అధికార పార్టీ అండతో ఆక్రమణలు.. ఏకంగా 700 ఎకరాల్లో..

author img

By

Published : May 14, 2022, 7:51 AM IST

Land occupation

Land occupation: 'వడ్డించేవాడు మనవాడైతే... బంతిలో ఎక్కడ కూర్చున్నా ముక్కలు పడతాయి' అనే సామెత మీకు గుర్తుందా..? ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో అదే తీరు కనిపిస్తోంది. తమవారు అధికారంలో ఉన్నారని ధీమాతో ఇష్టానుసారంగా కొండ భూములను సైతం యధేచ్చగా కబ్జా చేస్తున్నారు! అధికార పార్టీ నేతల అండతో ఏకంగా 700 ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నారు.

Land occupation: కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టు ఏకంగా కొండ భూములనే వారు ఆక్రమించేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో వందల ఎకరాలు దున్ని పంటలు సాగు చేసుకుంటున్నారు. దీంతో పశువుల మేతకూ స్థలం లేకుండా పోయింది. స్థానిక చెరువులకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో పరిస్థితి ఇది. మండలంలోని పెదారికట్ల, చినారికట్ల రెవెన్యూ పరిధిలో కొండ భూములున్నాయి. ఈ భూములకు 2 కి.మీ.దూరంలో జాతీయ రహదారి, 50 మీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్‌ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా విలువ పెరిగింది.

అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని కొందరు భూకబ్జాకు పాల్పడ్డారు. చినారికట్లలోని సర్వేనంబరు 501లో 461 ఎకరాల భూమి ఉండగా అందులో దాదాపు 300 ఎకరాలు, పెదారికట్లలోని సర్వేనంబరు 686లో 600 ఎకరాలకు 400 ఎకరాలు ఆక్రమించి చదును చేసి గతేడాది కంది, మినుము సాగు చేశారు. అత్యధిక భూమి అధికార పార్టీ మద్దతుదారుల ఆధీనంలోనే ఉంది. నేతలకు భయపడి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో పంట కాలం పూర్తయింది. మళ్లీ ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ భూములకు ఏదోలా పాసు పుస్తకాలు సంపాదించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్థానిక కాపరులు తమ పశువులను మేత కోసం కొండ పోరంబోకు భూముల వద్దకు తీసుకెళ్తుంటారు. గత పంటకాలం నుంచి కాపరులను అటువైపు రానీయకుండా అక్రమార్కులు అడ్డుకుంటున్నారు. కొండ భూములు ఆక్రమించడంతో వర్షాల సమయంలో సమీపంలోని చెరువులకు నీరు రావడం లేదు. చినారికట్ల, పెదారికట్లలో ఆ సర్వేనంబర్లలోని భూమి కొండ పోరంబోకుగా రికార్డుల్లో ఉందని కొనకనమిట్ల తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి వివరణ ఇచ్చారు. ఆక్రమించి పంటలు, తోటలు సాగు చేస్తున్న వారికి నోటీసులిస్తామని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.