బడ్జెట్ పై కసరత్తు ప్రారంభించిన తెలంగాణ.. ఎన్నికల బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి

author img

By

Published : Jan 3, 2023, 12:52 PM IST

Telangana Budget 2023

Telangana Budget 2023: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలు పూర్తైన నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకొని.. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తుకు ఆర్థికశాఖ సన్నద్ధమైంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లలో భారీగా తగ్గుదల, రుణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. సొంత రాబడులు పూర్తి ఆశావహంగా, అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా 15 నుంచి శాతానికిపైగా వృద్ధిని అంచనా వేస్తున్న సర్కారు.. హామీల అమలు, పథకాల కొనసాగింపు, ఇతరాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో బడ్జెట్ కసరత్తును ప్రారంభించనుంది.

Telangana Budget 2023: ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ కోణంలోనే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను కూడా సిద్ధం చేయనుంది. ఈ ఏడాది కేసీఆర్ సర్కారు ప్రజా తీర్పు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ తరుణంలో ఎన్నికల కోణంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూపకల్పన చేయనున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మూడు త్రైమాసికాలు గడిచిపోయాయి. చివరి త్రైమాసికం మాత్రమే మిగిలి ఉంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని... రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ త్వరలోనే కసరత్తు వేగవంతం చేయనుంది.

Telangana Budget 2023-24 : 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రెండు లక్షలా 52 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షా 26 వేల కోట్ల సొంత రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి. 90 వేల కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం వచ్చింది. మిగిలిన మూడు నెలల్లోనూ ఇదే తరహాలో రాబడులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా పన్ను తదితరాల ద్వారా ఆశించిన ఆదాయం ఖజానాకు చేరుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 శాతానికిపైగా వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూడా భారీగానే ఉండవచ్చని అంటున్నారు. పన్నేతర రాబడి కూడా పదివేల కోట్ల మార్కును దాటింది. భూముల వేలం తదితరాలు కొనసాగుతున్న తరుణంలో పన్నేతర రాబడి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం ఈ ఏడాది బాగా కోతపడింది. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు మాత్రమే వస్తున్నాయి. గ్రాంట్లను భారీగా అంచనా వేసినప్పటికీ రాష్ట్రానికి వస్తున్నది మాత్రం చాలా తక్కువే. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల మొత్తం దాదాపు 60 వేల కోట్లు అంచనా వేయగా డిసెంబర్ నెల వరకు వచ్చింది కేవలం 15 వేల కోట్ల లోపు మాత్రమే.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించి కూడా కేంద్రం ఆంక్షలు విధించింది. ఎఫ్ఆర్‌బీఎంకు లోబడి ఏడాది 52 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించినప్పటికీ.. కేంద్రం ఆ మొత్తానికి అనుమతి ఇవ్వలేదు. కేంద్ర నిబంధనలతో రుణాల మొత్తంలో 20వేల కోట్లు కోత పడిందని, అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ఆటంకాలు కలిగాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. డిసెంబర్ నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం 28 వేల కోట్ల రుణం తీసుకోగా... రానున్న మూడు నెలల్లో మరో ఆరువేల కోట్లకు పైగా అప్పు తీసుకోవాలని భావిస్తోంది.

ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ సిద్ధం చేయనుంది. ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు నెరవేర్చాల్సిన హామీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ఆకాంక్షల అమలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సిద్ధం చేయనుంది. రానున్న ఏడాది అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించి బడ్జెట్ కసరత్తు కొనసాగించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.