నెల్లూరు ఐఏబీ సమావేశం రసాభాస - ఆనం, కోటంరెడ్డి వాకౌట్

నెల్లూరు ఐఏబీ సమావేశం రసాభాస - ఆనం, కోటంరెడ్డి వాకౌట్
Irrigation Advisory Board Meeting Nellore: నెల్లూరు జిల్లాలో ఐఏబీ సమావేశం రసాభాసగా సాగింది. నీటి పారుదల శాఖ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారంటూ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఐఏబీ సమావేశానికి వెళ్తున్న టీడీపీ నేతలు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Irrigation Advisory Board Meeting in Nellore: నెల్లూరు జిల్లాలో నీటిపారుదల శాఖ.. సాగునీటి సలహా మండలి సమావేశం రసాభాసగా సాగింది. నీటిపారుదల శాఖ అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 66 వేల 231 ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కాలువల్లో పూడికలు తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉన్నాయని.. మాయమాటలు చెబుతున్నారని.. అందుకే ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరి కొంతమంది రైతు నాయకులు బయటకు వచ్చేశారు.
TDP Leaders and Farmers Arrested: అంతకు ముందు.. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సాగునీటి సలహా మండలి సమావేశం నేపథ్యంలో తెలుగుదేశం నాయకులను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. సమావేశానికి వెళ్తున్న టీడీపీ నేతలు సుబ్బానాయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డితో పాటు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులను పోలీసులు అడ్డగించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
సుబ్బానాయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డితో పాటు, రైతులను బలవంతంగా అరెస్టు చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తుంటే అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై ప్రస్తావిస్తామనే అరెస్టు చేయించారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.
Irrigation Advisory Board Meeting Nellore: నెల్లూరులో సాగునీటి సలహా మండల సమావేశం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నేతలు, రైతులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నెల్లూరు జిల్లాలో రైతులు పంటలు పండించుకోలేని దుస్థితి నెలకొందని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదో నగర పోలీస్ స్టేషన్లో ఉన్న టీడీపీ నేతలను ఆయన పరామర్శించారు.
TDP Leader Somireddy Chandramohan Reddy Fires On Govt: 70 ఏళ్ల తర్వాత మొదటి పంటకు నీరు ఇవ్వలేని పరిస్థితిని పాలకులు తీసుకువచ్చారని సోమిరెడ్డి విమర్శించారు. గతంలో 14 టీఎంసీల నీరున్నా పంటలు పండించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 30 టీఎంసీల నీరున్నా.. సాగు చేసుకునేందుకు నీరు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు.
పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా 25 టీఎంసీల సోమశిల జలాలు వృథా అయ్యాయని చెప్పారు. కాలువల పూడికతీత పేరుతో కొట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. జిల్లాలో మంత్రి ఉన్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రైతులకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని సోమిరెడ్డి హెచ్చరించారు.
