"ఊరు పొమ్మంటుంది.. పట్నం రమ్మంటుంది".. బతకలేక ప్రజల వలస బాట

author img

By

Published : Jan 20, 2023, 7:32 AM IST

Updated : Jan 20, 2023, 12:44 PM IST

Migrations In Kurnool

Migrations In Kurnool : చేయడానికి పనుల్లేవు. ఏదో రూపాయి వస్తుందని వేసిన పంటలూ నష్టాన్ని మిగిల్చాయి. అప్పులు చేయక తప్పలేదు. ఇక చేసేదేముంది..?.. వలసలే గతి. బయటి రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్తే... కనీసం తాము కాస్త తిని ఇంటికి ఎంతో కొంత పంపించవచ్చనే ఆశ. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ముసలివాళ్లకు పిల్లల్ని అప్పజెప్పి... పొట్ట చేతబట్టుకుని ఉపాధి వేటలో పడుతున్నట్లు కర్నూలు జిల్లా వలసదారుల ఆవేదనతో చెబుతున్న మాట. ఒకటి కాదు రెండు కాదు... కొన్ని వందల కుటుంబాలది ఇదే దీనస్థితి అని... ఈటీవీ భారత్​- ఈటీవీ - ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమైంది.

Migrations In Kurnool : కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మళ్లీ వలసలు మొదలయ్యాయి. గత సీజన్‌లో వర్షాలు అధికమై అనేకచోట్ల పంటనష్టం ఏర్పడింది. చిన్న, పేద రైతులు ఎందరో అప్పులపాలయ్యారు. సొంత భూమి లేక కొందరు.. కొద్దిగా ఉన్నా కౌలుకు మరికొంత తీసుకుని మరికొందరు.. సాగు చేసిన పేద రైతులకు అప్పులు మరింత ఎక్కువయ్యాయి. పొలాలు సాగు చేస్తున్నది కొద్దిమేరే. ఫలితంగా అందరికీ పనులు దొరకడంలేదు. దీంతో అనేకమంది పేదలు, కౌలు రైతులు నగరాలకు, పట్టణాలకు, వ్యవసాయ పనులు ఉన్నచోట్లకు వలస పోతున్నారు.

"ఊరు పొమ్మంటుంది.. పట్నం రమ్మంటుంది".. బతకలేక ప్రజల వలస బాట

ఆ పథకాలతో ఏడాది అంతా ఎలా బతుకుతాం: ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ‘పేదలకు ప్రభుత్వం వివిధ పథకాలు అందిస్తోంది కదా’ అని ప్రశ్నిస్తే ‘ఆ ఒకటి, రెండు పథకాలతో ఏడాదంతా ఎలా బతగ్గలమని’ ప్రశ్నిస్తున్నారు. ‘ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్​’ బృందం కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కరవు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పేదల విషాద గాథలు ఎన్నో వెలుగు చూశాయి. అనేకమంది సంక్రాంతి వేళలో కూడా వలసపోతూ కనిపించారు. మరికొందరు పండగ వెళ్లిన వెంటనే వెళ్లిపోతామని చెప్పారు. ఆ పల్లెల్లో పండగ కళ ఎక్కడా కనిపించలేదు.

ఇప్పటికే వలస వెళ్లిన వందల మంది: కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం పల్లెపాడు, చింతకుంట, కోసిగి, జంపాపురం, దుద్ది, అగసనూరు, సాతనూరు, బెళగల్‌, కోలమాన్‌పేట గ్రామాలతో పాటు పెదకడబూరు మండలంలోని కల్లుకుంట, దనిగట్టు, చిన్నకడబూరు, కంబళదిన్నె, జాలవాడి, మురుకాని, దొడ్డిమేకల, బసలదొడ్డి, ఉలికనిమి, నౌలేకల్లు తదితర గ్రామాల నుంచి వందల మంది ఇప్పటికే వలస వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట, రాయదుర్గం, ఇరేహాళ్‌, కల్యాణదుర్గం మండలాల్లోని కొన్ని గ్రామాల్లోనూ ప్రజలు ఊరు విడిచి వెళ్లిపోయారు. వీటిలో తుంగభద్ర నదికి, దాని ఉపనది వేదవతికి సమీపంలో ఉన్న గ్రామాలే ఎక్కువ ఉన్నాయి.

