ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నిబంధనలు గల్లంతు.. పోలింగ్ కేంద్రాల్లో అధికార పక్షం ఆడిందే ఆట..

author img

By

Published : Mar 13, 2023, 4:07 PM IST

Updated : Mar 13, 2023, 5:12 PM IST

పోలింగ్‌ కేంద్రం

MLC Polling : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ చోట.. పదో తరగతి చదివిన వారికి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కల్పించగా.. మరో కేంద్రంలో ఓట్లు గల్లంతు కావడం బాధితులకు ఆగ్రహం తెప్పించింది. మరో కేంద్రంలో పోలింగ్ చీటీతో పాటు అభ్యర్థి ఫొటో స్లిప్పులు కూడా పంచగా.. ఇంకో కేంద్రంలో తన ఓటు ఎక్కడుందో చెప్పాలంటూ ఉపాధ్యాయురాలు ఆందోళనకు దిగింది. ఇవిలా ఉండగా చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ సహా కుటుంబ సభ్యుల 12 ఓట్లు గల్లంతు కావడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

MLC Polling : అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఓటు గల్లంతైంది. ఆయనతో పాటు విప్ కుటుంబ సభ్యుల 12 ఓట్లు లేవు. దీంతో విప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓట్లు గల్లంతైన విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని విప్ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నిబంధనలు గల్లంతు

ఎస్ఎస్ సి చదివి... తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రం వద్ద పదవ తరగతి చదివిన మహిళ గ్రాడ్యుయేట్‌ ఓటు వేసేందుకు వచ్చారు. అక్కడ ఉన్న మీడియా సిబ్బంది... ఏం చదివారు..? అని ప్రశ్నించగా పదో తరగతి చదివాను..` అని సమాధానం ఇచ్చింది. డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించగా మౌనమే సమాధానమైంది.

బీజేపీ ఆందోళన... వైఎస్సార్సీపీ నాయకులు దొంగ ఓట్లు వేసుకుంటున్నారని పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురంలో కేఎస్ఆర్ పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాయిలీలా అనే ఉపాధ్యాయురాలు.. ఓటు ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఎలక్షన్ పరిశీలకులను అడిగినా సమాధానం చెప్పడం లేదన్నారు. అధికారులే దొంగ ఓట్లు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన ఓట్లు గల్లంతు అయ్యాయని.. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫొటో... బేలుగుప్ప మండలంలోనూ దొంగ ఓట్ల వ్యవహారంపై టీడీపీ ఏజెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ యువతికి ఓటు స్లిప్పుతో పాటు వెఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఫొటో ఉండే స్లిప్పును ఇచ్చి పంపారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెట్ దీనిని గమనించి నిలదీశారు. పోలింగ్ కేంద్రం అధికారులు ఓటర్లను తనిఖీలు చేయకుండా కేంద్రంలోకి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారి బయట వ్యక్తులు ఆ స్లిప్పు ఇచ్చారని, తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. యువతి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫొటో ఉన్న స్లిప్పును తీసుకొని పడేశారు. అధికారులే వైఎస్సార్సీపీ నాయకులకు సహకరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

ఓటు వేసిన జేసీ... అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సామాన్యుడి లాగా క్యూలైన్లో నిల్చుకొని ఓటు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉందని.. ఓటు వేయడానికి వచ్చినవారు కన్ఫ్యూజ్ కు లోనవుతున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల ముందు నమూనా పెట్టి బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టభద్రులు, టీచర్లు ప్రలోభాలకు లోనవ్వడం చూస్తుంటే దేశం బాగుపడే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు చక్కగా ఆలోచించి మంచి నాయకున్ని ఎన్నుకుంటే బాగుంటుందన్నారు. ఒక ఉపాధ్యాయుడు ఓటుకు అమ్ముడపోనని ఫ్లెక్సీ వేయడం అభినందనీయమని ఆయన తెలియజేశారు.

మంత్రి పెద్దిరెడ్డి... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం ఓటు వేశారు. పుంగనూరు బసవరాజ ఉన్నత పాఠశాలలో ఎంపీ రెడ్డప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమల పోలింగ్‍ కేంద్రానికి సమీపంలో వచ్చిన టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

గుర్తింపు కార్డు లేదని... కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు గుర్తింపు కార్డు లేదని అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కొద్దిసేపు కార్యాలయంలో కూర్చున్నారు. అనంతరం తన సిబ్బంది ద్వారా తెప్పించుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి ప్రచారం.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని మంత్రి అప్పలరాజు పట్టభద్రులను కోరారు. శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఓటు వేసిన ఆయన... పట్టభద్రులంతా వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. అతి త్వరలో విశాఖ రాజధాని అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ ఏజెట్ల హల్చల్.. తిరుపతి జిల్లా నాయుడుపేట పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏజెంట్లుగా వచ్చి సెల్ ఫోన్ల లో మాట్లాడుతూ హల్ చల్ చేశారు. వేరే పార్టీల ఏజెంట్ల సెల్ ఫోన్లు అనుమతించలేదు. అధికారులు అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా సహకరిస్తున్నారు.

పచ్చ చొక్కా వేసుకున్నాడని... తిరుపతి జిల్లా నాయుడుపేట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పసుపు చొక్కా వేసుకున్న తిరుపతి జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి దార్ల రాజేంద్ర ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను పసుపు చొక్కా వేసుకుని పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో సీఐ ప్రభాకర్ అక్కడి నుంచి తోసుకుంటూ పంపించేశారు. తర్వాత అతను తెల్ల చొక్కా వేసుకుని రాగా, పోలీసులు అదుపులోకి తీసుకుని నాయుడుపేట పోలీసు స్టేషన్ నుంచి చిట్టమూరు తరలించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, యువకులు పోలీసు జీపుకు అడ్డం పడినా వెళ్లి పోయారు.

బహిరంగంగా డబ్బు పంపిణీ.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నాయకులు బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల కూతవేతవేటు దూరంలోనే డబ్బు పంపిణీ కొనసాగింది. ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయడం గమనార్హం.

ఓటర్లకు తప్పని ఇక్కట్లు.. నెల్లూరు జిల్లా అనంతసాగరం ఉన్నత పాఠశాల కేంద్రంలో దివ్యాంగులైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం వీల్ చైర్లు కూడా లేకపోవడంతో ఓటు వినియోగానికి వచ్చిన ఓటర్లకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో అవస్థలు పడుతూనే ఇతరుల సహాయంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వినియోగించుకున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Mar 13, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.