గంగా పుష్కరాలకు వెళ్లేది ఎలా?

author img

By

Published : Jan 23, 2023, 12:22 PM IST

Ganga River Pushkaralu

Ganga River Pushkaralu : గంగా నది పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రికులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. ఏప్రిల్‌ 22 నుంచి ప్రారంభమై ఈ పుష్కరాలకు.. ఇప్పటి నుంచే ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. దాదాపు అన్ని రైళ్లలోనూ నిరీక్షణ జాబితాలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు భారీగా విమాన టికెట్‌ ఛార్జీలు పెరగడం వారిని ఆందోళనకు లోనుచేస్తోంది.

Ganga River Pushkaralu : హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కుటుంబసభ్యులతో కలిసి గంగా నది పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్నాడు. కాశీ, అలహాబాద్‌.. ఇలా ఎక్కడికో ఓ చోటికి వెళ్లి పుష్కరస్నానం ఆచరించాలని అనుకుంటున్నా.. రైలు టికెట్లు లభించడం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు విమాన టికెట్ల ధరలూ పెరగడం యాత్రికులను ఆందోళనకు లోనుచేస్తోంది.

గంగా నది పుష్కరాలు ఆచరించాలనుకునే యాత్రికులకు మూడు నెలల ముందే ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 22 నుంచి మే 3వ తేదీ వరకు గంగా నది పుష్కరాలు జరగనున్నాయి. కాశీ (వారణాసి), అలహాబాద్‌ (ప్రయాగ), గంగోత్రి, హరిద్వార్‌, బద్రీనాథ్‌ తదితర చోట్ల జరిగే పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో వెళుతుంటారు. ఆయా ప్రాంతాలకు అప్పటికప్పుడు రైలు టికెట్లు దొరకవేమోనన్న ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాలవాసులు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది. ‘ఐఆర్‌సీటీసీ’లో ప్రయత్నించిన, రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లకు వెళ్లినవారు.. ‘టికెట్లు అయిపోయాయి’ అన్న విషయం తెలుసుకుని అసంతృప్తి చెందుతున్నారు.

అటు పుష్కరాలు.. ఇటు వేసవి రద్దీ: తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి, అలహాబాద్‌కు రైళ్లు ఉన్నా.. వాటిలో ఖాళీలు లేవు. హరిద్వార్‌కు నేరుగా రైలు లేదు. దిల్లీ వరకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. పుష్కరాలు జరిగే మిగతా ప్రాంతాలకు వెళ్లాలనుకున్నా.. ఇదే పరిస్థితి. దాదాపు అన్ని రైళ్లలోనూ నిరీక్షణ జాబితాలే దర్శనమిస్తున్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పరిశీలిస్తే.. ఏప్రిల్‌ 21న స్లీపర్‌లో 206, థర్డ్‌ ఏసీలో 143, సెకండ్‌ ఏసీలో 65 మందికిపైగా వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. పుష్కరాలు ముగిసే రోజు వరకూ సుమారు ఇదే తరహా నిరీక్షణ జాబితా ఉంది. సాధారణంగా వేసవి సెలవుల్లో చాలామంది కుటుంబంతో కలిసి ప్రకృతి, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. అదే సమయంలో ఈ సారి గంగా పుష్కరాలు రావడంతో రైళ్లు మూడు నెలల ముందే కిటకిటలాడుతున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రత్యేక రైళ్లే పరిష్కారం: పుష్కరాలను పురస్కరించుకుని విమాన ఛార్జీలు కూడా భారీగానే పెరిగాయి. పుష్కరాలు జరిగే ఆయా ప్రాంతాలకు సాధారణంగా విమాన టికెట్ల ధరలు రూ.ఐదారు వేల వరకు ఉండగా.. పుష్కర యాత్రికుల రద్దీ దృష్ట్యా వాటి ధరలు రూ.10 వేల నుంచి రూ. 12 వేలకు చేరాయి. అంతమొత్తం భరించడం కష్టమని యాత్రికులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మీదుగా ఉత్తరాదికి వెళ్లే రైళ్లు ఐదారు వరకు ఉన్నాయి.

చెన్నై, ఎర్నాకుళం, రామేశ్వరం వంటి ప్రాంతాల నుంచి బయల్దేరేవి కూడా ఉన్నాయి. అవీ ఖాళీగా లేకపోవడం యాత్రికులను నిరాశకు లోనుచేస్తోంది. కేరళలోని త్రివేండ్రం నుంచి హైదరాబాద్‌కు 24 గంటల ప్రయాణం. ఇక్కడి నుంచి కాశీ, అలహాబాద్‌కి మరో 24 గంటలు. మొత్తం 48 గంటల ప్రయాణంతోపాటు టికెట్‌ ఛార్జీలూ ఎక్కువే. అంతభారాన్ని భరించడానికి సిద్ధపడుతున్నా టికెట్లు లభించడంలేదని పలువురు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడపాలన్న డిమాండ్‌ ఉంది. అయినా.. దక్షిణ మధ్య రైల్వే కానీ, ఇతర రైల్వే జోన్లు కానీ ఇంతవరకు దాని ఊసెత్తలేదు. పెరిగిన విమాన టికెట్ల ధరలు, రెగ్యులర్‌ రైళ్లలో టికెట్లు దొరకని పరిస్థితి దృష్ట్యా.. ప్రత్యేక పుష్కర రైళ్లను నడిపించాలని యాత్రికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.