జీవిత బీమా చేయించి.. ఆపై అంతమొందించి.. కేటుగాళ్ల నయా పాలసీ..

author img

By

Published : Jan 19, 2023, 10:14 PM IST

insurance money

Murders for Insurance Money: జీవిత బీమా డబ్బుల కోసం హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అనాథను ఎంచుకొని వాళ్ల పేరుమీద బీమా చేయించి, హత్యానంతరం క్లెయిమ్‌ను పొందడానికి ప్రయత్నించిన ఘటన ఒకటైతే... తనను పోలిన వ్యక్తిని హత్యచేసి, ఆపై తగులబెట్టి గుర్తుపట్టలేకుండా చేసిన ఘటన మరొకటి. మద్యానికి బానిసైన వాళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్లను ఎంచుకొని బీమా చేయించి ఆ తర్వాత హత్య చేయించి, బీమా డబ్బులు పంచుకున్న ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. ఈ హత్యలు అన్ని ఆ మధ్య కాలంలో వచ్చిన భద్రమ్ సినిమాను తలపిస్తున్నాయి.

Murders for Insurance Money: తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి కారులో తగులబడిపోయిన ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సంఘటనా స్థలంలో లభించిన గుర్తింపు కార్డును బట్టి సచివాలయ ఉద్యోగి ధర్మానాయక్‌గా గుర్తించారు. అయితే.. ధర్మానాయక్​పై దాదాపు రూ.7కోట్ల జీవిత బీమా ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.

స్టాక్ మార్కెట్‌లో నష్టపోయిన ధర్మానాయక్.. అప్పుల నుంచి బయట పడేందుకు పలు బీమా కంపెనీల్లో జీవితబీమా తీసుకున్నాడు. నిజామాబాద్‌కు చెందిన ఓ అనాథను మాయమాటల్తో కారులో ఎక్కించుకొచ్చి హత్య చేసి, కారులోనే దహనం చేశాడు. బీమా సొమ్ము చేతికొచ్చాక అప్పులు తీర్చేసి, రహస్యంగా జీవితం గడపాలని ఎత్తు వేశాడు. పోలీసులు ధర్మాతోపాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేశారు.

గతేడాది షాద్‌నగర్‌ సమీపంలోని మొగిలిగిద్దకు చెందిన శ్రీకాంత్, మరో ఇద్దరితో కలిసి బిక్షపతిని హత్య చేశారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులుకు భిక్షపతిపై రూ.50 లక్షల బీమా ఉన్నట్లు తెలిసింది. శ్రీకాంత్, సమ్మన్న, సతీష్ కలిసి భిక్షపతిని హత్య చేసినట్లు తేల్చారు. వీరికి హెడ్ కానిస్టేబుల్ మోతిలాల్ సాయం చేసినట్లు గుర్తించారు. హత్య జరిగిన ఏడాది తర్వాత అసలు విషయం గుర్తించిన షాద్‌నగర్ పోలీసులు ఈ నలుగురినీ అరెస్ట్ చేశారు.

రెండేళ్ల క్రితం నల్గొండ జిల్లాలోనూ ఇలాంటి జీవిత బీమా మోసం వెలుగులోకి వచ్చింది. దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన రాజు జీవితబీమా డబ్బును ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకున్నాడు. 2013 నుంచి కొంతమందిని ఎంపిక చేసుకొని సొంత డబ్బుతో వారికి జీవితబీమా చేయించాడు. పాలసీదారుడి భార్యను ఒప్పించి, అతన్ని హత్య చేయించాడు. వచ్చిన డబ్బులో భార్యకు కొంతిచ్చి, మిగతా సొమ్ము స్వాహా చేశాడు. ఇతనికి గ్రామ పెద్దలు, జీవిత బీమా కంపెనీల ప్రతినిధులు సైతం సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ బీమా హత్యలు, డబ్బు పంపకాల్లో పాలుపంచుకున్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నిచోట్ల చనిపోయిన వారు బతికే ఉన్నట్లు నమ్మించి, వాళ్లపైనా బీమా చేయించిన ఘటనలున్నాయి. ఏడాది తర్వాత డెత్ సర్టిఫికెట్ తీసుకొని, బీమా సొమ్ము క్లెయిమ్ చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిచోట్ల రహదారి ప్రమాదాల్లో జరుగుతున్న మరణాల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బీమా మోసగాళ్లకు కలిసి వస్తోంది. ప్రమాదం జరిగిన స్థలం, సమయం, కారణాలను సరిగ్గా విశ్లేషించక పోవడంతో నల్గొండలో బీమా ఏజెంట్ రాజు చేసిన హత్యలు పదేళ్ల వరకు బయటపడలేదు.

ముందు ఎవరైనా ఓ వ్యక్తిని హత్య చేయడం, ఆ తర్వాత అతని పోలికలుండే మరో వ్యక్తిని రంగంలోకి ప్రవేశపెట్టడం సాధారణంగా సినిమాలో చూస్తుంటాం. కానీ జీవితబీమా కోసం ఇలాంటి ఘటనలు మన చుట్టూ కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రమేయం లేకుండా జీవితబీమాకు సంబంధించిన సందేశాలు వస్తున్నట్లైతే సంబంధిత అధికారులను కానీ., పోలీస్ స్టేషన్‌ను కాని సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.