జగన్​ది శ్రీలంక ఎకనామిక్స్.. పాకిస్థాన్ పాలిటిక్స్: పయ్యావుల కేశవ్

author img

By

Published : Mar 16, 2023, 7:44 PM IST

పయ్యావుల కేశవ్

Payyavula Keshav on Budget : బడ్జెట్ లో ఆర్థిక మంత్రి బుగ్గన వాస్తవాలకు దూరంగా మాయా ప్రపంచం చూపించారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. మాటలు కోటలు దాటుతూ, చేతలు గడప దాటట్లేదనటానికి నీటి పారుదల రంగంలో కేటాయింపులు, ఖర్చులే ఓ ఉదాహరణ అని దుయ్యబట్టారు. వృద్ధి రేటు పెరిగినా విచిత్రంగా ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగాయని మండిపడ్డారు.

Payyavula Keshav on Budget : జగన్​ది శ్రీలంక ఎకనామిక్స్.. పాకిస్థాన్ పాలిటిక్స్ అని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎకనామిక్స్ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎదురు చూస్తోందని ఎద్దేవా చేశారు. బడ్జెట్​లో ఆర్థిక మంత్రి బుగ్గన వాస్తవాలకు దూరంగా మాయా ప్రపంచం చూపించారని విమర్శించారు. మాటలు కోటలు దాటుతూ, చేతలు గడప దాటట్లేదనటానికి నీటి పారుదల రంగంలో కేటాయింపులు, ఖర్చులే ఓ ఉదాహరణ అని దుయ్యబట్టారు.

వృద్ధి రేటు పెరిగితే ఆదాయం ఎందుకు పెరగడం లేదో.. నీటిపారుదల రంగానికి నాలుగు ఏళ్లలో 10వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ రంగానికి చేసిన కేటాయింపుల్లో 90శాతానికి పైగా ఖర్చు చేశామని గుర్తు చేశారు. వృద్ధి రేటు పెరిగితే ఆదాయం ఎందుకు పెరగడం లేదో సమాధానం చెప్పాలన్నారు. వృద్ధి రేటు పెరిగినా విచిత్రంగా ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగాయని మండిపడ్డారు. జగన్ ఓసారి నేల మీద నడిస్తే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయని, ఓసారి నడిచినందుకు ఏపీ చాలా ఇబ్బందులు పడుతోందని దుయ్యబట్టారు. జగన్ నేల మీద నడిస్తే.. ప్రజలు పరదాల చాటుకు పోతారని.., జగన్ నేల మీద నడవొద్దని కోరుకుంటున్నాం.. గాల్లో ప్రయాణిస్తేనే అందరికీ మంచిదని వ్యాఖ్యానించారు.

జగన్ పేదరికాన్ని నిర్మూలించడం కాదు.. పేదలను నిర్మూలిస్తున్నాడు.. గత ఎన్నికల్లో జగన్ క్యాస్ట్ వార్ చేశాడు. ఈ ఎన్నికల్లో క్యాష్ వార్ చేసేందుకే సిద్ధమవుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో క్యాష్ వార్ జరగదు.. పెర్పార్​మెన్స్​ వార్ జరుగుతుంది. - పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, టీడీపీ నేత

సభలో పెట్టిన వ్యవసాయ బడ్జెట్ మొత్తం అసత్యాలే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రూ.1.54లక్షల కోట్లు వ్యవసాయానికి ఖర్చు చేసినట్లుగా చెప్పినవన్నీ అబద్దాలే అని ఆరోపించారు. గత నాలుగు సంవత్సరాల్లో రైతుల గొంతు కోయడంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని విమర్శించారు. ఎక్కడా భూసార పరీక్షలు, మైక్రో ఇరిగేషన్ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా వరికి 20 వేల రూపాయలు ఉండే పెట్టుబడి కాస్తా ఇప్పుడు 35వేలకు పెరిగిందని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యల వృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.

బుగ్గన బుగ్గ నిండా అబద్దాలు పెట్టుకుని బడ్జెట్ గురించి చెప్పాడు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి పచ్చి అబద్దాలు చెప్పడాన్ని నేను విన్నాను. బడ్జెట్ కేటాయింపులన్నీ అవాస్తవాలే. భూసార పరీక్షలు చేయించడం వల్ల పెట్టుబడి 20 శాతం తగ్గిందని, దిగుబడి శాతం 20 శాతం పెరిగిందని చెప్పడం అబద్దం. వైఎస్సార్సీపీ అధికారంలోకీ రాకముందు ఎకరా వరి సేద్యానికి పెట్టుబడి 20వేల రూపాయలైతే.. ఇప్పుడు 35వేల రూపాయలకు పెరిగింది. - సోమిరెడ్డి, టీడీపీ నేత, మాజీ మంత్రి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.