TDP Fire : పథకం ప్రకారం చంద్రబాబుపై దాడి.. రాష్ట్రంలో ఆటవిక పాలన: అచ్చెన్నాయుడు

author img

By

Published : Apr 23, 2023, 10:11 PM IST

Etv Bharat

TDP Fire : రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, పోలీసులు అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పథకం ప్రకారం దాడి జరిగిందని ఆరోపించిన ఆయన.. దాడి గురించి ముందుగానే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తో పోలీసులు మాట్లాడుతున్న వీడియోలను గమనిస్తే.. కుట్రకోణం దాగి ఉందని స్పష్టంగా తెలుస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు.

TDP Fire : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై దాడి ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. జంగిల్ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పర్యటనకు భద్రత కల్పించాలని ముందుగానే పోలీసులను కోరామని, అసాంఘిక శక్తులు దాడి చేసే అవకాశముందని కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలకు ముందుగానే చెప్పినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత పర్యటనను అడ్డుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ ముందుగానే చెప్పినా.. చంద్రబాబుకు రక్షణ కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయటంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. యర్రగొండపాలెం ప్రతిపక్ష నేత పర్యటనకు నియమించిన పోలీసుల బృందం రక్షణ కల్పించటంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రక్షణ కల్పించకపోగా అధికార పార్టీ గూండాలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు.

కుట్ర కోణం.. మంత్రి ఆదిమూలపు సురేష్​తో పోలీసులు మాట్లాడుతున్న వీడియోలను చూస్తే కుట్రకోణం దాగి ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. మంత్రి సురేష్ ఆధ్వర్యంలో ప్రతిపక్షనేతపై చేసిన దాడి కారణంగా చంద్రబాబు కాన్వాయ్ నుంచి కిందకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఆయన ఆదేశాలతోనే వైఎస్సార్సీపీ గూండాలు ఎన్ఎస్​జీ రక్షణ వలయంలోని చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారని ధ్వజమెత్తారు. దాడి సమయంలో కరెంట్ తీసేశారని.. స్థానిక పోలీసులు ప్రతిపక్షనేతకు కనీసం రక్షణ కల్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. దీంతో ఎన్ఎస్​జీ కమాండో సంతోష్ కుమార్​కి రక్తపు గాయాలయ్యాయని.. మరో ఇద్దరు కమాండోలు అమర్ సింగ్, మానే కిషోర్ గణపత్ గాయపడ్డారన్నారు. పోలీసులు గుంపును చెదరగొట్టే ప్రయత్నంలో వైఎస్సార్సీపీ గూండాలను వదిలేసి తెలుగుదేశం కార్యకర్తలపై జులుం ప్రదర్శించారని దుయ్యబట్టారు.

బాధితులపైనే కేసులా.. దాడికి పాల్పడ్డ వారిపై నామమాత్రంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులపై రెండు ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారన్నారు. ఈ దాడి ఘటన పోలీసుల తీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్ష్యాత్తూ ఒక మంత్రి మారణాయుధాలతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. ఎన్ఎస్​జీ వలయంలోని ప్రతిపక్షనేతపై జరిగిన దాడిలో దాగి ఉన్న కుట్రపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుపై దాడి ఏపీ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్ నియమావళికి విరుద్ధమని ఆరోపించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, వారికి సహకరించిన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని, ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ దినేష్‌రెడ్డి అరెస్ట్ దుర్మార్గమని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. దినేష్ రెడ్డి పట్ల పోలీసులు వ్యహరించిన తీరు ఆక్షేపణీయమని... ఆయన చేసిన తప్పేంటి, ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించటం తప్పా అని నిలదీశారు. వైఎస్సార్ పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దినేష్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యం.. జగన్ రెడ్డి పాలనలో అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై దాడి చేసిన గూండాల్ని వదిలి టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు స్పందించలేదని డోలా ప్రశ్నించారు. అల్లర్లకు కారణమైన మంత్రి సురేష్​తో పాటు, వైఎస్సార్సీపీ గూండాలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల వైఫల్యానికి నిదర్శనం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రోడ్ షోకు వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు రువ్వడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని టీడీపీ నేత వెనిగండ్ల రాము అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో భౌతిక దాడులకు దిగడం సరికాదని హెచ్చరించారు. రాళ్ల దాడికి పాల్పడిన అల్లరి మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.