Asani Cyclone: అసని తుపాను.. అసలేం మిగలలేదంటున్న అన్నదాతలు
Updated on: May 12, 2022, 7:02 AM IST

Asani Cyclone: అసని తుపాను.. అసలేం మిగలలేదంటున్న అన్నదాతలు
Updated on: May 12, 2022, 7:02 AM IST
అసని తుపాను కృష్ణా జిల్లా ఉద్యాన రైతులను దెబ్బతీసింది. అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. వర్షాల కన్నా గాలుల వల్లే ఎక్కువ నష్టం జరిగింది. పంట నష్టంపై ఉద్యాన శాఖ అధికారులు అంచనాలు సేకరిస్తున్నా వివరాల నమోదులో నిబంధనలపై రైతులు ఆవేదన చెందుతున్నారు.
Cyclone Effect: అసని తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా.. అరటి, బొప్పాయి, నిమ్మ, మొక్కజొన్న, పసుపు తదితర ఉద్యాన,వాణిజ్య పంటలపై తుపాను ప్రభావం చూపింది. మూడు రోజులు వీచిన గాలులకు అరటి, బొప్పాయి తోటలు చాలా చోట్ల నేలకొరిగాయి. తోట్లవల్లూరు, అవనిగడ్డ, ఘంటసాల, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, మోపిదేవి మండలాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది.
చాగంటిపాడు, భధ్రరాజుపాలెం, వల్లూరివారిపాలెం గ్రామాల్లో అరటి రైతులు దెబ్బతిన్న పంటను చూసి ఆవేదన చెందుతున్నారు. పడిపోయిన తోటలు శుభ్రం చేసేందుకే ఎకరాకు 10 నుంచి 20 వేల రూపాయలు అదనంగా ఖర్చవుతాయని వాపోతున్నారు.
అరటి, బొప్పాయితోపాటు.. మొక్కజొన్న, పసుపు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడి కూడా రాదని కర్షకులు వాపోతున్నారు. ఉద్యాన పంట నష్టంపై అధికారులు అంచనా వేయిస్తున్నారు.
ఇదీ చదవండి: 'అసని' ధాటికి చెట్టు మీదపడి.. ఎంపీటీసీ మృతి
