Balineni Situation in YSRCP: పొమ్మనలేక పొగబెడుతున్నారా..!

author img

By

Published : May 6, 2023, 4:39 PM IST

Balineni Srinivasa Reddy Situation in YSRCP

Balineni Srinivasa Reddy Situation in YSRCP: ప్రకాశం జిల్లా వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని పొమ్మనక పొగబెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మాటే వేదంగా సాగిన స్థితి నుంచి భవిష్యత్తు ఏమిటనే దుస్థితి బాలినేనికి ఎదురైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కప్పుడు వైసీపీలో పెద్దన్నయ్య పాత్ర పోషించిన ఆయనకు సొంత పార్టీలోని వర్గాలే చుక్కలు చూపిస్తున్నాయి. దీంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతి సెగలు ఒక్కొక్కటిగా రగులుకుంటున్నాయి. అసలు ప్రకాశం వైసీపీలో ఏం జరుగుతోంది.?

Balineni Situation in YSRCP: వైసీపీలో బాలినేని భవిష్యత్తు ఏమిటి.. అసలు ఏం జరుగుతోంది?

Balineni Srinivasa Reddy Situation in YSRCP: ప్రకాశం జిల్లా వైసీపీలో అలజడి రేగింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గ పోరు తీవ్రమైంది. వీటిన్నింటికి కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ఆయనకు ఇప్పుడు ఎటుచూసినా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. వరుస వివాదాలతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

పార్టీ అధినేతతో భేటీ జరిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా సొంతపార్టీ వాళ్లే తనపై కక్షగట్టారని స్వయంగా బాలినేనే చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలే మీడియా సమావేశంలో ఆయనను కంటతడి పెట్టించేలా చేశాయన్న భావన ఆయన అనుకూల వర్గాల్లో వ్యక్తమవుతోంది.

పట్టించుకోని అధిష్ఠానం: మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారని తెలిసిన సమయంలో.. తన ప్రతిపాదనను అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై బాలినేని గుర్రుగా ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో తన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించి.. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా మార్చడం ఆయనకు నచ్చలేదు. అందుకే అనారోగ్య కారణాలు అని చెప్పి తన పదవికి రాజీనామా చేశారు. సీఎం బుజ్జగింపులకూ తలొగ్గలేదు.

బాలినేనికి అనుమతి నిరాకరణ: సీఎం మార్కాపురం పర్యటన వేళ హెలీప్యాడ్‌ వద్దకు బాలినేని కారును అనుమతించకపోవడం ఆయనను మరింత బాధించింది. అలిగి వెనక్కి వెళ్లిపోయినా.. సీఎం పిలుపుతో మళ్లీ సభకు వచ్చారు. డీఎస్పీ బదిలీల్లో తన మాట చెల్లకపోవడం వంటి పరిణామాలతో.. మొత్తంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కు అయిన బాలినేనికి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే.. చాలా కారణాలు కనిపిస్తున్నాయి.

పార్టీకి అది చిరాకు తెప్పించిందా?: మంత్రి పదవి కోల్పోయిన వెంటనే బాలినేనికి మద్దతుగా ఒక వర్గం ఒంగోలులో భారీ నిరసన ర్యాలీ చేయడం, సజ్జల రామకృష్ణారెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టడం, కొంతమంది తమ పదవులకు రాజీనామా ప్రకటనలు చేయడం వంటివి చేశారు. అప్పుడే బాలినేని వ్యవహారశైలి పార్టీకి చిరాకు తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల పరంపరలో జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కొరు బాలినేనిపై విమర్శల బాణాలు వేయడం ప్రారంభించారు. కొండపి నియోజకవర్గంలో గొడవలకు బాలినేనే కారణమని ఆరోపణలు ఉన్నాయి.

వర్గపోరుకు బాలినేనే కారణమా?: వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్‌ మాదాసి వెంకయ్యను ఇంఛార్జి బాధ్యత నుంచి బాలినేని తప్పించారని ఆ వర్గం అసంతృప్తితో ఉంది. బాలినేని అనుకూలమైన వరికూటి అశోక్‌ బాబును ఇంఛార్జిగా నియమించడం వర్గపోరుకు ఆజ్యం పోసినట్లయింది. అశోక్‌ బాబు, వెంకయ్య వర్గాల మధ్య దాడులు, పోలీసు కేసులు, ధర్నాలు, నిరసనలు నిత్యం జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో వర్గాల పోరుకు బాలినేనే కారణమయ్యారనే ప్రచారం సాగింది. అక్కడితో ఆగకుండా వెంకయ్య వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసింది.

వరుస వివాదాలు: చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ బాలినేని ప్రమేయంతోనే వర్గాలు తయారయ్యాయన్న భావన పార్టీలో వ్యక్తమవుతోంది. చీరాలలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడానికి బాలినేనే కీలకపాత్ర పోషించారు. అయితే అప్పటివరకూ తనదే రాజ్యం అన్నట్లు ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కు ఈ వ్యవహారం మింగుడు పడలేదు. దీంతో ఆయన బాలినేనికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా పర్చూరు ఇంఛార్జిగా ఆమంచి కాకుండా వేరే వారికి ఇప్పించేందుకు బాలినేని ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా పార్టీ ఆమంచికే ఇంఛార్జి బాధ్యతలు ఇవ్వడం బాలినేనికి ఇబ్బంది కలిగించింది.