ప్రాజెక్టు నిండిన సాగు చేయడానికి భయపడుతున్న అన్నదాతలు: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు ఏళ్ల తరబడి నీళ్లు రావడం లేదు. ఈ ఏడాది ప్రాజెక్టు నిండినా భూములు సిద్ధం చేసుకుని సాగు చేయడానికి రైతులు భయపడుతున్నారు. జీడిపల్లి నుంచి భైరవానితిప్పకు నీటిని ఎత్తిపోసే పథకం నిలిచిపోయింది. వేదవతి ప్రాజెక్టు నిర్మించి వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా ముందడుగు పడటం లేదు. తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నా ఆ నీటిని రాజోలిబండ కుడి కాలువ నుంచి మళ్లించే పథకం పనులు చేయాల్సి ఉంది. వీటికీ నిధులివ్వలేదు.

తుంగభద్రను ఆనుకుని కొన్ని ఎత్తిపోతల పథకాలున్నా వాటి ద్వారా సాగయ్యే ఆయకట్టు అంతంతే. భైరవానితిప్ప ప్రాజెక్టులో ఈ ఏడాది నీళ్లు నిండి ఆయకట్టు సాగవుతున్నా అనేక వేల ఎకరాలు ఈ కరవు ప్రాంతాల్లో వర్షాధారంగానే ఉన్నాయి. తుంగభద్ర ఎడమ గట్టు కాలువ నీళ్లు అందాల్సి ఉన్నా కొన్ని చివరి భూములకు అందడం లేదు. ఫలితంగా అక్కడ ఎలాంటి పనులూ లేవు. దీంతో ఈ గ్రామాల ప్రజానీకం వలసపోక తప్పడం లేదు.

కోసిగి రైల్వేస్టేషన్‌ కేరాఫ్‌ వలసలు: భోగి పండగకు రెండ్రోజుల ముందు కోసిగి రైల్వేస్టేషన్‌లో ఎందరో వలసజీవులు కనిపించారు. కోసిగి మండలంతో పాటు చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చిన వీళ్లు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు రైలు ఎక్కి వెళ్లిపోతున్నారు. పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే మధ్యలో వచ్చి వెళ్తామని చెప్పారు. ఎన్నాళ్లు పనులుంటే అన్నాళ్లు చేసుకుంటామన్నారు. సొంత భూములు లేకపోయినా చాలామంది కౌలుకు భూములు తీసుకున్న వారే. ఈ క్రమంలో అప్పుల బారిన పడ్డారు.

"సెంటు భూమి లేదు. ఉన్న మూడు సెంట్ల జాగాలో నివాసం ఉంటున్నాం. నలుగురు మగపిల్లలు. ఒక ఆడపిల్ల. ఇక్కడ పనులు లేవు. పనులు లేకపోతే మాకు బతుకులు లేవు. ఆరుగురం ఉన్నాం. ఏం తిని బతకాలి? ఇప్పటికే రూ. 1.80 లక్షలు అప్పులు చేశాం. అందుకే పనులు వెతుక్కుంటూ ముంబయికి వలసపోతున్నాం. ఇప్పటికే నా తమ్ముడి కుటుంబం వెళ్లిపోయింది. ఇక్కడ అమ్మ ఉంటుంది. పిల్లలను ఆమె దగ్గర వదిలేశాం. ఇక్కడ పనులు లేవు. ఉన్న కొద్ది రోజుల్లోనూ వాళ్లు ఇచ్చేది తక్కువే" -వీరేశ్వర్​, వలసదారుడు, కోసగి

"‘ముంబయిలో సిమెంటు పనులు చేస్తాం. ఆయనకు రోజుకు రూ.600 ఇస్తారు. నాకు రూ.400 ఇస్తారు. ఇక్కడుంటే మా ఆయనకు ఏమీ పని ఉండదు’ .ఏడాదంతా తినాలంటే ఇక్కడ పనులు సరిపోవు"-కమలమ్మ, వీరేశ్వర్​ భార్య

ఇళ్లకు తాళాలు: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో ప్రజలు ఇప్పటికే వలసలు వెళ్లిపోవడంతో అనేక ఇళ్లకు తాళాలు కనిపించాయి. పిల్లలు, ముసలివాళ్లు మాత్రమే ఉన్న ఇళ్లు ఎన్నో. ఈ ప్రాంతం భైరవానితిప్ప ప్రాజెక్టుకు సమీపంలో ఉంటుంది. నిజానికి దశాబ్దాల తరబడి ఈ ప్రాజెక్టులోకి నీళ్లు రావడం లేదు. దీంతో అనేక భూములు బీడు పడి ఉన్నాయి.

