విలాసవంతమైన భారీ రిసార్టును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 120 ఎకరాల వరకు సేకరించారు. మొత్తం 300 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చుట్టుపక్కల రైతుల్ని పొలాలు అమ్మాలని ఒత్తిడి తెస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సన్నకారు రైతులను భయపెట్టి కారుచౌకగా కొనేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వందల ఎకరాలలో రిసార్టు కడుతున్న మంత్రి ఉష శ్రీచరణ్

Ushasri Charan Resort: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధి కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామ పరిధిలోని సర్వే నంబరు 99లో పవన విద్యుత్తు ప్లాంటు స్థాపనకు సుజలాన్‌ సంస్థ రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములను సేకరించింది. అప్పట్లో కొంతవరకూ గాలి మరలు ఏర్పాటు చేశారు. ప్లాంటు విస్తరణ కోసం కొంత భూమిని అలాగే వదిలేశారు. దీంతోపాటు తూంచెర్ల సరిహద్దులో ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం నూతిమడుగులలోనూ ఈ సంస్థ భూములను సేకరించింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషకు మంత్రి పదవి వచ్చాక ఆమె కన్ను ఈ భూములపై పడింది. అనుకున్నదే తడవుగా కంపెనీ నుంచి అతి తక్కువ ధరకు భూముల్ని కొనేశారు.

రైతుల నుంచి బలవంతపు కొనుగోళ్లు : సుజలాన్‌ సేకరించిన భూములను ఆనుకుని నూతిమడుగు గ్రామ రైతుల పొలాలున్నాయి. వీరికి చెందిన సర్వే నంబర్లు 124-2, 3లో 10.92 ఎకరాలు, సర్వే నంబరు 125లో 33.98 ఎకరాలు, సర్వే నంబరు 127లో 10 ఎకరాల చొప్పున మొత్తం 54.9 ఎకరాలను కొన్నారు. ఎకరాకు రూ.1.32 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలుస్తోంది. పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆత్మకూరు-భానుకోట రహదారి నుంచి ఓ రైతు పొలం మీదుగా ఆయన అనుమతి లేకుండానే రోడ్డు నిర్మించారు. తర్వాత రైతు గొడవ చేయడంతో ఎకరాకు 5 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. పక్కనే ఉన్న మరో రైతును పొలం అమ్మాలని ఒత్తిడి తేవడంతో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

"మాకు అక్కడ పది ఎకరాలు ఉంది. దౌర్జన్యంగా కంచె వేసేశారు. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. దారి లేకుండా చేశారు". - వెంకటేశ్వర్లు, బాధిత రైతు

గుట్టనూ ఆక్రమించేశారు : సర్వే నంబరు 99లో సుజలాన్‌ సంస్థ సేకరించగా మిగిలిపోయిన భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. మంత్రి అనుచరులు అందులోని 20 ఎకరాల వరకు ఆక్రమించుకుని కంచె వేసేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రశ్నించిన వాళ్లను మీ భూములు ఎప్పుడో సుజలాన్‌కు ఇచ్చేశారు కదా..’ అంటూ దౌర్జన్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సర్వే నంబరు 99కు ఆనుకుని ఉన్న ఆరు ఎకరాల గుట్టనూ ఆక్రమించేశారని చెబుతున్నారు.

హంద్రీనీవా మట్టి.. పెన్నా ఇసుక : హంద్రీనీవాలో భాగంగా జీడిపల్లి-పేరూరు ఎత్తిపోతల పథకం కోసం తెదేపా హయాంలో 53 కిలోమీటర్ల కాలువ తవ్వారు. దీనికి సమీపంలోనే ప్రస్తుతం రిసార్టు నిర్మిస్తున్నారు. కాలువ గట్టుపై ఉన్న మట్టితోపాటు ఏపీఐఐసీ భూముల్లోని మట్టిని టిప్పర్లతో తమ భూమిలోకి తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తీసుకెళ్లారని అంటున్నారు. దీంతోపాటు ఇటీవల వరదలకు నూతిమడుగు సమీపంలో కల్వర్టు పైపులు కొట్టుకుపోయాయి. వాటిని అక్కడి నుంచి తరలించి రిసార్టు నిర్మిస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

"ఇక్కడ పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తీసుకొనిపోతున్నారు. కానీ ఈ గ్రామంలో ఉన్న మాకు మాత్రం ఇసుక తీసుకోవడానికి అర్హత లేదు. మంత్రి, ఆమె అనుచరులు ఇష్టారుసరంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎవరైనా అడగానికి వెళ్తే వారిని బందిస్తున్నారు". - దేవేంద్ర, స్థానికుడు

చెరువు నిర్మాణానికి ప్రతిపాదనలు : రిసార్టులో బోటింగ్‌ సౌకర్యం ఉండేలా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సమీపంలోని వంక నీటిని మళ్లించి చెరువు నిర్మించాలని అనుకున్నారు. సొంతంగా నిర్మిస్తే కోట్ల రూపాయల ఖర్చవుతుందని భావించి ఆ భారం ప్రభుత్వంపై మోపేలా పావులు కదిపినట్లు విపక్ష పార్టీల నేతల ఆరోపిస్తున్నారు. మంత్రి ఉష శ్రీచరణ్‌ సిఫార్సు మేరకు 3.16 కోట్ల రూపాయల అంచనాతో చెరువు నిర్మాణానికి జల వనరులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 15, 2023, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.