VIJAYAWADA DRUGS CASE: 'పార్శిల్ రాలేదని ఫోన్​ చేశాడు... పోలీసులకు పట్టుబడ్డాడు'

author img

By

Published : May 12, 2022, 5:42 AM IST

డ్రగ్స్

నేరగాళ్లు ఎంత జాగ్రత్తపడినా ఎక్కడో ఓ చోట చిన్న ఆధారాన్ని వదిలేస్తారు. అవే వాళ్లను పట్టిస్తాయి. విజయవాడలో కలకలం రేపిన నిషేధిత డ్రగ్ ఎఫిడ్రిన్ రవాణా కేసు నిందితుడూ అలాగే చిక్కాడు. పార్శిల్‌ ఇంకా చేరలేదంటూ కొరియర్‌ బాయ్‌కు ఫోన్‌ చేసి.. దొరికిపోయాడు.

విజయవాడలో కలకలం రేపిన నిషేధిత డ్రగ్ ఎఫిడ్రిన్ కొరియర్‌ కేసు చిక్కుముడి వీడింది. ఆపార్శిల్‌ పంపింది చెన్నైకి చెందిన అరుణాచలంగా పోలీసులు తేల్చారు. ఐతే విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ రవాణాను అలవాటుగా మార్చుకున్న అరుణాచలం ఇందుకోసం నకిలీ ధ్రువపత్రాన్ని వినియోగించాడు.

'పార్శిల్ రాలేదని ఫోన్​ చేశాడు... పోలీసులకు పట్టుబడ్డాడు'

పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోపిసాయి అనే వ్యక్తి ఆధార్ జిరాక్స్‌ సంపాదించి అందులో తన ఫొటోను మార్ఫింగ్ చేశాడు. దుస్తుల్లో ఎఫిడ్రిన్‌ పెట్టిన అరుణాచలం ఆ పార్శిల్‌ను విజయవాడలోని డీఎస్​టీ ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా పంపాడు. ఐతే కొరియర్ సంస్థ ఆ పార్శిల్‌ను కెనడాకు పంపింది. అక్కడ సంబంధిత వ్యక్తులు లేకపోవటంతో తిరిగి బెంగళూరు హబ్‌కు చేరింది. అక్కడి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి అందులో ఎఫిడ్రిన్‌ గుర్తించారు. కొరియర్ బాయ్‌ తేజను బెంగళూరు పిలిపించి కస్టమ్స్ అధికారులు.. విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు.
అసలు ఈ కొరియర్‌ పంపిందెవరో పోలీసులకు అంతుచిక్కని పరిస్థితుల్లో అరుణాచలం.. కొరియర్ బాయ్ తేజకు ఫోన్ చేశాడు. తానిచ్చిన పార్శిల్ ఆస్ట్రేలియాకు ఇంకా చేరలేదేంటని ప్రశ్నించాడు. ఆ ఫోన్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు అరుణాచలం చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు.. చెన్నై వెళ్ళిన ప్రత్యేక బృందం అరుణాచలం ఇంటిని గుర్తించింది. ఇటీవలే దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి తీసుకొచ్చిన సుమారు రూ.25 లక్షల విలువజేసే ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణాచలం దుబాయ్, సింగపూర్ నుంచి వస్తువులను బిల్లులు లేకుండా తెచ్చి... చెన్నైలో తక్కువకే విక్రయిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అలా పార్శిళ్లను ఇతర దేశాలకు కొరియర్ చేస్తాడని వివరించారు.

ఇక డ్రగ్ మాఫియాకు కస్టమ్స్ అధికారులతో సంబంధాలున్నాయని అరుణాచలం విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం..పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. నిందితుడు అరుణాచలాన్ని బెంగళూరు కస్టమ్స్ అధికారులు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక్కడి పోలీసులు ఆధార్‌ మార్ఫింగ్ కేసులో దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: విజయవాడ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆధార్ కార్డులో ఫొటో మార్ఫింగ్ చేసి కొరియర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.