బీమా కోసం హత్య కేసులో మరో ట్విస్ట్​.. కాలుపై అనుమానం మిస్టరీ వీడేలా చేసింది..

author img

By

Published : Jan 18, 2023, 11:00 PM IST

SP Rohini on Secretariat Employee Death

SP Rohini on Secretariat Employee Death: మెదక్ జిల్లాలో సంచలనం రేపిన సచివాలయ ఉద్యోగి సజీవదహనం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో మరికొన్ని సంచలన వెలుగులోకి వచ్చాయి. తనలాగా ఉన్న వ్యక్తి హత్యకు ప్లాన్ వేయగా అది బెడిసికొట్టడంతో మరొకరిని హత్య చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు.

SP Rohini on Secretariat Employee Death: తెలంగాణలోని మెదక్‌ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో ఇటీవల కారు తగలబడి, వ్యక్తి సజీవ దహనమైన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో చనిపోయాడనుకున్న ధర్మ అధర్మనాటకమాడినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం తన లాగా ఉన్న వ్యక్తిని చంపేందుకు ప్లాన్ వేసి.. అది బెడిసి కొట్టడంతో అనూహ్యంగా మరొకరిని హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బీమ్లా తాండాకు చెందిన ధర్మ నాయక్ సెక్రటేరియట్​లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్​గా పనిచేస్తున్నాడు. తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించి స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టాడు. కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నష్ట పోయాడు. ఆ తరువాత చీటీలు వేసి ఆ డబ్బులను కూడా ట్రేడింగ్​లో పెట్టాడు. రూ.85 లక్షల నష్టం వచ్చిందని వాటిని తీర్చేందుకు ఈ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో పథకం ప్రకారం రూ.7.4 కోట్ల విలువైన పాలసీలు తీసుకున్నాడు. ఆ తరువాత ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలాగే ఉన్న వ్యక్తిని హత్య చేయాలని ధర్మా కుటుంబ సభ్యులతో కలిసి పక్కా వ్యూహంతో హత్యకు ప్రణాళిక రచించాడు.

తన మేనల్లుడు శ్రీనివాస్​తో కలిసి హైదరాబాద్ నాంపల్లి నుంచి అంజయ్య అనే వ్యక్తిని నిజామాబాద్ సమీపంలో ఉన్న తన మామిడి తోటలో పని కల్పిస్తామని నమ్మించి తీసుకువచ్చాడు. ఆయనను ఈ నెల 7వ తేదీన నిజామాబాద్ తీసుకెళ్లారు. అయితే వారి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అంజయ్య వారి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ధర్మా, శ్రీనివాస్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బాబు అనే గుర్తు తెలియని వ్యక్తిని పని చూపిస్తామని తమ వెంట తీసుకువెళ్లి బాసరలో గుండు కొట్టించారు. అక్కడి నుంచి కారులో బీమ్లా తండాకు బయలు దేరారు. దారిలో అతనికి కల్లు తాగించారు. వెంకటాపూర్ సమీపంలోకి వచ్చాక గొడ్డలి, కర్రతో కొట్టి బాబును హత్య చేసి డెడ్ బాడీని కారులో వేసి పెట్రోల్ పోసి తగుల బెట్టారు. ఆ తరువాత ఇద్దరూ అక్కడి నుంచి నిజామాబాద్​కు పారిపోయారు' అని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

కాలుపై అనుమానంతో మిస్టరీ వీడింది: ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కారులో దహనం అయిన వ్యక్తి ధర్మానే అని అతని భార్య నీల, కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కాగా కారులో దహనం అయిన వ్యక్తి కాలు ఆఫీస్​లో పనిచేసే అధికారి కాలు మాదిరిగా లేదని పోలీసులు అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిజామాబాద్​లో సీసీ పుటేజి ఆధారంగా ధర్మా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 17వ తేదీన ధర్మా మెదక్ వైపు వస్తుండగా అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా ఈ మర్డర్ మిస్టరీ వీడింది. కాగా హత్యకు గురయిన వ్యక్తి ఎక్కడి వాడు.. ఎవరనేది తెలియలేదని ఎస్పీ తెలిపారు.

అలాగే నిజామాబాద్​లో ధర్మా, శ్రీనివాస్​ల నుంచి తప్పించుకున్న అంజయ్య ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా మిస్టరీగా మారింది. అతని ఆచూకీ కనుగొనేందుకు నాంపల్లిలో పోలీసులు గాలిస్తున్నట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ధర్మా, శ్రీనివాస్, నీల, సునంద, మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ధర్మాపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.