Pawan kalyan: పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి: పవన్ కల్యాణ్

Pawan kalyan: పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి: పవన్ కల్యాణ్
అచ్యుతాపురం సెజ్‌లో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎంతమంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమన్నారు.
Pawan kalyan: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో.. ఎంతమంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికార గణం నిర్లిప్తతే కారణమని ఆరోపించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ఇదే కంపెనీలో నెల క్రితమే ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇది పునరావృతం అయింది. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటనే వివరాలను అధికారులు, ఇటు కంపెనీ ప్రతినిధులు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు ఎంతో అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి కాదు. పారిశ్రామిక ప్రమాదాలు నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి. అవినీతికి తావులేకుండా ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలి. ఎటువంటి వైఫల్యం ఎదురైనా అందుకు ప్రభుత్వంలోని పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో అస్వస్థతకు గురైన మహిళా కార్మికులకు ప్రభుత్వం మేలైన వైద్యాన్ని, పరిహారాన్ని అందించాలి’’ అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం.. అన్నివేళలా అండగా ఉంటా'
నదిలో చిక్కుకున్న వృద్ధ జంట.. తాళ్లతో కాపాడిన సహాయక సిబ్బంది
