ముంబయిలో బాలుడు కిడ్నాప్.. ఏపీలో ప్రత్యక్షం.. తీసుకెళ్లొద్దని ప్రాధేయపడిన పెంపుడు తల్లి

author img

By

Published : Mar 6, 2023, 3:00 PM IST

Maharastra Missing boy news

Boy Kidnap: ముంబయిలో అదృశ్యమైన ఓ బాలుడు.. ఏడాది తర్వాత ఆంధ్రప్రదేశ్​లో ప్రత్యక్షమయ్యాడు. బాలుడి ఆచూకీ తెలియడంతో మహారాష్ట్ర పోలీసులు వచ్చి అతడిని తీసుకుని వెళ్లారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. అసలేం జరిగిందంటే?..

Boy Kidnap: ముంబయిలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ ఏడాది తర్వాత ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జగ్గయ్యపేట సమీపంలోని దేచుపాలెం గ్రామంలో లభించింది. దీంతో ఆదివారం మహారాష్ట్ర పోలీసులు జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న బాలుడిని చేరుకుని తమతో పాటు అతడిని తీసుకెళ్లిపోయారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గతేడాది ఫిబ్రవరి నెలలో ఆరేళ్ల వయసున్న ఓ బాలుడు ముంబయిలో అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ఆ బాలుడిని విజయవాడకు చెందిన ఓ మహిళ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత ఆ మహిళ.. జగ్గయ్యపేటలోని మరో మహిళకు బాలుడిని రూ.2 లక్షలకు అమ్మివేసింది. అనంతరం జగ్గయ్యపేటకు చెందిన మహిళ.. ఆ బాలుడిని దేచుపాలెం గ్రామానికి చెందిన తమ బంధువుల కుటుంబానికి రూ.3 లక్షలకు అమ్మివేసింది. అప్పటి నుంచి ఆ బాలుడు అదే కుటుంబంలో పెరుగుతున్నాడు. ఆ బాలుడిని కొనుగోలు చేసిన దంపతులు అతడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు.

ఇదిలా ఉండగా కేసు విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు విచారణలో భాగంగా విజయవాడ వచ్చారు. అక్కడ మొదట బాలుడిని విక్రయించిన మహిళను పట్టుకున్నారు. ఆమె ద్వారా బాలుడు ఎక్కడ ఉన్నాడో పోలీసులు తెలుసుకున్నారు. ఆ బాలుడు జగ్గయ్యపేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడని తెలుసుకున్న ముంబయి పోలీసులు.. వెంటనే జగ్గయ్యపేట పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి బాలుడు చదువుతున్న పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. బాలుడు అక్కడ ఉన్నట్లు తెలుసుకున్న ముంబయి పోలీసులు.. జగ్గయ్యపేట పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి బాలుడిని గుర్తించారు.

ఆ బాలుడు ముంబయిలో కిడ్నాప్ అయ్యాడని, అతనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చూపించి పోలీసులు బాలుడిని తమ వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న బాలుడిని పెంచుకున్న దంపతులు బోరున విలపిస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు బాలుడిని తీసుకొని పోలీస్ స్టేషన్​కు వచ్చారు. స్టేషన్లో తదుపరి కార్యక్రమాలు ముగించుకొని బాలుడితో ముంబయి వెళ్ళిపోయారు. ఈ కేసులో బాలుడు విక్రయానికి పురిగొల్పిన విజయవాడకు చెందిన మహిళ, రెండోసారి విక్రయానికి పెట్టిన మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.