Illegal Silica Mining: రెచ్చిపోతున్న సిలికా మైనింగ్ మాఫియా.. అక్కడ అడుగుపెట్టాలంటే వణుకు..

author img

By

Published : May 23, 2023, 11:37 AM IST

Illegal Silica Mining

Silica Mining in Nellore District: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అనుమతి ఇచ్చిన ప్రాంతంలో పరిమితికి మించి సిలికా తవ్వకాలు చేస్తూ.. అక్రమార్కులు బరితెగిస్తున్నారు. 2 అడుగుల మేర తవ్వకాలకు అనుమతి పొంది.. 20 అడుగుల వరకు తవ్వేస్తున్నారని అఖిల పక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

Illegal Silica Mining: మైనింగ్ మాఫియా.. ప్రైవేట్ సైన్యం.. అడుగుపెట్టాలంటే వణుకు..

Silica Mining in Nellore District: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు, కోట మండలాల్లో సిలికా దోపిడి.. యథేచ్ఛగా సాగుతోంది. నాలుగేళ్లుగా అధికార పార్టీ అగ్రనాయకులు అక్రమాలతో చెలరేగిపోతున్నారు. ఈ రెండు మండలాల్లోకి కొత్త వ్యక్తులు, అధికారులు అడుగుపెట్టాలంటే భయపడిపోతారు. అక్కడ మైనింగ్ చేసే దళారీలు ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని ఉంటారు.

పొలాల్లో, తీరప్రాంతాల్లో ఉండాల్సిన సిలికాను రోడ్ల మీదకు తీసుకొచ్చి కుప్పలుగా పోస్తున్నారు. 30కి పైగా అనధికార డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి లోపలికి ప్రవేశం లేకుండా కంచె వేశారు. లోపలికి ప్రవేశం లేకుండా ఇనుప గేట్లు నిర్మాణం చేశారు. వాటికి పోలీసులు రక్షణగా ఉంటారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే దాడి చేస్తారు. తమ భూముల్ని లాక్కుని సిలికా తవ్వకాలు చేపడుతున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు, స్థానికులు పడుతున్న బాధలు చూసిన అఖిలపక్షం నేతలు ఈ ప్రాంతంలో పర్యటించారు. అఖిలపక్ష నేతలకు.. గ్రామస్థులు విస్తుపోయే విషయాలను వివరించారు. ఇక్కడ 70 మంది అనుమతి పొందిన లీజుదారులు ఉన్నారు. వారిని బెదిరించి అధికార పార్టీ నాయకులు క్యూబిక్ మీటరు సిలికాను 100 రూపాయలకు తీసుకుంటున్నారు. ఇవ్వనంటే లీజులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని అఖిల పక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

రైతుల పంటలు సాగు చేసుకునే పొలాల్లో సిలికా తరలించేందుకు క్యూబిక్ మీటరుకు 30 రూపాయలు చెల్లిస్తున్నారు. వారి అక్రమాలను ప్రశ్నించిన 33 మంది రైతులపై కేసులు నమోదు చేయించారు. కొనుగోలు చేసిన అధికారపార్టీ నాయకులు క్యూబిక్ మీటరు సిలికాను 1485 రూపాయలకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని అఖిల పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు అన్యాయం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుమతి ఇచ్చిన ప్రాంతంలో రెండున్నర అడుగులో సిలికా తవ్వకాలు చేయాలి. చిల్లకూరు, కోట మండలాల్లో 20 అడుగులు వరకు తవ్వేశారని అఖిలపక్ష నేతలు అంటున్నారు. అటవీ భూములను, అదే విధంగా రైతులు పంటలు పండించే భూములను సిలికా కోసం తవ్వేశారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అఖిల పక్ష పార్టీల నేతలు తెలిపారు.

"పోయేటప్పుడు.. ఇక్కడ ఉన్న సిలికాను మొత్తం తీసుకొనిపోతారా. ఇక్కడ ఆర్డీవో ఉన్నారు. ఆయనకు కనిపించడం లేదా.. డీకేటీ పట్టాలను క్యాన్సిల్ చేసి.. ఎన్​వోసీ ఇస్తున్నారు. అధికారులంతా వైసీపీ ఆఫీసులో గుమాస్తాలా మీరు". - సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి

"రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. అదేమని అడిగితే.. వారిపై కేసులు పెడుతున్నారు. మీరేమీ భయపడొద్దు. మీకు అన్యాయం జరిగితే మేము పోరాడతాము". - వనబాక లక్ష్మీ, కేంద్ర మాజీ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.