CROP INSURANCE: పొలం ఒకరిది.. పరిహారం మరొకరికి!

author img

By

Published : Jun 22, 2022, 12:10 PM IST

CROP INSURANCE

CROP INSURANCE: పంట నష్టపోయిన రైతుకు దక్కాల్సిన బీమా మొత్తం.. సెంటు భూమి లేని వ్యక్తుల ఖాతాల్లో జమయింది..! అన్నదాతను ఆదుకునేందుకు వెచ్చించాల్సిన నిధులు.. అధికార పార్టీ అనుంగులు, వాలంటీర్లు, వారి కుటుంబసభ్యుల ఖాతాల్లో చేరాయి..!! పంట బోదెలు, ఇతర రైతుల సర్వే నెంబర్ల మీద పంట పరిహారం, బీమా డబ్బులు కాజేసిన వైనం.. కోనసీమ జిల్లా ఆలమారు మండలంలో కలకలం రేపుతోంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.

CROP INSURANCE: కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో వెలుగుచూసిన అవినీతి సంచలనంగా మారింది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వమిచ్చే పరిహారం, బీమా డబ్బులు.. సంబంధం లేని వ్యక్తుల ఖాతాల్లో జమకావడం.. అన్నదాతల్లో ఆందోళనకు దారితీసింది. ఆలమూరుకు చెందిన పలువురు రైతులకు చెందాల్సిన పరిహారం, బీమా డబ్బులు.. ఖాతాలు మారాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు.. తెలుగుదేశం పార్టీ నేత, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో.. రైతులు ఆలమూరులోని వ్యవసాయశాఖ కేంద్రాన్ని ముట్టడించారు. గ్రామంలోని రైతుల సర్వే నెంబర్లు పరిశీలించగా.. వారికి రావాల్సిన డబ్బు అధికార పార్టీ నాయకుల ఖాతాల్లోకి చేరిందని తేలింది. ఆలమూరు రైతులకు దక్కాల్సిన బీమా మొత్తాలు.. సూర్యారావుపేటలోని సర్పంచ్ భర్త, వాలంటీర్‌, అతడి కుటుంబసభ్యులు, కొందరు అధికార పార్టీ కార్యకర్తల బ్యాంకుల్లో జమయ్యాయి.

పొలం ఒకరిది.. పంట బీమా పరిహారమొకరిది

సూర్యారావుపేటకు చెందిన 17 మంది వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తుల ఖాతాల్లో 10 లక్షల 87 వేల 362 రూపాయల పరిహారం సొమ్ము జమయినట్లు గుర్తించారు. సూర్యారావుపేట సర్పంచి భర్త నాగేశ్వరరావు పేరు మీద 88 వేల 530, గ్రామ వార్డు సభ్యురాలి భర్త పేరు మీద 19 వేల 986, వాలంటీర్ పేరు మీద 14 వేల 966 రూపాయలు జమయ్యాయి. మరికొందరు వైకాపా కార్యకర్తలకూ నగదు జమ అయ్యిందని రైతులు వాపోయారు. తమకు చెందాల్సిన పరిహారాన్ని వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు.

నష్టపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయకపోతే.. ఉద్యమిస్తామని.. తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు. ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు తేలుస్తామని.. వ్యవసాయ అధికారి చెప్పారు. అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.