ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టిన కేసీఆర్‌ సర్కారు

author img

By

Published : Jan 1, 2023, 10:27 AM IST

KCR GOVERNMENT HAS STEPPED INTO THE ELECTION YEAR

KCR GOVERNMENT HAS STEPPED INTO THE ELECTION YEAR:తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టింది. రెండు మార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న తెరాస సర్కార్... ఇప్పుడు భారాస పేరు మీద ప్రజల ముందుకు వెళ్లనుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పెండింగ్ హామీలను పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సంక్రాంతి తర్వాత కొత్త సచివాలయాన్ని... అనంతరం అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు సర్కార్ సన్నద్ధమవుతోంది.

KCR GOVERNMENT HAS STEPPED INTO THE ELECTION YEAR:తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలు అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ సర్కార్‌కు 2023 అత్యంత కీలకం కానుంది. ఈ ఏడాది మరోమారు ప్రజాతీర్పు కోసం వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలోపు శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో కేసీఆర్ సర్కార్ ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టినట్లైంది. రెండో దఫాలో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం... రానున్న మార్చిలో ప్రస్తుత టర్మ్‌కు సంబంధించిన చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పెండింగ్‌లో ఉన్న హామీలను ప్రభుత్వం నెరవేర్చాల్సింది. సొంత ఇంటిస్థలాలు ఉన్న పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని అందిస్తామని గత బడ్జెట్ లో పేర్కొన్న ప్రభుత్వం... అందుకు అనుగుణంగా నిధులు కూడా కేటాయించింది. పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. రైతుబంధు, దళితబంధు, రైతు రుణమాఫీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంది.

ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కేంద్రం ఆంక్షల మేర నిధుల సమీకరణ సర్కార్‌కు సవాలుగా మారింది. నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టులు సహా ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సరిపడా నిధులను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం అదనపు టీఎంసీ, తదితర ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, వివాదాలు పరిష్కరించుకొని ముందుకెళ్లాల్సి ఉంది. ధరణి సమస్యలు, పోడు భూముల అంశం తదితరాలను పరిష్కరించాల్సి ఉంది.

కొలువుల జాతర.. భారీగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వాటి ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆరువేల కోట్ల రూపాయలు పైచిలుకు వ్యయంతో విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతోనే చేపడుతున్న భారీ ప్రాజెక్టుకు నిధుల సమీకరణే అత్యంత కీలకం. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... కొత్త ఏడాదికి ప్రారంభోత్సవంతో శ్రీకారం చుడుతోంది. నూతన సంవత్సరం కానుకగా కొత్తగూడ - కొండాపూర్ ఫ్లైఓవర్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ప్రారంభోత్సవానికి సిద్ధంగా నూతన సచివాలయం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూడు నిర్మాణాలు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయ భవనం నిర్మాణం తుదిదశకు చేరుకొంది. సువిశాలంగా, అత్యాధునిక వసతులతో కొత్త సచివాలయం సిద్ధమవుతోంది. ప్రధాన పనులన్నీ పూర్తి కాగా... అంతర్గత, ఇతర పనులు వేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం 18వ తేదీన మంచి ముహూర్తం ఉన్నందున ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అన్ని అంతస్థుల్లో అంతర్గత పనులు పూర్తి కాకపోయినా... భవనం వెలుపలి పనులు, సీఎం కార్యాలయం ఉండే ఆరో అంతస్థులో అంతర్గత పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలన్న ఆలోచనలో సర్కార్ ఉంది.

అధికారుల బదిలీలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులు స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగేలా సచివాలయం ఎదురుగా అమరవీరుల స్మారకం సిద్ధమవుతోంది. స్మారకానికి సంబంధించిన పనులు కూడా 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అన్ని పనులను పూర్తి చేసి అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ విగ్రహం, పార్కును ప్రారంభించాలని భావిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయనుంది. పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు మొదటి లేదా రెండో వారంలోనే జరగనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.