Balineni వెనక్కి తగ్గలేను.. పార్టీలో అవమానం.. వ్యతిరేకవర్గం.. సీఎం దృష్టికి బాలినేని!

author img

By

Published : May 3, 2023, 7:34 AM IST

Balineni met CM Jagan

Balineni met CM Jagan: పార్టీ పదవులకు చేసిన రాజీనామా విషయంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మెట్టు దిగలేదు. రాజీనామాను ఉపసంహరించుకునేది లేదని.. ముఖ్యమంత్రి జగన్‌కు తేల్చిచెప్పారు. పార్టీలో తనకు తీవ్ర అవమానం జరుగుతోందన్న బాలినేని.. తనకు వ్యతిరేకవర్గాన్ని కొందరు పెంచి పోషిస్తున్నట్లు అనుమానంగా ఉందని.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Balineni met CM Jagan: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తాను చేసిన రాజీనామాపై.. వెనక్కి తగ్గేది లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ సర్దిచెప్పినా ఆయన ససేమిరా అన్నారు. నియోజకవర్గంలో మీకేం కావాలో చెప్పండి.. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఏ సహకారం కావాలి.. రాజీనామాను ఉపసంహరించుకుని.. ప్రాంతీయ సమన్వయకర్తగా కొనసాగండని సీఎం చెప్పినా.. బాలినేని మెత్తబడలేదని తెలిసింది. ఆయన సీఎం జగన్‌ను.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. 40 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ భేటీలో.. రాజీనామా ఉపసంహరణ మినహా ఇంకేదైనా చెప్పాలని బాలినేని.. సీఎంతో అన్నట్లు సమాచారం.

ఒంగోలుకే పరిమితం.. ఒంగోలుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడంతోపాటు.. అనారోగ్యం వల్ల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతను నిర్వర్తించడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి.. తన నియోజకవర్గానికే పరిమితమవ్వాలనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంకు కచ్చితంగా బాలినేని చెప్పినట్లు తెలిసింది. ఇలా రాజీనామా చేస్తే పార్టీ కేడర్‌కు వేరే సంకేతాలు వెళ్తాయని.. రాజీనామాను ఉపసంహరించుకోవాలని సీఎం చెప్పినా.. బాలినేని తగ్గదేలని సమాచారం. వైసీపీకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్‌ సంస్థ ప్రతినిధి రిషిరాజ్‌.. క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లాలో.. పార్టీలో ఉన్న గ్రూపులు వాటిని సర్దుబాటు చేసేందుకు బాలినేని అవసరం ఎంత ఉందనే విషయంపై.. ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. అయినా తాను మాత్రం ఒంగోలుకే పరిమితం కావాలని అనుకుంటున్నట్లు బాలినేని తెగేసి చెప్పారని సమాచారం.

నేను అడిగిన డీఎస్పీని ఎందుకు ఇవ్వలేదు.. సీఎం పిలుపుతో వచ్చిన బాలినేని.. తొలుత సీఎంఓలోని ఒక కీలక అధికారి, ఐ-ప్యాక్ ప్రతినిధితో మాట్లాడారు. గతేడాది నన్ను మంత్రివర్గం నుంచి తప్పించినప్పుడు ఏం చెప్పారు..? మంత్రివర్గంలో లేకపోయినా జిల్లాలో మీరే మంత్రి, మీకు ఆ గౌవరం ఉంటుందన్నారు. కానీ జరుగుతున్నదేంటి? కనీసం నేను అడిగిన డీఎస్పీని కూడా ఎందుకు ఇవ్వలేదని... బాలినేని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పుడు ఇచ్చిన డీఎస్పీ మీ మాట వింటారని సమాచారం ఉంది.. అందుకే వేశాం అని ఆ అధికారి చెప్పగా.. నేను అడిగిన వాళ్లను కాదని.. మీరు వేసిన వ్యక్తి నా మాట ఎలా వింటారని.. బాలినేని చికాకు పడినట్లు సమాచారం. తర్వాత ఆయన్ను సీఎం వద్దకు తీసుకెళ్లారు. వాసన్నా.. కో-ఆర్డినేటర్‌గా కంటిన్యూ కావాలి అని సీఎం అనగా.. లేదు, నేను ఉండలేనని బాలినేని చెప్పినట్లు తెలిసింది. చర్చ తర్వాత అక్కడి నుంచి బాలినేని వెళ్తుండగా.. బయట మీడియా ఉంటుంది కదా..? చూసి మాట్లాడంటి అని సీఎం చెప్పినట్లు సమాచారం. అయితే బాలినేని.. మీడియా పాయింట్ ఉన్న వైపు కాకుండా మరోదారిలో వెళ్లిపోయారు.

అప్పటినుంచే అసంతృప్తి.. గతేడాది మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత.. బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. మొదటి మంత్రివర్గంలో ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు నలుగురు ఉండేవారు. గౌతమ్‌రెడ్డి మృతి చెందగా.. మిగిలిన ఇద్దరినీ కొనసాగించి.. తననే తప్పించారని బాలినేని అసహనంతోనే ఉంటున్నారు. తనను కాదని ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా కొనసాగించడం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు మంత్రి సురేష్‌ను ఆయన వద్దకు అనుమతించి.. బాలినేనిని మాత్రం అధికారులు అనుమతించకపోవడం.. చర్చనీయాంశంగా మారింది. దాన్ని తీవ్ర అవమానంగా భావించిన బాలినేని.. సీఎంను కలవకుండానే వెనుదిరిగి వెళ్లిపోగా.. తర్వాత విషయం తెలిసి.. ఆయన్ను సీఎం పిలిపించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

రాజీనామాపై 'తగ్గేదే లేదు'.. సీఎంకు తేల్చి చెప్పిన బాలినేని

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.