వేల టీఎంసీల సాగునీరు సమద్రంపాలు - వైసీపీ నిర్లక్ష్య పాలనతోనే నేడు కరవు తాండవం

వేల టీఎంసీల సాగునీరు సమద్రంపాలు - వైసీపీ నిర్లక్ష్య పాలనతోనే నేడు కరవు తాండవం
AP Govt Not Using Water Properly for Agriculture: రాష్ట్రంలో కరవు తాండవిస్తోంది. ఇలాంటి పరిస్థితుల రాకుండా ఉండాలంటే ముందుగానే వరద జలాలను ఒడిసిపట్టి.. ప్రస్తుతం సద్వినియోగం చేసుకోవాలి. మిగిలిన రాష్ట్రాల్లో అయితే అలానే చేసేవారు. కానీ వైసీపీ పాలనలో అయితే గత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు చేయరు కదా.. అందుకే గోదావరి వరద జలాలను సద్వినియోగంతో పాటు పలు ఏంతో ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించి.. టెండర్లు ఆహ్వానించినా.. ఆ పనులన్నీ నిలిపేశారు. వేల టీఎంసీల నీరు వృథాగా పోయినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి దాపురించింది.
AP Govt Not Using Water Properly for Agriculture: గోదావరి, పెన్నా నదుల అనుసంధానం తొలిదశ ప్రాజెక్టుగా 6,020.15 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వంలో చేపట్టిన పనులకు జగన్ ప్రభుత్వం బ్రేక్ వేసింది. గోదావరి వరద జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి మళ్లించి.. వైకుంఠపురం వద్ద నుంచి ఆ నీటిని ఎత్తిపోసి సాగర్ కాలువకు మళ్లించే పథకాన్ని చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారు. ప్రతి సంవత్సరం గోదావరి వరద సమయంలో 73 టీఎంసీల జలాలను ఇలా సాగర్ ఆయకట్టుకు మళ్లించవచ్చని ఎత్తిపోతలకు రూపకల్పన చేశారు.
చింతలపూడి ఎత్తిపోతల పంపుహౌస్ ద్వారా ఆ నీటిని పోలవరం కుడి కాలువకు మళ్లించి ప్రకాశం బ్యారేజికి తరలించాలనేది ప్రణాళిక. ఈ నాలుగేళ్లలో ఆ పథకం పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది సాగర్ ఆయకట్టు రైతుల పంట పండేది. లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యం చేసింది. ఈ ఏడాది కరవు కమ్మేయడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. అదే సమయంలో గోదావరిలో వేల టీఎంసీల నీరు వృథాగా పోయింది.
ఎన్నో ఏళ్లుగా కృష్ణా నది నీళ్లు దిగువకు రావడం లేదు. ఎగువ రాష్ట్రాలను దాటి తెలుగు రాష్ట్రాలకు నీరు చేరకపోవడంతో ఎక్కడో దిగువన ఉన్న సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుల రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వెతలు తీర్చేలా గోదావరి నీటిని కృష్ణా డెల్టా ఆయకట్టుకు మళ్లించేలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించారు. దీని వల్ల ఎన్నో ఏళ్ల సంవత్సరాల రైతులు ప్రయోజనం పొందారు.
ఈ సంవత్సరం కూడా కృష్ణా డెల్టాను పట్టిసీమ ఎత్తిపోతలే ఆదుకుంది. పట్టిసీమ తరహాలోనే సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని చంద్రబాబు తలపోశారు. ఈ మేరకు 73 టీఎంసీలు మళ్లిస్తే సాగర్ కుడి కాలువ కింద 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సమస్య తీరేది. కానీ జగన్ అధికారంలోకి రాగానే తగినన్ని నిధులు ఇవ్వకుండా.. భూసేకరణ సమస్య పరిష్కరించకుండా పథకాన్ని అటకెక్కించారు.
ఈ ఏడాది కృష్ణా పరీవాహకంలో ఎన్నడూ లేని విధంగా కరవు వచ్చింది. ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండలేదు. సాగర్ కుడి కాలువ కింద ఆయకట్టు సాగుకు.. నీళ్లు ఇవ్వలేమని సర్కారు తేల్చి చెప్పేసింది. దీంతో సాగర్ కుడి కాలువ కింద గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని 11 లక్షల 16 వేల 622 ఎకరాల ఆయకట్టులో రైతులు చాలావరకు సాగు వదిలేయాల్సి వచ్చింది.
సాగర్ కుడి కాలువకు 132 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నా ఆ నీళ్లను ఇవ్వలేదు. అక్కడక్కడ అరుతడి పంటలు సాగు చేసినా వాటికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. బోర్డు, వాగుల నీటిని ఎత్తిపోసి సాగు చేసినా సమస్యలు తప్పలేదు. అదే తెదేపా ప్రభుత్వం చేపట్టిన గోదావరి, పెన్నా అనుసంధానం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 73 టీఎంసీల గోదావరి జలాలు ఈ ఆయకట్టుకు చేరేవి. సముద్రం పాలవుతున్న నీటిని సాగర్ ఆయకట్టుకు చేరువ చేసి ఉంటే వేల కోట్ల పంట రైతుల చేతికి అందేది.
గోదావరి నదిలో ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు 10 వరకు 2వేల 794 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలిశాయి. 2022 జూన్ 1 నుంచి 2023 మే 31 వరకు 6 వేల 252 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలైయ్యాయి. నిరుపయోగంగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని ప్రభుత్వం ఈ ఏడాది సాగర్ డెల్టా ఆయకట్టుకు మళ్లించగలిగి ఉంటే వేలాది మంది రైతుల జీవితాలు పచ్చగా ఉండడంతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తికి మరింత సంపద వచ్చి చేరేది.
