RGV On Movie Tickets: టికెట్ల అంశంపై వర్మ వరుస ట్వీట్లు.. ఏపీ సర్కార్​పై ప్రశ్నల వర్షం

author img

By

Published : Jan 11, 2022, 4:16 PM IST

Updated : Jan 12, 2022, 3:04 AM IST

RGV Tweets

16:14 January 11

ఒకవేళ ఆంక్షలు విధిస్తే ఆ వస్తువుల పేర్లు తెలపాలి: ఆర్జీవీ

ఆర్జీవీ ట్వీట్లు
ఆర్జీవీ ట్వీట్లు

RGV On Movie Tickets: సినిమా టికెట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఏకంగా గంటలో 24 ట్వీట్లు చేయడం ఆసక్తిగా మారింది. సోమవారం మంత్రి పేర్నినానితో భేటీ అయిన ఆయన.. చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా ట్వీట్లలో అందుకు భిన్నంగా స్పందించారు.

ఆర్జీవీ ట్వీట్ల సారాంశం...!

  • సినిమాల టికెట్ల ధరలకు విధించినట్లే రాష్ట్రంలో ఇంకేదైనా ఉత్పత్తిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందా?ఒక వేళ విధించి ఉంటే ఆ ఉత్పత్తుల పేర్లు, అందుకు కారణాలు తెలపాలి.
  • రూ.500 కోట్లతో తీసిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ రూ.కోటి తీసిన చిత్రంతో ఎలా పోలుస్తాం. చిన్న చిత్రాలతో సమానంగా భారీ చిత్రాల టికెట్‌ ధర ఎలా నిర్ణయిస్తాం.
  • సినిమా నిర్మాణ వ్యయంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం వాదించాలనుకుంటే అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకైనా వర్తిస్తుందా?
  • పోటీ ఆధారంగానే వస్తువుల నాణ్యత, ధర నిర్ణయిస్తారు. బాహ్య శక్తుల ఆధారంగా కంపెనీలు ధరలు నిర్ణయించవు.
  • తక్కువ ధరలకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేస్తే, అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు నాసిరకం ఉత్పత్తులు బయటకు వస్తాయి.
  • ఒక రాష్ట్రంలో సినిమా టికెట్‌ రూ.2,200లకు విక్రయిస్తుంటే, అదే సినిమా టికెట్‌ ఏపీలో రూ.200లకు ఎలా విక్రయిస్తారు. ఆర్టికల్‌14 ప్రకారం అది నిబంధనలు ఉల్లంఘించడం కాదా?
  • టికెట్ల ధరలు, సమయాలు, ప్రదర్శన విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు. ఇతర వస్తువుల ధరల విషయంలో లేని ప్రభుత్వ జోక్యం టికెట్లపై ఎందుకు?
  • రాత్రీ, పగలు థియేటర్‌లలో సినిమాలు ప్రదర్శిస్తే, వచ్చే ప్రమాదం ఏంటి? కొవిడ్‌ కన్నా ముందు మహారాష్ట్రలో 24/7సినిమాలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఇచ్చింది.
  • వినియోగదారుడి సమయానుకూలత, పని వేళలు బట్టి సినిమా ప్రదర్శనలు వేయవచ్చు కదా! వాళ్లకు ఉన్న వెసులుబాటు బట్టి అర్ధరాత్రి సైతం సినిమా చూసేలా అవకాశం ఎందుకు ఇవ్వకూడదు?
  • బెనిఫిట్ షోలకు టికెట్‌ ధరలు అధికంగా ఉన్నా, ప్రజలు కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం సమకూరదా?
  • ఒక నటుడికి నిర్మాత ఎంత పారితోషికం చెల్లిస్తున్నారనే విషయంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి?
  • పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర స్టార్స్‌కు ఎందుకంత పారితోషికం ఇస్తున్నారంటే, ఒక వేళ మనం ఐఫోన్‌ బద్దలు కొడితే అందులో వాడిన మెటీరియల్‌కు అయిన మొత్తాన్ని లెక్కకడితే రూ.1000 కూడా కాదు. కానీ, రూ.2లక్షలు పెట్టి మనం ఆ ఫోన్‌ కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్‌ తయారు చేసిన ఆలోచనకు అంత చెల్లిస్తున్నాం. బ్రాండ్‌, మార్కెట్‌ అలా డిమాండ్‌ చేస్తుంది.
  • 70ఏళ్లుగా అమలు చేస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం 1955ను ఏపీ ప్రభుత్వం తీసి అవతల పారేసింది. దీనిపై కోర్టులో సవాల్‌ చేయాలి.
  • ఈ విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ అమలు సబబే. కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌ను అమలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది?
  • ఒకవేళ ప్రజలపై ప్రభుత్వానికి మమకారం ఉంటే, ఎవరైతే సినిమా టికెట్‌ను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయలేరో వారికి సంక్షేమ పథకం కింద ప్రభుత్వమే రాయితీ కల్పించి విక్రయించవచ్చు కదా!
  • నేను చివరిగా చెప్పేది ఒక్కటే టికెట్‌ రేట్లు, థియేటర్‌లలో షోలు వదిలేసి, భద్రత, పన్నులపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.

