అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కరించాలి.. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం

author img

By

Published : Mar 8, 2023, 5:30 PM IST

సోమువీర్రాజు

Agri Gold Issue : అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేతపత్రం ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మూడున్నర సంవత్సరాలు గడిచినా నేటికీ పరిష్కరించ లేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు.

Agri Gold issue : అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మూడున్నరేళ్లు గడిచినా నేటికీ పరిష్కరించలేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 15, 16, 17 తేదీల్లో విజయవాడలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

పాదయాత్ర సమయంలో బాధితులను ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించారన్నారు. చనిపోయిన బాధితులకు రూ.10 లక్షలు నష్ట పరిహారం ఇస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. నిజాయితీ గల అధికారిని నియమించి అగ్రిగోల్డ్ ఆస్థులను వేలం వేసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కోర్టు ద్వారా అగ్రిగోల్డ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే జూన్ నుంచి ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి : అగ్రిగోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేతపత్రం ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్ధానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు సీఎం జగన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే అధికారం వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటినా ఎందుకు పరిష్కరించలేదని బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నించారు.

అగ్రిగోల్డు సంస్ధ మదుపు చేసిన కష్టమర్లకు సకాలంలో నగదు చెల్లింపు చేయకపోవడంతో 142 మంది అకాల మృతి చెందారన్నారు. ఆనాడు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లిస్తానంటే, జగన్ మాత్రం రూ.10 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క నయా పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా అని సోము వీర్రాజు నిలదీశారు.

అగ్రిగోల్డు బాధితులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.. కానీ ప్రభుత్వం వారి గోడు వినేందుకు కూడా ముందుకు రాకపోవడంతో వారి సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో లేదో తెలియని పరిస్థితి, అదేవిధంగా అగ్రిగోల్డు సంస్ధలో పని చేసిన ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటివరకు అగ్రిగోల్డు వ్యవహారంపై ఎంతవరకు నగదు పరిష్కారాలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.