నీటితోనే ఆరోగ్యం.. రోజుకు ఎన్ని లీటర్లు తాగాలో తెలుసా..?

author img

By

Published : Jan 9, 2023, 10:33 AM IST

Water Drinking Benefits

Water Drinking is Good For Health : మనకు సగం వ్యాధులు మంచినీళ్లు తాగడం వల్ల తగ్గిపోతాయని అంటుంటారు పెద్దలు. నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ఈ ఒక్క మాట చెబుతుంది. కానీ చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగరు. కొంతమంది మాత్రం రోజుకు ఇన్ని నీళ్లు తాగాలని లెక్కలు వేసుకుని.. టైం పెట్టుకుని మరీ తాగుతారు. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అమెరికా పరిశోధకులు అధ్యయనపూర్వకంగా తేల్చారు. వాళ్ల అధ్యయనంలో ఇంకా చాలా ఆసక్తికర విషయాలు తెలిశాయి. అవేంటంటే..?

Water Drinking is Good For Health : రోజూ నీరు తాగుతాం. సాధారణంగా దాహమేసినప్పుడు.. అన్నం తిన్నప్పుడు తాగుతుంటాం. కొందరు నియమంగా లెక్క పెట్టుకుని మరీ లీటర్ల కొద్దీ తాగుతుంటారు. ఎన్ని విశ్లేషణలున్నా.. మంచి ఆరోగ్యంతో తొణికిసలాడాలంటే రోజుకు ఎన్ని నీరు తాగాలనేది ఎక్కువమందికి ప్రశ్నే.

Water Drinking Benefits : ఈ క్రమంలో సాధారణ వ్యక్తి రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు.. అంటే 2-3 లీటర్ల నీటిని తాగడం ద్వారా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందని అమెరికా పరిశోధకులు అధ్యయనపూర్వకంగా తేల్చారు. ఎండలో, వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు.. ఈ మోతాదును కొంత మేర పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. మొత్తంగా తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు అని స్పష్టం చేస్తున్నారు.

తగినంత నీటిని తాగడం ద్వారా దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చనే కోణంలో ఆ దేశానికి చెందిన ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌’ 30 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనలో 11,255 మంది పాల్గొనగా.. 30-45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. వారు 70-90 ఏళ్ల వయసుకు వచ్చాక మరోసారి పరిశీలించారు. ఈ వివరాలు ‘ఇ బయోమెడిసిన్‌’ వైద్య పత్రికలో తాజాగా ప్రచురితమయ్యాయి. ఆ నివేదిక వివరాలతో పాటు ఆరోగ్యకర జీవనానికి తాగునీటి ఆవశ్యకతపై కిమ్స్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అకడమిక్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మణిమాలరావు పలు అంశాలను వివరించారు.

దాహమేసిన వెంటనే తాగాలి.. శరీరంలో 60-65% వరకూ నీరే ఉంటుంది. చిన్న పిల్లల్లో అయితే 80% ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల శరీరంలో నీరు కొంత తక్కువగా ఉంటుంది. శరీరంలో జీవక్రియల్లో ఉత్పత్తి అయ్యే మలినాలను కిడ్నీల ద్వారా బయటకు పంపించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

