MONTESSORI SCHOOL CLOSED: విజయవాడలోని మాంటిస్సోరి పాఠశాల మూసివేత

author img

By

Published : Sep 26, 2021, 12:28 PM IST

vijayawada-montessori-school-closed

బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉన్నత లక్ష్యంతో.. విజయవాడలో ఏర్పాటైన మాంటిస్సోరి పాఠశాల మూతపడింది. ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో.. ఈ ప్రఖ్యాత విద్యాసంస్థ ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. అతి తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్య అందిస్తూ.. పేదల ఉన్నత చదువులకు సాయపడుతున్న సంస్థ.. మూతపడటంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడలోని మాంటిస్సోరి పాఠశాల మూసివేత

విజయవాడ వాసులకు సుపరిచితమైన మాంటిస్సోరి పాఠశాల మూతపడింది. ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ పని చేస్తున్న 13 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసుకుంటున్నందున.. పాఠశాలను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. టీసీలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేరాలని విద్యార్థులకు సూచించింది. 1954లో ప్రారంభమైన విద్యాలయానికి ఇప్పటివరకు ప్రభుత్వం గ్రాంటు ఇస్తుండటంతో తక్కువ ఫీజులతోనే నిర్వహించారు. తాజా నిర్ణయంతో 450 మంది విద్యార్థులు వేరే పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తొలుత ప్లేస్కూల్‌గా 1955లో మాంటిస్సోరి పాఠశాలను కోటేశ్వరమ్మ ప్రారంభించారు. ఆ తరువాత ఆమె స్థాపించిన అన్ని సంస్థలకు అదే పేరు పెట్టారు. స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు మహిళా కళాశాలను ప్రారంభించారు. విద్యా సంస్థల స్థాపనకు కృషి చేసినందుకు కోటేశ్వరమ్మ 2015లో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఆమె 2019లో మరణించారు. మగవారు మాత్రమే సంస్థలు నడపగలరు అనుకునే రోజుల్లో.. స్త్రీశక్తిని నిరూపించి సేవలు అందించినందుకు కోటేశ్వరమ్మకు 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆమె మనవడు రాజీవ్ ప్రస్తుతం మాంటిస్సోరి పాఠశాల కరస్పాండెంట్‌గా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో.. విద్యార్థులకు టీసీలు ఇస్తున్నామని ఆయన చెప్పారు.

ఎందరో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ఇక్కడ చవుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఫోర్స్బ్‌ జాబితాలో చోటు దక్కించుకున్న సిస్కో సీఈఓ పద్మశ్రీ వారియర్‌, ప్రముఖ హృద్రోగ వైద్యుడు రమేష్, మాజీ ఎంపీ మాగంటి బాబు.. ఇలా ఎంతోమంది ఇక్కడ విద్యను అభ్యసించిన వారే. ఎంతో విశిష్టత గల పాఠశాల మూతపడం పట్ల ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులు.. విచారం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో మూతపడుతున్న మొదటి ఎయిడెడ్ పాఠశాల మాంటిస్సోరినే. రాష్ట్రవ్యాప్తంగా 19 వందల 72 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిలో లక్షా 97 వేల 291 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఇదీ చూడండి: MPP SEATS: వైకాపా ఖాతాలో 626 ఎంపీపీ స్థానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.