Schools Merge: 'విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా విలీనం చేయం'

author img

By

Published : Aug 2, 2022, 5:02 AM IST

Schools Merge

‘వియ్‌ ఆర్‌ నాట్‌ పర్‌ఫెక్ట్‌. ప్రభుత్వ స్థాయిలో తప్పులు జరుగుతుంటాయి. నేనేదో ఆర్డర్‌ ఇచ్చాను కాబట్టి చేసి తీరాలి అనట్లేదు’ అని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనంపై సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విలీనంపై వివిధ వర్గాల వ్యతిరేకతను విలేకరులు ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు.

మూడేళ్లలోనే ప్రాథమిక విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చామని, ప్రాథమిక విద్యా విధానం బలంగా ఉంటే భవిష్యత్తులో ఫలితాలు బాగుంటాయన్న ఉద్దేశంతోనే విలీన ప్రక్రియ చేపట్టామని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంతో కసరత్తు చేశామని, భాగస్వామ్య పక్షాలతో చర్చించామని గుర్తుచేశారు. తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా మీడియాలో వార్తలొస్తున్నాయని ఆక్షేపించారు. శిథిల భవనాలు, గదుల కొరత వంటివి ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు. వీటిని అధిగమించడానికి అనేక చర్యలు చేపట్టామని వివరించారు.

ఇబ్బందులున్న చోటే అభ్యంతరాలు: 3, 4, 5 తరగతులను ఇబ్బందుల్లేని చోట మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నాం. ఉదాహరణకు విలీనం కారణంగా ఒక ఉన్నత పాఠశాలకు వంద మంది పిల్లలు వస్తున్నారనుకుంటే, వారికి సరిపడా తరగతి గదులు, బెంచీలు ఉన్నాయా? తగినంత మంది సబ్జెక్ట్‌ టీచర్లున్నారా? అన్నవి పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ఈ సదుపాయాలు, సిబ్బంది లేనిచోటే అభ్యంతరాలొస్తున్నాయి. అందుకే దశల వారీగా అమలు చేస్తున్నాం. 2021-22 విద్యా సంవత్సరంలో 250 మీటర్లలోపు, 2022-23లో కిలోమీటర్‌లోపు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేశాం. మొదట 3 కి.మీ వరకు అనుకున్నప్పటికీ ఎమ్మెల్యేల సూచనలతో కిమీకు పరిమితం చేశాం. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోడానికి సమయం పడుతుంది. గుజరాత్‌లోనూ ఈ ప్రక్రియను ఈ ఏడాదే ప్రారంభించారు. చాలా రాష్ట్రాలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయి.

జేసీ కమిటీలతో అధ్యయనం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో గతంలో సమావేశాలు నిర్వహించగా జాతీయ విద్యా విధానాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇంకొందరు సొంత లాజిక్‌ చెప్పారు. స్కూళ్లు మూతపడతాయన్నారు. విద్యాశాఖ సెక్రటరీగా చెబుతున్నా.. స్కూళ్లు మూయం. విద్యాశాఖ మంత్రి కూడా ఇదే విషయం చెప్పినప్పటికీ స్కూళ్లు మూయడానికేనని ప్రచారం చేయడం తగదు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 820 అభ్యంతరాలపై జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీలు పరిశీలిస్తాయి. పిల్లలు హైవేలు, వాగులు దాటాల్సి వచ్చిన చోట విలీనం వద్దని ఎమ్మెల్యేలు సూచించారు. కమిటీ వద్దన్న చోట, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల పక్కపక్కన ఉన్నా చోట విలీనం వద్దనుకుంటున్నాం. ఉపాధ్యాయ పోస్టులను తగ్గించుకునేందుకే విలీనమన్న వాదన సరికాదు. 8,233 ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. 998 హెచ్‌ఎం పోస్ట్‌లు కొత్తగా అవసరమవుతున్నాయి. ఉపాధ్యాయుడు వారంలో 36 కంటే ఎక్కువ పీరియడ్లు బోధించాల్సి వస్తే వారి సమస్యలను పరిశీలిస్తాం. వచ్చే ఏడాదికల్లా 36 వేల అదనపు తరగతి గదులు అందుబాటులోకి తెస్తున్నాం.

ఇవీ చదవండి: తెలుగుదేశమా.. మీకు రోడ్డు వేసేయాలా ఏంటి?: మంత్రి అంబటి

'ద్రవ్యోల్బణం కట్టడి చేస్తున్నాం.. ఆర్థిక సంక్షోభం మాటే లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.