ఆత్మస్థైర్యంతో ముందడుగు.. వ్యవసాయంలో రాణింపు

author img

By

Published : Mar 8, 2023, 9:12 PM IST

lady farmer special story in krishna district

Lady Farmer Rani: కలకాలం కలిసి ఉంటానన్న భర్త గుండెపోటుతో దురమయ్యారు. అసరాగా ఉంటారనుకున్న అత్తమామా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇలా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతోంది ఓ మహిళ. మగవారితో సమానంగా వ్యవసాయం చేస్తూ తోటి మహిళలకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం పాముల లంకకు చెందిన ఆ మహిళా రైతు వ్యవసాయ విధానంపై ప్రత్యేక కథనం మీ కోసం..

Lady Farmer Rani: వ్యవసాయమే కష్టతరమైపోతున్న ఈరోజుల్లో ఒక మహిళ ముందుకు వచ్చి ఎవరి ఆసరా లేకుండా వ్యవసాయం చేస్తోంది. చిన్నతనంలో తండ్రి నేర్పిన వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకు బండిని లాగుతోంది. కుటుంబ పరిస్థితులు భయపెడుతున్నా ఆమె మాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పాములలంకకు చెందిన రాణి అనే మహిళ వ్యవసాయం చేయడంలో మగవాళ్ల కంటే తానేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది.

సాధారణంగా వ్యవసాయం చేయడం అంటేనే రైతులకు పెద్ద సవాల్. కాలానికి అనుగుణంగా పంటలు వేయాలి. సకాలంలో పొలం పనులు చేయించాలి. ఇందుకు మగ రైతులే నానా అవస్థలు పడుతుంటారు. అయితే పాముల లంకకు చెందిన రాణి మాత్రం తనకు ఉన్న ఎకరం భూమిలో వాణిజ్య పంటలను పండిస్తున్నారు. రాణి భర్త ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. భర్త చనిపోయారని ఆమె కుంగిపోకుండా తన కాళ్లపై తాను నిలబడి బతకాలని నిర్ణయించుకుంది. అయితే భర్త చనిపోయినా ఆసరాగా ఉంటారనుకున్న అత్తామామలు కూడా కొన్నాళ్లకు చనిపోయారు. దీంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.

ఆమె కొన్నాళ్లు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేసింది. ఇందులో సంతృప్తి దొరకపోవడంతో.. తన తల్లిదండ్రులు నేర్పిన వ్యవసాయాన్ని చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే రాణి.. పాముల లంకలో తనకున్న ఎకరా భూమిలో మొక్కజొన్న, పూలు, పసుపు పంటలు సాగు చేస్తోంది. తన కుమార్తెను ఉన్నతంగా చదివించేందుకు ఆమె ఇలా కష్టపడుతున్నారు. కుమార్తెను డిగ్రీ చదివిస్తున్నారు.

ప్రస్తుతం అన్ని వాహనాలను అందరూ నడుపుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉండే ట్రాక్టర్​ మాత్రం ఇప్పటి వరకు ఆడవారు నడపడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ట్రాక్టర్​పై ప్రయాణం అంటే శరీరాన్ని ఇబ్బందులు పెట్టడమే అవుతుంది. మగవారికి ఎందులోనూ తీసిపోమని నిరూపించిన రాణి.. ట్రాక్టరును కూడా తోలుతున్నారు. ఇలా పొలాన్ని దమ్ము చేయడం నుంచి పంటలు సాగు చేయడం దాకా అన్నీ పనులనూ ఆమె చాకచక్యంగా చేసుకుంటున్నారు.

"మా ఇంట్లో పెద్దమ్మాయిని నేనే. మా నాన్న ఎక్కడికి వెళ్లినా నన్ను కూడా తీసుకునిపోయేవారు. మా నాన్న నన్ను మగవాళ్లతో సమానంగా పెంచారు. నాకు వ్యవసాయం కూడా నేర్పించారు. అయితే నాకు పెళ్లైన కొన్నాళ్లకు నా భర్త, అత్తమామలు చనిపోయారు. నాకు ఒక కూతురు ఉంది. దీంతో మా అత్తింటి వారికి ఉన్న ఎకరా పొలాన్ని ఎవరికీ కౌలుకు ఇవ్వకుండా నేనే వ్యవసాయం చేస్తూ.. నా కూతురిని చదివించుకుంటున్నాను." - రాణి, మహిళా రైతు

పాముల లంకలో పండిన పంటను, పూలను తీసుకుని ప్రతి రోజూ రాణి మార్కెట్లో అమ్ముకుని వస్తున్నారు. అలా వచ్చిన డబ్బులతో ఆమె కుటుంబాన్ని పొషిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని వ్యవసాయంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. రాణి వ్యవసాయం చేస్తున్న తీరును చూసి తోటి రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. జీవితంలో కష్టాలు రావడం సహజమని, కష్టాలు వచ్చినప్పుడు తట్టుకుని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని రాణి చెబుతున్నారు.

సమాజంలో ఉన్నతంగా బతకాలని భావిస్తున్న అతివలు భయాన్ని వదలి దైర్యంగా ముందడుగు వేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఇలా మహిళలంతా రాణిని స్ఫూర్తిగా తీసుకుని ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.