పింగళి వెంకయ్యకు అమిత్​ షా ఘన నివాళి.. స్మారక తపాలా బిళ్ల విడుదల

author img

By

Published : Aug 3, 2022, 5:08 AM IST

Amith shah on Pingali Venkaiah

భారతీయుల ఆకాంక్షలను మూడు రంగుల్లో నిక్షిప్తం చేశారని జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను కేంద్రమంత్రి కొనియాడారు. జాతీయ పతాక రూపకర్తకు కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్మారకంగా తపాలా బిళ్ల విడుదల చేసిన కేంద్రమంత్రి వారి కుటుంబ సభ్యులకు సన్మానించారు.

‘మనం ఎప్పుడూ త్రివర్ణ పతాక రూపకల్పనను మరిచిపోకూడదు. జెండా ప్రస్థానాన్ని అర్థం చేసుకుంటే పింగళి వెంకయ్యను గుర్తుచేసుకోకుండా ఉండలేం. ఆ స్వాతంత్య్రసేనాని కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను మూడు రంగుల్లో నిక్షిప్తం చేసి, దేశం మొత్తాన్ని ఏకం చేశారు. అందుకే ఆయనకు దేశం తరఫున శతకోటి నమస్కారాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఎన్నో భాషలు తెలిసిన ఆ మహాపురుషుడు లోకమాన్య తిలక్‌, మహాత్మాగాంధీ సిద్ధాంతాల ఆధారంగా సుదీర్ఘ జీవనం సాగించారు. ఎలాంటి పదవులు చేపట్టకుండానే దేశసేవకు అంకితమయ్యారు. 1921లో మహాత్మాగాంధీ కొత్త జాతీయ పతకాన్ని రూపొందించే బాధ్యతను పింగళి వెంకయ్యకు అప్పగించారు. సుభాష్‌చంద్రబోస్‌ 1943 డిసెంబర్‌ 29న పోర్ట్‌బ్లెయిర్‌ జింఖానా గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. త్యాగం, సమృద్ధి, శాంతికి ప్రతిబింబాలైన మూడు రంగులు, మధ్య 24 ఊచలతో ఉన్న ధర్మచక్రం భారత ఆకాంక్షల ప్రతీకలు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో కేంద్ర సాంస్కృతికశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌, సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డిలతో కలిసి పింగళి వెంకయ్య స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, వారి కుటుంబసభ్యులను సన్మానించారు. ‘పింగళి వెంకయ్య రూపొందించిన పతాకమే ఇప్పుడు దేశప్రతిష్ఠ. మన స్వాతంత్య్ర సమర చరిత్రను నేటి తరానికి చెప్పడానికే 13 నుంచి 15వ తేదీవరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలని ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. ఇది వెంకయ్యకు గౌరవం. 20 కోట్ల ఇళ్లపై ఒకేసారి పతాకం ఎగిరితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నేటితరానికి వెంకయ్య లాంటివారి జీవిత కథలను చెప్పాలనే ప్రధాని ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటినుంచి పాతికేళ్లు భారతీయులంతా కలిసికట్టుగా ప్రయత్నిస్తే భారత్‌ విశ్వగురు స్థానంలో నిలవడం ఖాయం. దానికి ప్రారంభమే ఇప్పుడు హర్‌ఘర్‌ తిరంగా. ప్రధాని పిలుపునిచ్చినట్లుగా ప్రతి భారతీయుడు సామాజిక మాధ్యమాల్లో త్రివర్ణపతాకాన్ని ఉంచాలి. 13 నుంచి 15వరకూ ప్రతి ఇంటిపై పతాకం ఎగురవేసి సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో ఉంచుదాం.. మహాన్‌ వెంకయ్యకు శ్రద్ధాంజలి ఘటిద్దాం’ అని అమిత్‌షా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్పతనాన్ని శ్లాఘించారు. పింగళి వెంకయ్య గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం తరఫున తొలిసారి దిల్లీలో ఇంత భారీస్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఒక అజ్ఞాతవీరుడిగా స్వాతంత్య్రోద్యమానికి ఇతోధిక సేవలు అందించినట్లు పేర్కొన్నారు. దేశంలో ప్లేగు సంభవించి ఎంతోమంది చనిపోతున్నప్పుడు ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాస్‌లో ప్రజల కోసం పనిచేశారని గుర్తుచేశారు.

పింగళి సేవలను 20 ఏళ్ల క్రితమే రాజ్యసభలో ఎలుగెత్తిన సినారె, కంభంపాటి: ఆజాదీకా అమృతమహోత్సవం సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన గురించి చట్టసభలో తొలిసారి ఎలుగెత్తిన ఘనత నామినేటెడ్‌ సభ్యుడు, ప్రముఖ కవి, దివంగత సి.నారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన కంభంపాటి రామమోహనరావుకు దక్కుతుంది. 2002 డిసెంబరు 18న వారు రాజ్యసభలో పింగళి అంశాన్ని వారు ప్రస్తావించారు. ‘‘మన జాతీయ జెండా స్వతంత్ర భారత గౌరవ, మర్యాదలకు ప్రతీక. ఆ మువ్వన్నెల జెండాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య 1921లో రూపొందించారు. గాంధీజీ విజయవాడకు వచ్చినప్పుడు దానికి ఆమోదముద్ర వేశారు. పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడు. అద్భుతమైన ప్రతిభామూర్తి. బహుభాషా కోవిదుడు. 1963 జనవరి 15న స్వర్గస్తులైన ఆయన సేవలను ఈ దేశం గుర్తుంచుకోవాలి. కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో ఆయన నివసించిన ఇల్లు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ప్రభుత్వం జోక్యంచేసుకొని ఆ మహానుభావుడి జ్ఞాపకార్థం శాశ్వత చర్యలు తీసుకోవాలి’’ అని వారు సభ దృష్టికి తెచ్చారు.

ఇవీ చదవండి: PINGALI VENKAYYA: ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

భూగర్భ జలాలు విషపూరితం.. కేంద్రం షాకింగ్ కామెంట్స్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.