Water problem: బిందెడు నీటి కోసం బండెడు కష్టం.. అయినా నిరాశే..!

author img

By

Published : May 24, 2023, 7:52 PM IST

Updated : May 24, 2023, 8:06 PM IST

అలసిపోయిన బతుకులు.. గుక్కెడు నీళ్ల కోసం పోరుగు గ్రామానికి పరుగులు.. అయినా నిరాశే..!

Drinking water problem: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పది రోజులుగా తాగునీటి కోసం ప్రకాశం జిల్లా తలకొండపాడు ఎస్సీ పాలెం వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామానికి నీరందించే బోరుకు విద్యుత్​ అందించే ట్రాన్స్‌ఫార్మర్ పాడైపోయింది. ఫలితంగా గ్రామానికి నీటినందించే నీటి మోటరు పని చేయకపోవటంతో నీటి సమస్య ఏర్పడింది. మండుటెండల్లో ఖాళీ బిందెలతో సమీప గ్రామాల కుళాయిల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నామని వాపోతున్నారు.

బిందెడు నీటి కోసం బండెడు కష్టం.. అయినా నిరాశే..!

Drinking water problem: రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి సమస్యలే కనిపిస్తున్నాయి. ఎన్నికలలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు తాగునీటి సరఫరాను మెరుగు పరుస్తున్నామని.. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిని అందిస్తున్నామని చెప్తున్నారు.. కానీ ఆచరణలో మాత్రం అడుగుపడటం లేదు. అధికారుల మాటలకు పొంతన లేకుండా పోతోంది. ప్రజలు బిందెడు నీటి కోసం.. బండెడు కష్టం పడాల్సి వస్తోంది. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లావాసులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం గత పది రోజులుగా నీటి కోసం ప్రజలు పడరాని కష్టాలు పడుతున్నారు. గ్రామానికి నీటిని అందించే డీప్ బోరుకు విద్యుత్​ను అందించే ట్రాన్స్‌ఫార్మర్ పాడైపోవడంతో గుక్కెడు నీళ్ల కోసం పనులు మానుకొని పక్క గ్రామాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం తలకొండపాడు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. మండలంలోని తలకొండపాడు ఎస్సీ కాలనీలో సుమారు 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరి అవసరాలకు కాలనీకి చెందిన డీప్ బోరే ఆధారం. గత పది రోజుల క్రితం డీప్ బోరు పాడైపోయింది.

ఫలితంగా గ్రామానికి నీటినందించే మోటారు పని చేయకపోవడంతో నీటి సమస్య ఏర్పడింది. గత పది రోజులుగా బిందెడు నీళ్ల కోసం సమీప గ్రామానికి వెళ్లినా నీళ్లు తమకు అందుతాయో లేదో తెలియని పరిస్థితి. మండుటెండల్లో ఖాళీ బిందెలతో సమీప గ్రామానికి వెళ్లి కుళాయిల వద్ద గంటల తరబడి వేచి చూచినా.. తమ వంతు వచ్చేసరికి నీళ్ల సరఫరా ఆగిపోతుండడంతో చేసేదేమీ లేక ఖాళీ బిందెలతో నిరాశగా వెను తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.

గత పది రోజులుగా ఈ సమస్యతో సతమతమవుతున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. తమ సమస్యను అధికారులు కొంచెం కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను గుర్తించి పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. తమ సమస్యలు తీర్చుతారని ఓట్లేసి ఎన్నుకున్న వైసీపీ ప్రజా ప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

మాకు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి పది రోజులు అవుతుంది.. కనీసం మమ్మల్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు.. బిందెలు పట్టుకుని పక్క ఊరు వెళ్లి తెచ్చుకుంటున్నాము. నీళ్లు లేక పిల్లలతో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాంము- చిన్న కొండమ్మ, గ్రామస్థురాలు

నీళ్లు లేక పది రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము.. కూలికి వెళ్తేనే మా కడుపు నిండుతుంది.. ఇప్పుడు కూలి పనులు మానేసి నీళ్ల కోసం ఇంటి దగ్గరే ఉంటున్నాము. పక్క ఊరు వెళ్లి తెచ్చుకోవలసి వస్తుంది. వాళ్లు పట్టుకునే వరకు ఎదురు చూసి ఆ తరువాత మేము పట్టుకోవలసి వస్తుంది.. ఒక్కోసారి నీళ్లు లేకుండానే వెనక్కి వస్తున్నాము.- శ్రీలక్ష్మి, గ్రామస్థులు

ఇవీ చదవండి:

Last Updated :May 24, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.