RESULTS: నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా జోరు..

author img

By

Published : Sep 19, 2021, 10:55 AM IST

Updated : Sep 20, 2021, 8:46 AM IST

parishad elctions

నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల లెక్కింపు పూర్తైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో వైకాపా పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకగ్రీవాలతో కలుపుకొని మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది.

ప్రాదేశిక పోరులో అత్యధిక స్థానాలు వైకాపా వశమయ్యాయి. అన్ని మండలాల్లో ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకగ్రీవాలతో కలుపుకొని మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా.. ఎంపీటీసీల్లో 90 శాతం దక్కించుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జిల్లాలోని 10 లెక్కింపు కేంద్రాల్లో 40 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 554 ఎంపీటీసీ, 46 జడ్పీటీసీ స్థానాలు ఉండగా- వీటిలో 188 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లో 183 వైకాపా, తెదేపా 3, సీపీఐ(ఎం)2 స్థానాలు ఉండగా... జడ్పీటీసీ స్థానాలు మొత్తం వైకాపా ఖాతాలోకి వెళ్లాయి. నాలుగు స్థానాల్లో అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన వాటికి గత ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ప్రక్రియ రెండు దశల్లో కొనసాగింది. తొలిదశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టారు. రెండో దశలో లెక్కింపు జరిపారు. జిల్లాలో తొలి ఫలితం ఉదయం 9.40కి తెలియగా... సాయంత్రం 5.40 గంటలకు తుది ఫలితం వెల్లడైంది.

జిల్లాలో మొత్తం 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో వైకాపా పూర్తి మెజార్టీ సాధించింది. 34 జడ్పీటీసీ స్థానాలకు అన్నీ కైవసం చేసుకుంది. ఇక ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 312, తెదేపా 31, భాజపా 2, జనసేన 1, సీపీఐ(ఎం)3, స్వతంత్రులు 13 స్థానాలు గెలుచుకున్నాయి. పరిషత్‌ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బహిష్కరించింది. తమకు పట్టున్న చోట్ల అక్కడక్కడా అభ్యర్థులు బరిలో నిలిచినా.. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ప్రచారం చేసుకున్నారు. ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో సుమారు 72 శాతం పోలింగ్‌ నమోదవగా- ప్రాదేశిక ఎన్నికల్లో 53.56 శాతానికి పడిపోయింది. కౌంటింగ్‌ సమయంలోనూ తెదేపా నాయకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మొత్తంగా లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఎన్నికల పరిశీలకులు బసంత్‌కుమార్, ఎస్పీ విజయరావు, జేసీలు హరేంధిర ప్రసాద్, గణేష్‌కుమార్‌ ఆయా కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

15 మండలాల్లో అన్ని స్థానాలు...

జిల్లాలో మొత్తం 42 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిల్లో అత్యధిక స్థానాలు వైకాపా కైవసం చేసుకుంది. 15 మండలాల్లో మాత్రం అన్నింటిని వశం చేసుకుంది. వీటిలో అనంతసాగరం, బాలాయపల్లి, చేజర్ల, చిల్లకూరు, దగదర్తి, డక్కిలి, కొండాపురం, మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు గ్రామీణం, ఓజిలి, పొదలకూరు, వాకాడు, వరికుంటపాడు, వెంకటగిరి మండలాలు ఉన్నాయి.

  • కోవూరు మండలంలో రాష్ట్రంలోనే తొలి ఫలితం వెలువడింది. ఆమంచర్ల ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థిని సాధినేని హనుమాయమ్మ 766 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
  • ఆత్మకూరు మండలం మురగళ్ల ఎంపీటీసీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. లెక్కింపులో తెదేపా అభ్యర్థిని బొడ్డు సుభాషిణి 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైకాపా రీకౌంటింగ్‌ కోరగా.. అధికారులు అంగీకరించారు. అందులోనూ ఆమెకు వ΄డు ఓట్లు ఎక్కువగా రావడంతో విజేతగా ప్రకటించారు.
  • సంగం మండలం దువ్వూరులో తెదేపా అభ్యర్థిని పాముల ప్రభావతి 12 ఓట్లతో గెలిచారు. వైకాపా నాయకులు రీకౌంటింగ్‌ కోరారు. అందులోనూ ఆమెకు ఆధిక్యం రావడంతో గెలుపు తథ్యమైంది.
  • సీతారామపురం నెమలిదిన్నె స్థానం నుంచి తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో వైకాపా అభ్యర్థిని నేలకూరి సారమ్మ విజయం సాధించారు. తెదేపా వర్గం రీకౌంటింగ్‌ కోరారు. అయినప్పటికీ ఫలితం
    మారలేదు.
  • జిల్లాలోని చివరి ఫలితం ఉదయగిరి మండలంలో నమోదైంది. ఓట్ల లెక్కింపునకు చిన్న గది ఏర్పాటు చేయడంతో సిబ్బంది కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. చెరువుపల్లి, దాసరిపల్లి ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి.. కౌంటింగ్‌ మధ్యాహ్నం ప్రారంభించారు. చివరకు ఉదయగిరి జడ్పీటీసీ ఫలితం వెల్లడితో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయింది.
  • కావలి విశ్వోదయ ఇంజినీరింగ్‌ కళాశాలలో అల్లూరు మండలం బ్యాలెట్‌ పెట్టెలు ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు కనిపించలేదు. దాంతో లెక్కింపు ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం తహసీల్దారు శ్రీరామకృష్ణ ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి.. పెట్టెలు బయటకు తీసుకొచ్చారు.
  • మర్రిపాడు మండలం చినమాచునూరులో ఎంపీటీసీ అభ్యర్థిని తమటం బాలగురవమ్మ గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. సంబరాలు చేసుకునేందుకు అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమించారంటూ ఎంపీటీసీ అభ్యర్థినితో సహా మరో 15 మందిని, ఒక ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
  • కావలి మండలం సర్వాయపాళెంలో కౌంటింగ్‌ కేంద్రంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. వైకాపా అభ్యర్థులు పూర్తి మెజార్టీ ఉన్న స్థానాలను వదిలేసి.. తెదేపా పోటాపోటీగా ఉన్న స్థానాల వద్దకు చేరారు. ప్రతి దానికి అభ్యంతరం చెబుతుండటంతో తెదేపా.. వైకాపా ఏజెంట్ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో సద్దుమనిగింది.
...
.....

ఇదీ చదవండి:

Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Last Updated :Sep 20, 2021, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.