  • శరీరంలోని అంతర్గత కణాల్లో తాజా నీరు ఉంటుంది. కణాల వెలుపల సోడియంతో కూడిన నీరు ఉంటుంది. ఈ రెండింటి మధ్య నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకోవడాలు కొనసాగుతుంటాయి. ఈ ప్రక్రియ సరిగ్గా జరగనప్పుడు వ్యాధులు చుట్టుముడతాయి.
  • నీరు ఎక్కువ తాగినా అవేమీ ఒంట్లో నిల్వ ఉండవు. బయటకు వెళ్లిపోతాయి. పైగా ఆ నీటిని వడబోయడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు మంచినీరు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం దాహమేసిన 15 నిమిషాల్లోపు తాగడం మంచిది.
  • అయితే రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు. ఒకేసారి తాగితే.. శరీరం ఎక్కువ నీరుందని భావించి బయటకు పంపించేస్తుంది. మరీ కొంచెం తాగితే.. ఆ నీళ్లను దాచిపెడుతుంది. రెండూ మంచిది కాదు.
  • మనం నిత్యం తినే కూరగాయలు, పండ్లలోనూ నీరు ఉంటుంది. ముఖ్యంగా బత్తాయి, నారింజ వంటి పండ్లను తింటున్నప్పుడు ఎక్కువగా నీటిని తాగాల్సిన అవసరం ఉండదు.
  • వయసు పెరుగుతున్న కొద్దీ కూడా నీరును ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు 65-70 ఏళ్లు దాటిన వారు అధికంగా నీరు తాగితే.. వారి కిడ్నీలపై త్వరగా దుష్ప్రభావం పడే అవకాశాలున్నాయి.
మరీ ఎక్కువ తాగితే..

మరీ ఎక్కువ తాగితే.. ఒంట్లో ఎక్కువగా నీరు చేరడం వల్ల అన్ని అవయవాల్లోని కణాల్లో నీటి శాతం ఎక్కువవుతుంది. కణాల బయట ఉండాల్సిన సోడియం.. కణాల లోపలకు చేరుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. తల తిరగడం, తలనొప్పి, అయోమయం, రక్తపోటు పెరుగుతుంది. గుండె లయ తప్పుతుంది. కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది.

తక్కువ తాగితే.. డీహైడ్రేషన్‌కు లోనవుతారు. కిడ్నీల పనితీరు మందగిస్తుంది. రక్తపోటు పడిపోతుంది. కండరాలు పట్టేస్తాయి. ఈ సమస్య ముదిరితే అవయవాల పనితీరు, జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. మలబద్ధకం, తలనొప్పి, చర్మం-నోరు ఎండిపోవడం, నిస్సత్తువ సమస్యలు తలెత్తుతాయి. మూత్రం పసుపు పచ్చ రంగులోకి వచ్చిందంటే.. ఒంట్లో నీటి శాతం తగ్గిందని అర్థం చేసుకోవాలి. ఈ దశలో వెంటనే తగినంత నీరు తాగాలి. ఈ సమస్య ఎండాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.

వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చు..

వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చు.. రక్తంలో సోడియం మోతాదులు, వివిధ ఆరోగ్య సూచీల మధ్య సంబంధాలను ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ద్రవాహారాలు తక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో సోడియం మోతాదులు పెరిగినట్లు తేల్చారు. వీటి మోతాదులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్న వారికి దీర్ఘకాల జబ్బులు తలెత్తే ముప్పు పెరుగుతోంది.

శారీరక వయసు (పుట్టిన తేదీతో వచ్చే వయసు కాదు) అధికంగా ఉంటున్నట్టు, చిన్నవయసులోనే మరణించే ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధనలో తేలింది. రక్తంలో సోడియం మోతాదులు పెరిగితే.. గుండె వైఫల్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు గతంలో చేసిన అధ్యయనానికి కొనసాగింపుగా తాజా పరిశోధనలోనూ ధ్రువీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి ద్రవాల ప్రాధాన్యాన్ని ఇక్కడ నొక్కి చెప్పారు. అలానే తగినంత ద్రవాలు తీసుకుంటే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేేసుకోవచ్చని, దీర్ఘకాలం జబ్బులు లేకుండా జీవించవచ్చని అధ్యయనం తెలిపింది.

సోడియం స్థాయులు నిర్దేశిత మోతాదులో నియంత్రణలో ఉన్న వారిలో గుండె, ఊపిరితిత్తుల పనితీరు 70-90 ఏళ్ల వయసులోనూ మెరుగ్గా ఉన్నట్లు తేలింది. రక్తనాళాల్లో వాపు(ఇన్‌ఫ్లమేషన్‌) సమస్య కూడా తక్కువగా ఉంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.