పోలీసులు.. పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!

author img

By

Published : Feb 22, 2023, 7:42 AM IST

Third Degree on Pattabhi

Kommareddy Pattabhi Remanded: ముసుగు ధరించిన వ్యక్తులు తన ముఖానికి టవల్‌ చుట్టి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలుగుదేశం నేత పట్టాభి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌లో తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి హింసించారని.. వాపోయారు. గన్నవరం సీఐపై హత్యాయత్నం చేశారనే అభియోగాలపై పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా పట్టాభి తనగోడు వెళ్లబోసుకున్నారు జడ్జి ఆదేశాల మేరరకు పట్టాభికి పరీక్షలు చేయించారు. అనంతరం.. రిమాండ్‌కు తరలించారు .

Kommareddy Pattabhi Remanded: గన్నవరం సీఐపై హత్యాయత్నం చేశారనే అభియోగాలపై.. తెలుగుదేశం నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు.. గన్నవరం అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా.. పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని.. పట్టాభి ఫిర్యాదు చేశారు.

పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!

గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని తెలిసి అక్కడకు వెళ్తుండగా.. పోలీసులు గాంధీ బొమ్మ వద్దే తనను అదుపులోకి తీసుకున్నారని.. వివరించారు. తన వాహనంలోనే హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా గుడివాడ తీసుకెళ్లి.. అక్కడ పొలిమేరల్లో పోలీసు వాహనంలోకి ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారని.. వివరించారు స్టేషన్‌లోకి వెళ్లాక అకస్మాత్తుగా కరెంటు పోయిందన్నారు.

చీకట్లో.. ముసుగు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు తన ముఖానికి టవల్‌ కప్పి పక్క గదిలోకి ఈడ్చుకెళ్లి అర గంటసేపు చేతులు, అరచేతులు, అరికాళ్లపై తీవ్రంగా కొట్టారని.. పట్టాభి న్యాయమూర్తికి తెలిపారు. మంగళవారం ఉదయం గన్నవరం తీసుకొచ్చి ఊరి చివర చాలాసేపు ఉంచిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారని జడ్జికి.. పట్టాభి వివరించారు.

పట్టాభి ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఘర్షణల నేపథ్యంలో.. పట్టాభి చేతులకు స్వల్ప గాయాలయ్యాయే తప్ప.. పోలీసులు గాయపరచలేదన్నారు. ఈకేసులో మరికొందరు సాక్షుల్ని విచారించాల్సి ఉన్నందున రిమాండ్‌కు.. పంపాలని కోరారు. ఈ సందర్భంగా రిమాండ్‌ రిపోర్టులో పట్టాభిపై పోలీసులు.. మరో క్రైమ్‌ కేసును చేర్చారు.

టీడీపీ కార్యాలయంవద్ద అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గన్నవరం సీఐ కనకారావు సిబ్బందితో అక్కడికి వెళ్లారని, అదే సమయంలో పట్టాభి సహా 11 మంది టీడీపీ నేతలు విధులకు ఆటంకం కలిగించారన్నారు. సీఐని కులం పేరుతో తిట్టి.. చంపేందుకు కూడా కార్యకర్తల్నిరెచ్చగొట్టారని ఆరోపించారు. కార్యకర్తలు రాళ్లు విసరడంతో.. సీఐ తలకు గాయమైందన్నారు.

రిమాండ్‌ రిపోర్టు తప్పుల తడకగా ఉందని పట్టాభి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న పట్టాభిపై కావాలనే హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేశారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల విధ్వంసంలోనే సీఐకి గాయాలై ఉండొచ్చని.. టీడీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వి కార్లు దహనం చేసింది ప్రత్యర్థులేనని స్పష్టంచేశారు. గన్నవరం సీఐ ఎస్సీ కాదని, ఆయన క్రిష్టియన్‌ అని వాదించారు.

అందువల్ల.. ఈ కేసులో అట్రాసిటీ కేసు వర్తించదని పేర్కొన్నారు. అయితే.. సీఐ కనకారావు ఎస్సీ మాల వర్గానికి చెందినట్లు గన్నవరం తహసీల్దారు ధ్రువీకరించారని.. పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. పోలీసులు కొట్టారన్న పట్టాభి వాంగ్మూలం నమోదు చేసిన న్యాయమూర్తి.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి మళ్లీ తన ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. పోలీసులు.. ఆమేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండుగంటలపాటు వైద్య పరీక్షలు చేయించి.. తిరిగి గన్నవరం తీసుకెళ్లారు. కేసులో పట్టాభి మినహా మిగతా నిందితులను గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.