మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో నేడు 'సీమగర్జన'

author img

By

Published : Dec 5, 2022, 10:16 AM IST

Seema garjana in Kurnool

SEEMA GARJANA IN KURNOOL : మూడు రాజధానులకు జై కొట్టించేందుకు కర్నూలులో తలపెట్టిన 'సీమగర్జన' కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక STBC కళాశాల మైదానంలో ఈ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ నేతలు, అధికారులు విజయవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దుకాణాలను మూసివేయించిన అధికారులు.. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పలు పరీక్షలు వాయిదపడ్డాయి. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

SEEMA GARJANA : కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ.. చేపట్టిన సీమగర్జన కార్యక్రమంలో భాగంగా.. భారీ బహిరంగ సభను ఏర్పాటుచేస్తున్నారు. STBC కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. రాయలసీమ జిల్లాల ప్రజలు, నాయకులు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే.. సీఎం జగన్‌ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

సీమగర్జన పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ.. విపక్షాల నాయకులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని సుప్రీంకోర్టులో చెప్పి.. కర్నూలులో హైకోర్టు ఎలా ఏర్పాటుచేస్తారని నిలదీశారు. సభకు రానివారు రాయలసీమ ద్రోహులు అంటూ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, మాజీ ఎంపీ T.G.వెంకటేశ్‌ ఖండించారు. అసలు ద్రోహులు వైకాపా నాయకులేనని.. వామపక్షాల నేతలు విమర్శించారు..

సీమగర్జనను విజయవంతం చేయాలని.. వైసీపీ తోపాటు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి ప్రజలను తరలించాలని వైకాపా అధిష్ఠానం.. శ్రేణులను ఆదేశించింది. ఆయా జిల్లాల నుంచి 770 పాఠశాల బస్సులను ఆధీనంలోకి తీసుకుంది. ఒక్కో మహిళా సంఘం నుంచి... ఇద్దరు నుంచి ఐదుగురిని తరలించేలా సంఘం లీడర్లకు ఆదేశాలందాయి. సభకు రాని సంఘాలకు వంద రూపాయలు జరిమానా ఉంటుందని సెల్‌ఫోన్‌లలో సందేశాలు పంపారు.

కర్నూలులో ఉదయం 6 గంటల నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు అమలవుతాయని.. దుకాణాలను మూసివేయాలని ఆదేశాలిచ్చారు. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి పీజీ, B.P.E.D., M.P.E.D. రెండో సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులను బడి బస్సుల్లో సభకు పంపించాలని యాజమాన్యాలకు వైకాపా నేతలు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఫార్మెటివ్‌-2 పరీక్షలుండటంతో పాఠశాల యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి.

కర్నూలు ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దుచేశారు. ఉమ్మడి కర్నూలుతోపాటు కడప, అనంతపురం జిల్లాల నుంచి వెయ్యి మంది పోలీసులకు గర్జనసభ బందోబస్తు విధులు అప్పగించారు. ఇక సభ ఏర్పాట్లలో కర్నూలు కార్పొరేషన్‌ కీలకంగా వ్యవహరించింది. అధికారులు సొంత నిధులతో కరపత్రాలు, బ్యానర్లు వేయించేలా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిర్వహణ ఖర్చు ఎవరు భరించాలన్న అంశంపై విభేదాలు రాగా... వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్‌ చేసి విరాళాలు సేకరించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.