AP Govt on Liquor ban: మడమ తిప్పిన ప్రభుత్వం.. ఇదేనా మద్యనిషేధం??

author img

By

Published : Aug 2, 2022, 5:02 AM IST

Liquor ban

AP Govt on Liquor ban: మద్యనిషేధంపై ఏపీ ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని విస్మరించింది. ఇచ్చిన హామీలన్నింటికీ తూట్లు పొడిచింది. బార్ల సంఖ్య తగ్గించకుండానే 2025 ఆగస్టు వరకూ లైసెన్సులు జారీ చేసింది.

AP Govt on Liquor ban: దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని ప్రతిపక్ష నేత హోదాలోనూ, ఎన్నికల్లో గెలిచిన తర్వాతా పలు సందర్భాల్లో చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మడమ తిప్పేశారు. హామీలకు నీళ్లొదిలేశారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. తాజా విధానంలో బార్ల సంఖ్య తగ్గించలేదు సరికదా మూడేళ్ల కాలపరిమితితో వాటికి లైసెన్సులు జారీ చేశారు. ఫలితంగా 2024 నాటికి కాదు కదా.. 2025 ఆగస్టు 31 వరకూ మద్యనిషేధానికి అవకాశమే లేదంటూ చెప్పకనే చెప్పారు.


కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాత కేవలం 5 నక్షత్రాల హోటళ్లలోనే మద్యం దొరికేలా చేస్తాం.

-2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ

ద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం. అందుకే దశలవారీ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం. దానిపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల నాటికి కేవలం అయిదు నక్షత్రాల హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లడుగుతాం. మద్యంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించటంతో పాటు పునరావాస కేంద్రాల్ని పెంచుతాం. - 2019 ఎన్నికల్లో గెలిచాక మే 26న దిల్లీలో నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో జగన్‌ వ్యాఖ్యలు

చంద్రబాబు మద్యాన్ని నిషేధిస్తారో లేదో నాకు తెలీదు. ఆయన ప్రభుత్వం దిగిపోతుంది.. రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. డబ్బులున్నవాడో, సూటుబూటు వేసుకున్నవాడో 5 నక్షత్రాల హోటళ్లకు వెళ్లి తాగితే ఫర్వాలేదు కానీ ఇంత విచ్చలవిడిగా ప్రజలతో మద్యం తాగిస్తారా? దీనివల్ల పిల్లల చదువులూ దారి తప్పుతున్నాయి. పదో తరగతి పాసవుతూనే మద్యం దుకాణాల వైపు చూస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 5 నక్షత్రాల హోటళ్లు మినహా ఇంకెక్కడా మద్యం లభించకుండా చేస్తాం.

- ప్రతిపక్ష నేత హోదాలో విజయవాడలో 2015 డిసెంబరు 8న విలేకరులతో జగన్‌ వ్యాఖ్యలు

నూతన విధానంలో భాగంగా రెండు రోజులపాటు 838 బార్లకు వేలం నిర్వహించారు. 815 బార్లకు లైసెన్సులు ఖరారు చేశారు. చాలా చోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి కనీస ధరపై అదనంగా రూ.2 లక్షలు, రూ.4 లక్షలు మాత్రమే పాడి లైసెన్సులు దక్కించుకున్నారు. అయినా మొత్తంగా 51 బార్లు వేలంలో రూ.కోటి పైనే పలికాయి. మరికొన్ని రూ.90 లక్షల నుంచి రూ.కోటి మధ్య పలికాయి. మొత్తంగా ప్రభుత్వానికి రూ.597 కోట్ల ఆదాయం సమకూరింది.

* భారీ మొత్తాలు వెచ్చించి బార్ల లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు.. పెట్టుబడిని రాబట్టుకోవటంతో పాటు అదనంగా లాభాలు ఆర్జించాలంటే మద్యం విక్రయాల పరిమాణాన్ని పెంచుకుంటారు. అమ్మకాలను మరింత పెంచడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల దశలవారీ మద్య నిషేధం ఎలా సాధ్యమవుతుంది?

* కడప నగరంలో ఇప్పటివరకూ బారు లైసెన్సు రుసుము రూ.35 లక్షలు. అక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.1,83,90,000కు వేలం పాడి ఓ వ్యాపారి లైసెన్సు దక్కించుకున్నారు. ఆ మొత్తం రాబట్టుకోవాలంటే రోజుకు కనీసం రూ.3-4 లక్షల వ్యాపారం చేయాలి. దీని కోసం విక్రయాలను పెంచటంతో పాటు, అదనంగా భారీ రేట్లు పెట్టి అమ్మాల్సి వస్తుంది. భారీ మొత్తాలకు వేలం పాడి బార్ల లైసెన్సులు దక్కించుకున్న అన్ని చోట్లా ఇదే పరిస్థితి. వీటన్నింటితో వినియోగదారుడిపై మరింత భారం పడుతుంది.

* ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటం కోసం మద్యం తాగేవారిని మరింత పిండేయటమే తప్ప.. ఇది మద్యనిషేధం ఎలా అవుతుంది?

ఈ ప్రభుత్వ హయాంలో చేయలేం అన్నట్లేగా..

* తాజాగా ఎక్సైజ్‌ శాఖ మూడేళ్ల కాలపరిమితితో 2025 ఆగస్టు 31 వరకు బార్ల లైసెన్సులు జారీ చేసింది. జగన్‌ హామీ ఇచ్చినట్లు 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే.. 2025 ఆగస్టు 31 వరకూ బార్ల లైసెన్సులు ఎలా ఇస్తారు? ఇది మడమ తిప్పటం కాదా?

* ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం 2024 మే వరకే ఉంది. ఇప్పుడు జారీ చేసిన బార్ల లైసెన్సుల కాలపరిమితి 2025 ఆగస్టు 31 వరకూ ఉంది. అంటే ఈ ప్రభుత్వ హయాంలో మద్య నిషేధం అమలు చేసే అవకాశం అసలు లేనట్టే కదా! ఆ హామీకి నీళ్లొదిలేసినట్లు కాదా?

* 2025 ఆగస్టు నెలాఖరు వరకూ కాలపరిమితితో లైసెన్సులు జారీ చేసి... 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం చేయటం ఎలా సాధ్యం? 2024 నాటికే కాదు.. ఆ తర్వాత కూడా మద్యనిషేధం ఉండదని ప్రభుత్వం చెప్పకనే చెబుతున్నట్లు కాదా?
బార్ల సంఖ్య ఎందుకు తగ్గించలేదు?

* వైకాపా అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. 2019 నవంబరు 22న వాటి లైసెన్సులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో కొత్త వాటి ఏర్పాటుకు రెండేళ్ల కాలపరిమితితో (2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకూ) నూతన బార్ల విధానాన్ని ప్రకటించింది.

* దశలవారీ మద్యనిషేధంలో భాగంగా 840 బార్లలో 40 శాతం తగ్గించి, మిగతా 60 శాతం బార్లకే లైసెన్సులు ఇస్తామని ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది. వాటిలోనూ 487 బార్లకే నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే తమకు 2022 జూన్‌ నెలాఖరు వరకూ కొనసాగే హక్కు ఉందని బార్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ బార్లు ఇప్పటి వరకూ కొనసాగాయి.

* అప్పట్లో దశలవారీ మద్యనిషేధమంటూ బార్ల సంఖ్యను కుదించిన ప్రభుత్వం.. తాజా విధానంలో మాత్రం వాటి సంఖ్యను తగ్గించనే లేదు. 838 బార్లకు వేలం నిర్వహించింది.

కొత్త ప్రాంతాల్లోకి అందుబాటులో మద్యం.. ఇదేనా మద్యనిషేధం?

గతంలో నగరపాలక సంస్థల సరిహద్దుల నుంచి 5 కిలోమీటర్ల వరకూ, పురపాలక, నగర పంచాయతీల సరిహద్దుల నుంచి 2 కి.మీ. వరకూ మాత్రమే బార్ల ఏర్పాటుకు అవకాశం ఉండేది. ఇప్పుడు నగరపాలక సంస్థల సరిహద్దుల నుంచి 10 కి.మీ, పురపాలక, నగర పంచాయతీల సరిహద్దుల నుంచి 3 కి.మీ. దూరం వరకూ బార్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఫలితంగా ఇప్పటి వరకూ బార్లు లేని శివారు ప్రాంతాల్లోనూ కొత్తవి వచ్చాయి. ఇది కొత్త ప్రాంతాల్లో మద్యం అందుబాటులోకి తీసుకురావటమే కదా? ఇది దశలవారీ మద్యనిషేధం ఎలా అవుతుంది?

అదనంగా రూ.308 కోట్ల ఆదాయం

రాష్ట్రంలోని 840 బార్లకు సంబంధించి లైసెన్సు, తిరిగి చెల్లించని ఇతర రుసుముల రూపంలో ప్రభుత్వానికి 2019-20లో రూ.238 కోట్లు, 2020-21లో రూ.262 కోట్లు, 2021-22లో రూ.289 కోట్లు ఆదాయం వచ్చింది. తాజాగా 838 బార్లకు వేలం నిర్వహించి.. 815 బార్లకు లైసెన్సులు ఖరారు చేశారు. తద్వారా ప్రభుత్వానికి రూ.597 కోట్ల ఆదాయం సమకూరింది. 2021-22తో పోలిస్తే ఇది రూ.308 కోట్లు ఎక్కువ. బార్ల వేలం కోసం ప్రభుత్వం నిర్ణయించిన అప్‌సెట్‌ ధర, వార్షిక లైసెన్సు రుసుములపై ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. ఆ మేరకు ప్రతి సంవత్సరమూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ పెరుగుతుంది.

ఇవీ చదవండి: తెలుగుదేశమా.. మీకు రోడ్డు వేసేయాలా ఏంటి?: మంత్రి అంబటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.