'హూ కిల్డ్‌ కట్టప్ప'..?

ram gopal varma tweets: మహారాష్ట్రలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టికెట్‌ ధర రూ.2,200గా ఉందన్న వర్మ.. రాజమౌళి సొంత రాష్ట్రమైన ఏపీలో రూ.200కు కూడా అనుమతించని దుస్థితి ఉందని ఆక్షేపించారు.'హూ కిల్డ్‌ కట్టప్ప'..? అంటూ తనదైన శైలిలో సెటైర్ విసిరారు. వేర్వేరు టికెట్‌ ధరల నిర్ణయం ఆర్టికల్‌ 14 ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. రాత్రీపగలు ప్రదర్శనలకు అనుమతిస్తే నష్టమేంటని ప్రశ్నించారు. కొవిడ్‌ రాకముందు మహారాష్ట్రలో 24 గంటలూ షోలు నడిచాయని తెలిపారు.

సోమవారం మంత్రితో భేటీ.. ఆర్జీవీ ఏమన్నారంటే..?

RGV vs Perni Nani: సినిమా టికెట్‌ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం మంత్రి పేర్ని నానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ నిర్మాతగా తన అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చానన్నారు. టికెట్‌ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానన్న ఆయన...టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించినట్లు తెలిపారు. థియేటర్ల మూసివేతపై భేటీలో ఎలాంటి చర్చా జరగలేదని చెప్పారు. తాను చిత్ర పరిశ్రమ తరఫున చర్చలకు రాలేదని..,కేవలం తన వాదన వినిపించేందుకే వచ్చానని ఆర్జీవీ స్పష్టం చేశారు.

"సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం నాకుంది. టికెట్‌ ధర తగ్గిస్తే.. ఆ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై చర్యలు తీసుకోవచ్చు. పవన్‌, బాలకృష్ణను ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని అనుకోను. ఒకరిద్దరి కోసం మొత్తం పరిశ్రమను ఇబ్బంది పెడతారనుకోను. ఆర్ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్ వాయిదాకు టికెట్‌ ధరలే కారణం కావొచ్చు. "- ఆర్జీవీ

ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి నానితో చెప్పానని ఆర్జీవీ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉందో వివరించానన్నారు. టికెట్‌ ధరలు పెరిగితే జనం ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారని తెలిపారు. సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండింటిపైనా ఉందన్నారు. మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావించారని వెల్లడించారు.

"టికెట్‌ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. టికెట్‌ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించా. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదు. నా వాదన వినిపించేందుకే వచ్చా. మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావించారు. ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని చెప్పా. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉందో వివరించా. టికెట్‌ ధరలు పెరిగితే జనం ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారు. అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుంది.సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండింటిపైనా ఉంది." -ఆర్జీవీ దర్శకుడు

ఇదీ చదవండి

టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. ఆ హీరోలను టార్గెట్‌ చేశారనుకోను: ఆర్జీవీ

Last Updated :Jan 12, 2022, 3:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.