కంపలు మొలిచిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత భారీ వర్షాలతో ఈ ఏడాది ప్రాజెక్టు నిండింది. కొంతమంది సాగు చేస్తున్నా మరికొందరు పెట్టుబడులు పెట్టలేక వెనకడుగు వేశారు. సాగయిన భూములు.. ఉన్న వారందరికీ పనులు చూపించలేకపోతున్నాయి. ఈ ఊళ్లో వలస బాధిత విషాద గాథలు ఎన్నో. పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి అక్కడే అసువులు బాసిన వారు ఉన్నారు. దాంతో తండ్రిని కోల్పోయి తల్లి అండతోనే ఉన్న పిల్లలూ ఎందరో.

‘‘ఎక్కడ పనులుంటే అక్కడికే వలస పోతాం. మా ఊళ్లో దాదాపు 1200 ఇళ్లు ఉన్నాయి. అనేక కుటుంబాలకు వలసలు తప్పవు. ఆరు నెలలు పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోతుంటాం’’-వెంకటేశ్​, వలసదారుడు, గోనబావి

అయిదుగురు పిల్లలు అనాథలయ్యారు!

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో వడ్డే నాగరాజుకు అయిదుగురు పిల్లలు. భార్య రెండేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయింది. నాగరాజు పనుల కోసం బెంగళూరు వెళ్లాడు. అక్కడ పారతో మట్టి పనులు చేస్తుండగా పొరపాటున భూగర్భ విద్యుత్తు లైనుకు తాకి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చనిపోయాడు. అయిదుగురు పిల్లలు అమ్మానాన్నా లేని వారయ్యారు. ప్రస్తుతం వారు తలోదిక్కు అయిపోయారు. పెద్దపిల్లలు పనులు చేసుకుంటున్నారు. చిన్న పిల్లలను బంధువులు చేరదీశారు. ఇలాంటి విషాదగాథలు ఈ ఊళ్లల్లో ఎన్నో..

అప్పు తీర్చడానికి వలస పోతున్న దంపతులు: కర్నూలు జిల్లా కోసగి మండలం కోలమాన్​పేటకు చెందిన జ్యోతి దంపతులకు నలుగురు ఆడపిల్లలు. రెండెకరాలు కౌలుకు తీసుకున్నారు. పంట సాగు చేశారు. అవసరమైనప్పుడు వర్షం లేదు. అవసరం లేనప్పుడు వర్షం ఎక్కువై పంట దెబ్బతింది. ఆదాయం రాకపోగా అప్పు మిగిలింది. దాదాపు రూ.60 వేలు అప్పు తీర్చాల్సి ఉంది. తీర్చే మార్గం లేదు. బతికే దారి లేదు. ఊళ్లో పనుల్లేవు. పనులు చేసుకుని నాలుగు పైసలు సంపాదించుకుని అప్పు తీరుద్దామని ఆ దంపతులు వలసపోతున్నారు. చిన్న పిల్లలను ఇంట్లో ముసలివాళ్లే సాకాల్సి ఉంటుంది. కోసిగి రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఆమె తన ఆవేదన పంచుకుంది.

పనుల్లేక ముంబయి పోతున్నా : కోసిగి మండలం దుద్ది గ్రామానికి చెందిన రాజు చాలాకాలం ముంబయిలోనే ఉన్నాడు. అక్కడ కూలి పనికి వెళ్లేవాడు. కరోనా సమయంలో సొంత ఊరికి వచ్చేశాడు. ఊళ్లోనే ఉందామనుకున్నాడు. ఇక్కడ పండ్ల వ్యాపారం చేశాడు. అది ఏ మాత్రం లాభసాటిగా లేదని వాపోయాడు. ఇక లాభం లేదని మళ్లీ వ్యవసాయ పనుల కోసం వలసవెళ్లి పోతున్నట్లు చెప్పాడు. ఇక్కడ పనులు లేవని, ఉన్నా ఇచ్చే కూలీ కూడా తక్కువేనని చెబుతున్నాడు. అవి ఏం సరిపోతాయని ప్రశ్నించాడు. నిత్యం ఉపాధి కల్పించే పనులు అవసరమని చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 20, 2023, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.