చనిపోతున్న మత్స్యసంపద.. ఉపాధి లేక రోడ్డున పడిన గంగపుత్రులు

author img

By

Published : Mar 9, 2023, 9:26 AM IST

Dr BR Ambedkar Konaseema District

Dr BR Ambedkar Konaseema District: వాళ్లు సముద్ర తీరంలో చిత్తడి నేలల్లోని పర్ర భూముల్లో చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారులు. ఐతే కొంతకాలంగా టన్నుల కొద్దీ చేపలు చనిపోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. విలువైన మత్య్సరాశితోపాటు గుడ్లు పెట్టే దశలోని చేపలు చనిపోతున్నందున.. ఏడాది వరకు జీవనోపాధి కష్టమేనని కలత చెందుతున్నారు. సముద్రంలో చమురు వెలికితీత కార్యకలాపాలు, ఆక్వా వ్యర్థాలు వదిలేయడం వల్లే.. ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు గంగపుత్రులు.

చనిపోతున్న మత్స్యసంపద.. ఉపాధి లేక రోడ్డున పడిన గంగపుత్రులు

Dr BR Ambedkar Konaseema District: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని సముద్ర తీర మత్స్యకార గ్రామం ఎస్‌ యానాం. ఈ గ్రామంలో నాచుపర్ర, డల్ల పర్ర వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉంది. గ్రామంలోని మత్స్యకారులు సముద్రంలో బోట్లపై నేరుగా చేపల వేట సాగించకుండా ఈ పర్ర భూముల్లోనే చేపలు పట్టి జీవనం చేయడం ఆనవాయితీ. తాజాగా పర్ర భూముల్లో గత 20 రోజులుగా చేపలు, పీతలు, రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. విలువైన మత్స్య సంపద చనిపోయి ఒడ్డుకు కొట్టుకోస్తోంది. వేటాడితేగాని పూడగడవని గంగపుత్రుల్ని ఈ అనూహ్య పరిణామం అయోమయంలోకి నెట్టేసింది. వారి జీవనాధారానికి గండి పడింది. దశాబ్దాలుగా ఇక్కడ చమురు సంస్థలు సహజవాయువు, చమురు వెలికితీత కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అలాగే పర్ర భూముల్ని ఆక్రమించి అనధికార ఆక్వా సాగు జోరుగా సాగుతోంది. రసాయన వ్యర్థాలు శుద్ధి చేయకుండా సాగర జలాల్లోకి వదిలివేయడం వల్లే సాగర జలాలు కలుషితమై మత్స్య సంపదకు ముప్పు తెస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాచుపర్ర, డల్లపర్ర ప్రాంతాల్లో చేపలు, రొయ్యలు, పీతలు తదితర మత్స్యసంపద చనిపోడాన్ని స్థానికులు సమీప సంస్థల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 3న ఆయా పరిశ్రమల రసాయనాల కారణంగానే చేపలు చనిపోతున్నాయంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఐతే పరిశీలన చేసిన తర్వాతనే చేపలు చనిపోవడానికి కారణం చెబుతామని అధికారులు చెబుతున్నారని.. అప్పటిదాకా మా పరిస్థితి ఏంటని స్థానిక మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారులు తమ సమస్యను మంత్రి విశ్యరూప్‌, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. జీవనోపాధి కోల్పోతున్నందున పరిహారం ఇప్పించాలని కోరారు. వారు స్పందించి విచారణ కోసం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పర్యటించి నమూనాలు సేకరించారు. రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు చిత్తడి నేలలు, మొగ ప్రాంతాన్ని పరిశీలించి మత్సకారులతో చర్చించారు. చేపలు చనిపోవడంపై పరిశీలన కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తాజా పరిస్థితులతో తమ జీవనానికి తీవ్ర గండి పడిందని.. ఆదుకోవాలని మత్స్యకార కుటుంబాలు వేడుకొంటున్నాయి.

ఈ చేపలు ముఖ్యంగా ఆక్సిజన్​ తగ్గడం వలన చనిపోయాయని ప్రాధమిక అంచనాకు రావడం జరిగింది. కాకినాడ నుంచి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వచ్చి పర్యటించి నమూనాలు దాదాపుగా ఆరు చోట్ల నుంచి సేకరించడం జరిగింది. ఇసుక, నీళ్లు నమూనాలను తీసుకున్నారు. అన్ని రకాల పరీక్షలు వారు చేస్తారు. వారి దగ్గర నుంచి రిపోర్ట్​ వచ్చాక మేము దీని మీదకు ఒక అవగాహన రావడం జరుగుతుంది.- షేక్‌ లాల్‌ మహమ్మద్‌, మత్స్యశాఖ జేడీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.