ఆ ముగ్గురే అంతా చేస్తున్నారు?: పార్టీలో కీలకమైన ముగ్గురు నాయకులు తనపై వెనుకనుంచి రాజకీయం నడిపిస్తున్నారనే అనుమానాలు బాలినేని వ్యక్తం చేస్తున్నారు. స్వయానా తన బావ అయిన తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో బాలినేనికి పొసగడం లేదు. ప్రధానంగా గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్‌ రాకుండా బాలినేని అడ్డుపడి, మాగుంటను తీసుకొచ్చారని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.

బావతో పెరిగిన గ్యాప్: సుబ్బారెడ్డి ఒంగోలు వస్తున్న సందర్భంలో బాలినేని వర్గీయలు సుబ్బారెడ్డి ఫ్లెక్సీలు చింపేశారు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య మరింత గ్యాప్‌ సృష్టించింది. సుబ్బారెడ్డి అధిష్ఠాన వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్‌కు చిన్నాన్న వరసైన సుబ్బారెడ్డి మాటకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుంది. విశాఖ రీజనల్‌ కో అర్డినేటర్‌గా ఉన్న సుబ్బారెడ్డి, తనకు అవకాశం దొరికినప్పుడల్లా బాలినేని మీద చీకటి బాణాలు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సుబ్బారెడ్డే అంతా చేస్తున్నారా?: పార్టీలో బాలినేనిని చెడ్డచేయడానికి వైవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారని.. విశాఖ నుంచి ఇటీవల వస్తున్న భూకబ్జా ఆరోపణల వెనుక వైవీ ఉంటారనే అనుమానాలు కూడా బాలినేని వర్గీయుల్లో ఉంది. మంత్రి ఆదిమూలపు సురేష్‌ కూడా వైవీతో చేతులు కలిపారనే అనుమానాలు బాలినేని వర్గీయుల్లో నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు బాలినేని హవా సాగిస్తే, ఇప్పుడు ఈ పాత్రను మంత్రి సురేష్‌ పోషిస్తున్నారని, కొంత మంది ఎమ్మెల్యేలు సురేష్‌ అడుగులకు మడగులొత్తుతూ, బాలినేని వెనుక గోతులు తవ్వుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాలినేనిపై వరుస ఆరోపణలు: మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా బాలినేని విషయంలో ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. అలాగే బాలినేని పార్టీ మారతారని, అందుకే పార్టీ మీద పత్రికలకు కావాలనే లీకులిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వైసీపీకు అనుకూలంగా ఉండే పంచ్‌ ప్రభాకర్‌ కూడా బాలినేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బాలినేని కుమారుడు ప్రణీత్‌ రెడ్డి, వియ్యంకుడు భాస్కర్‌ రెడ్డి.. ఒంగోలు, విశాఖ ప్రాంతాల్లో భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.

తెలంగాణ నాయుకుడు కూడా ఆరోపణలు: అదే విధంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, వైవీ సుబ్బారెడ్డికి సన్నిహితుడైన గోనె ప్రకాశరావు కూడా బాలినేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవన్నీ వైవీ సుబ్బారెడ్డి చేయిస్తున్నారనే అనుమానాలు బాలినేనిలో బలంగా నాటుకున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ విషయాన్ని ఆయన నేరుగా చెప్పనప్పటికీ.. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసునని, తాను మాత్రం పార్టీకి కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు.

మరిన్ని ఆరోపణలు: తాళ్లూరు వద్ద ఓ కొండ ప్రాంతాన్ని క్వారీయింగ్‌ కోసం సొంతం చేసుకునేందుకు అటవీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. తన వియ్యంకుడు భాస్కర్‌ రెడ్డి ఒంగోలులో వేస్తున్న వెంచర్‌కు అక్రమంగా నీటి రవాణా ఏర్పాట్లు చేశారని, ఎర్రజర్ల కొండ ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వుకొని వెంచర్‌ చదునుకు వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే కె. బిట్రగుంట కుమ్మర్ల వినియోగంలో ఉన్న స్థలాన్ని ఖాళీ చేయించారని, విశాఖ జిల్లాలో అటవీభూముల ఆక్రమణలు, చెన్నైలో హవాలా డబ్బు రవాణాలో బాలినేని అనుచరుడు ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని బాలినేని మీడియా సమావేశాలు పెట్టి ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా ఆరోపణల పరంపర కొనసాగుతునే ఉంది. ఈ పరిస్థితుల్లో బాలినేనికి సొంత పార్టీ పొమ్మనక పొగబెడుతోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆదిమూలపు సురేష్ స్పందన: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరుస్తామని మంత్రి ఆదిపులపు సురేష్ అన్నారు. ఎలాంటి పొరపొచ్చాలు ఉన్నా సర్దుకుని ఐక్యమత్యంగా ఉంటామన్నారు. కొన్ని పత్రికలు పనిగట్టుకొని.. తమ పార్టీని బలహీనపరచాలని.. కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. తామంతా కలిసే ఉన్నామని.. వారం రోజుల క్రితం కూడా బాలినేని శ్రీనివాస్​తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.