డాక్టర్​ చదవకున్నా.. అంతకుమించి 'చేయూత'నిస్తున్న కృష్ణకుమారి

author img

By

Published : Mar 8, 2023, 3:00 PM IST

mentally handicapped training institute

ఆడుతూ పాడుతున్న వయసులో తన కుమార్తె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైనందుకు తల్లడిల్లిపోయిందో తల్లి. ఇలా అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ కోమాలోకి వెళ్లిపోయి దివ్యాంగురాలిగా మారడంతో విజయవాడకు చెందిన ఓ మహిళ గొప్పగా ఆలోచించి.. ఒక నిర్ణయం తీసుకున్నారు. తన బిడ్డ సంరక్షణలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. మానసిక దివ్యాంగుల కోసం ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. మరి ఆ సంస్థ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందామా..

మానసిక దివ్యాంగులకు చేయూత

మానసిక దివ్యాంగులతో కలిసిపోయి వారి ఆలనా పాలన చూసుకుంటున్న ఈమె పేరు కృష్ణకుమారి. వైద్య విద్య అభ్యసించి సమాజానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న ఆమె.. డాక్టర్ చదవకున్నా అంతకుమించి సేవలు అందిస్తున్నారు. మానసిక దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారి మనస్థత్వం తెలుసుకుని వారిలో ఒకరిగా కలిసిపోతే తప్ప.. అలాంటి చిన్నారులను అర్థం చేసుకోలేం. సాధారణ టీచర్ల మాదిరిగా వారికి పాఠాలు బోధించడమూ అంత సులువు కాదు. కానీ కృష్ణకుమారికి ఇది వెన్నతో పెట్టి విద్య. ఎందుకంటే తన బిడ్డ కూడా ఓ మానసిక దివ్యాంగురాలే.

అల్లారుముద్దుగా పెంచుకున్న తన చిన్నారి కోమాలోకి వెళ్లి ఒక్కసారిగా మానసిక దివ్యాంగురాలిగా మారిపోవడంతో తనకు ఇలాంటి శిక్షణ సంస్థ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. 2007లో 'చేయూత' మానసిక దివ్యాంగుల శిక్షణా సంస్థ ఏర్పాటు చేసి.. ఇప్పటికీ కొన్ని వందల మందికి సేవ చేశారు. తక్కువ ఫీజులు తీసుకొని అనేకమంది మానసిక దివ్యాగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. అసలు బతుకుతారో లేదో తెలియదు అనుకున్న వారి చిన్నారులను అక్కున చేర్చుకుని వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని స్థితిలో ఉండే చిన్నారులు.. ఇప్పుడు తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దారని తల్లిదండ్రులు చెబుతున్నారు. తక్కువ ఫీజులతో చక్కని శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.

"బాబు పుట్టగానే తనకు ఫిస్టు వచ్చింది. దీనివల్ల బాబు హార్ట్​కు హోల్స్​ కూడా పడ్డాయి. కర్నూల్ హాస్పిటల్​కు బాబును తీసుకుని వెళ్లాము. బాబు పరిస్థితిని చూసిన వైద్యులు అతడు బతకడం కష్టం అన్నారు. దీంతో మేము కూడా బాబుపై ఆశలు వదిలేసుకున్నాము. అయితే ఈ సూర్య కుమారి మేడం మాత్రం బాబుకు ఫ్యూచర్ ఉందని చెప్పి తమ సంస్థలో చేర్చుకున్నారు. ఇక్కడ ఫీజు కూడా తక్కువగానే తీసుకుంటున్నారు". - శివప్రసాద్, మానసిక దివ్యాంగుని తండ్రి

"మా బాబు ఇంతకుముందు అమ్మ, నాన్న అనే పదాలు తప్ప ఇంకేం మాట్లాడేవాడు కాదు. ఇక్కడికి పంపించినప్పటి నుంచి కొన్ని పదాలను నేర్చుకుని మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మా బాబు.. పిల్లలను కొట్టేవాడు. అయితే ఇప్పుడు మా బాబు అలా చేయడం లేదు. మా బాబు ఇప్పుడు తనంతట తాను కొన్ని పనులు కూడా చేసుకుంటున్నాడు." - సాహిన, మానసిక దివ్యాంగుని తల్లి

ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేస్తే అనేక సమస్యలు ఎదురవుతాయని తెలిసినా.. బాధల్లో ఉన్న తల్లులకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చినట్లు కృష్ణకుమారి తెలిపారు. కుటుంబ సహకారంతోనే ఇదంతా సాధ్యమయిందని వివరించారు.

"మానసిక దివ్యాంగులను డీల్ చేయటం చాలా కష్టం. మనం ఎంత ప్రయత్నించినా కూడా వాళ్లలో చాలా తక్కువ పర్సంటేజ్ ఇప్రూవ్​మెంట్ ఉంటుంది. ఇలాంటి పిల్లలకు మా సంస్థ ద్వారా సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాలను నేర్పిస్తున్నాము." - కృష్ణకుమారి, చేయూత సంస్థ నిర్వహకురాలు

ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇలాంటి సంస్ధలు స్థాపించి మానసిక దివ్యాంగులకు అండగా నిలవాలని కృష్ణకుమారి కోరుతున్నారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.