ఏళ్లు గడుస్తున్నా.. రోడ్డు వేయని ప్రభుత్వం.. అష్టకష్టాలు పడుతున్న ప్రజలు
Updated on: Jan 24, 2023, 9:43 AM IST

ఏళ్లు గడుస్తున్నా.. రోడ్డు వేయని ప్రభుత్వం.. అష్టకష్టాలు పడుతున్న ప్రజలు
Updated on: Jan 24, 2023, 9:43 AM IST
Railway Bridge Approach Road Problem: గత ప్రభుత్వం ఆ రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టింది. రైల్వే శాఖ.. బ్రిడ్జిని పూర్తి చేసింది. ఇక కేవలం అప్రోచ్ రోడ్డు వేసి.. ఉన్న రహదారికి అనుసంధానం చేయాలి. నాలుగేళ్లు గడిచినా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం.. ఆ పని పూర్తి చేయలేదు. ఫలితంగా కొన్ని వేల మంది రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో రైల్వే గేటు పడితే.. ఇక అంతే సంగతులు అంటున్నారు.
Railway Bridge Approach Road Problem: విజయవాడ భానూనగర్ నుంచి మధురానగర్ మీదుగా.. సింగ్‌నగర్ వెళ్లే రహదారిలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. మధురానగర్‌తో పాటు దేవీ నగర్, పసుపుతోట ప్రాంతాల్లోని సుమారు 30 వేల మంది.. ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వేశాఖ తనవంతుగా అండర్ బ్రిడ్జిని పూర్తి చేసింది. ఆ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డును కార్పొరేషన్ అధికారులు వేయాల్సిఉంది. గత నాలుగేళ్లుగా.. ఆ పనుల ఊసే లేదు. విద్య, ఉద్యోగం, కూలి పనుల నిమిత్తం రోజూ ఇటుగా వెళ్లక తప్పని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రైల్వే గేటు పడితే నరకం చూస్తున్నారు.
బ్రిడ్జి అనుసంధానం పూర్తికాకపోవడంతో ప్రస్తుతం పక్కనే ఉన్న.. ఇరుకు రహదారి గుండా ప్రజలు వెళ్తున్నారు. అయితే.. ఆ రోడ్డూ గుంతలు, గోతులమయమై ప్రమాదాలకు దారితీస్తోంది. నాలుగేళ్లైనా రోడ్డు కష్టాలు తీరడం లేదంటూ.. కాలనీల్లో అద్దెకు ఉంటున్న వారు సైతం వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అనేక సార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పడంతో పాటు స్పందనలో ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించడం లేదని.. ఎన్నికలప్పుడు తాము అన్నీ గుర్తుపెట్టుకుంటామని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పెండింగ్ పనులు పూర్తిచేసి.. ప్రయాణ సౌకర్యం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
"నేను గాంధీనగర్‌లో పని చేస్తూ ఉంటాను. అండర్ బ్రిడ్జ్ ప్రారంభించక పోవడం వలన ప్రతి రోజూ గంట సమయం.. రైల్వే గేటు పడినప్పుడు వేచి ఉండాల్సి వస్తోంది". - స్థానికుడు
"అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభం అయి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటికీ అప్రోచ్ రోడ్ పనులు పూర్తి అవ్వలేదు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం". - స్థానికుడు
"రైల్వే వాళ్లు బ్రిడ్జి పనులు పూర్తి చేశారు. కేవలం అప్రోచ్ రోడ్డు పనులు మాత్రమే ఉన్నాయి. ఆ పనులు జరగక 4 ఏళ్ల నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. బస్సు కూడా రావడం లేదు". - స్థానికుడు
ఇవీ చదవండి:
